
మనవడు, మనవరాలే అతిథులుగా...
సాధారణంగా కొత్త సినిమా పూజా కార్యక్రమాలకు చిత్ర పరిశ్రమలోని పెద్దలను, శ్రేయోభిలాషులను అతిథులుగా ఆహ్వానిస్తుంటారు. లేదా యూనిట్ సభ్యుల సమక్షంలో పూజలు జరిపించేస్తారు. ‘పెళ్లి చూపులు’ ఫేమ్ విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో జీఏ2 పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్ని’ వాసు నిర్మిస్తున్న సినిమా శుక్రవారం పూజా కార్యక్రమాలతో మొదలైంది.
ఈ కార్యక్రమం ప్రత్యేకత ఏమిటంటే... అల్లు అరవింద్ మనవడు, మనవరాలు అతిథులుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి అల్లు అర్జున్ తనయుడు అయాన్ కెమేరా స్విచ్చాన్ చేయగా, అల్లు వెంకట్ తనయ అన్విత క్లాప్ ఇచ్చారు. ‘‘రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ఇది. మే రెండోవారంలో చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అన్నారు ‘బన్ని’ వాసు. ఈ చిత్రానికి కెమేరా: మణికంఠన్, సంగీతం: గోపీసుందర్.