
దుబాయ్‌లో గల్ఫ్ పాటలు!
దేశం కాని దేశం గల్ఫ్‌కు వలస వెళ్లి, అక్కడ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని విజయతీరాలకు చేరుకున్న ఎంతో మంది భారతీయుల విజయగాథలే కథాంశంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘గల్ఫ్’. పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో యెక్కలి రవీంద్రబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రవీణ్ ఇమ్మడి స్వరపరిచిన ఈ చిత్రం పాటల్లోని ఓ పాటను, ఈ సినిమా టీజర్‌ను దుబాయ్‌లో ఆవిష్కరించారు. గల్ఫ్ వలసల మీద రూపొందిస్తున్న సినిమా కావడంతో దుబాయ్‌లోని జజీరా ఎమిరేట్స్ పవర్ అనే కంపెనీకి చెందిన సోనాపూర్ లేబర్ క్యాంప్‌లో ఈ వేడుక నిర్వహించారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘గల్ఫ్‌లో స్థిరపడిన చాలామంది భారతీయులను కలిసి వారి నుంచి సమాచారాన్ని సేకరించాం.
దాదాపు 500 కేస్ స్టడీస్ ఆధారంగా కథ తయారు చేశాను. హీరో-హీరోయిన్లుగా కొత్తవాళ్లు నటిస్తున్న ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, ఎల్.బి శ్రీరామ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూలైలో విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఎస్.వి.శ్రీరామ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బి.బాపిరాజు.