చెన్నై: నచ్చినోడు దొరికితే పెళ్లి చేసుకొని సెటిల్ అయితపోతానంటోంది హీరోయిన్ కాజల్ అగర్వాల్. దక్షిణాదిలోనే పుష్కర కాలాన్ని చాలా సునాయాసంగా దాటేసిన ఆ ఉత్తారాది బ్యూటీ నేటీకి క్రేజీ హీరోయిన్‌గా రాణిస్తోంది. తాజాగా అజిత్‌తో రొమాన్స్ చేసిన వివేకం చిత్రం రికార్డు స్థాయిలో ఆడేస్తోంది. మరో స్టార్ హీరో విజయ్‌కు జంటగా నటించిన మెర్శల్ సినిమా దీపావళికి తెరపైకి రానుంది.
ఇక హిందీ చిత్రం క్వీన్ రీమేక్‌లో నటించడానికి రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే విధంగా బాలీవుడ్‌లోనూ తన ఉనికిని చాటుకుంటున్న ఈ అమ్మడు వాణిజ్య ప్రకటనలతోనూ సంపాదించేస్తోంది. ఆ మధ్య నేను పక్కా లోకల్ అంటూ ఐటమ్ సాంగ్‌లోనూ నటించి ఆ ముచ్చట తీర్చేసుకుంది. అయితే కాజల్ ఇచ్చిన ఇంటర్వ్యూ చూద్దాం.
అజిత్‌కు జంటగా వివేకం చిత్రంలో నటించిన అనుభవం గురించి?
నిజం చెప్పాలంటే నేనింతకు ముందు స్పై థ్రిల్లర్ కథా చిత్రంలో నటించలేదు. అదీ ఇంటర్నేషనల్ స్పై చుట్టూ తిరిగే కథా చిత్రం వివేకం. వివేకం చిత్రంలో నటించే అవకాశం రావడం నాకు లక్కే. అజిత్‌తో కలిసి నటించే అవకాశం ఇచ్చిన దేవుడికి స్పెషల్ థ్యాంక్స్.
అజిత్‌తో కలిసి నటించిన హీరోయిన్లందరూ ఆయన్ని తెగ పొగిడేస్తుంటారు. మీరెలా స్పందిస్తారు?
అజిత్‌ను నేనూ పొగిడేస్తాను. ఆయన చాలా కూల్ పర్సన్. మనసు విప్పి మాట్లాడతారు. ఆదే ఆయనలో నాకు నచ్చిన విషయం. షూటింగ్‌లో సహ నటీనటులను ఎలా గౌరవిస్తారో, చిన్న టెక్నీషియన్‌ను కూడా అంతే గౌరవిస్తారు. నేను కలుసుకున్న మంచి వారిలో అజిత్ ఒకరు.
ఇద్దరు లేక ముగ్గురు హీరోయిన్ల చిత్రాల్లో కూడా నటిస్తున్నారు. మీ పాత్రకు ప్రాధాన్యత తగ్గుతుందన్న భయం లేదా?
కథ, అందులో నా పాత్ర ఏమిటన్నది, ఇంకా ఏఏ హీరోయిన్లు నటిస్తున్నారు, అన్న విషయాలను అడిగి తెలుసుకున్న తరువాతే ఆ చిత్రంలో నటించడానికి అంగీకరిస్తాను. అలాంటప్పుడు భయం ఎందుకు? నాకు నమ్మకం ఉన్న దర్శకుల చిత్రాల్లోనే నటిస్తాను.
హీరోయిన్‌గా పుష్కర కాలంగా రాణిస్తున్నారు. ఎలా ఫీలవుతున్నారు?
ఇప్పుడే హీరోయిన్‌గా ప్రవేశం చేశాననిపిస్తోంది. అంతలోనే పదేళ్లు దాటాయంటే ఆశ్చర్యం కలిగిస్తోంది. సినిమా నాకు చాలానే ఇచ్చింది. ముఖ్యంగా అభిమానుల ప్రేమ. అది వెల కట్టలేనిది.హీరోయిన్గా బాలీవుడ్‌లో కెరీర్‌ను ప్రారంభించినా, తమిళం, తెలుగు సినీపరిశ్రమలే నాకు జీవితాన్నిచ్చాయి. ఒకవేళ హిందీ చిత్రాలతో బిజీ అయినా, దక్షిణాది నుంచి అవకాశం వస్తే వెంటనే వచ్చి నటిస్తాను.
పదేళ్లకు పైగా నటిస్తున్నా, మీపై వదంతులు పెద్దగా ప్రచారం కాలేదే?
చిన్న చిన్న అవాస్తవ వందతులు ప్రచారమై ఉండవచ్చుగానీ, పెద్దగా అలాంటివి రాకపోవడానికి నా వ్యవహారశైలినే కారణం. షూటింగ్ ముగియగానే నేరుగా ఇంటికి వెళ్లిపోతాను. పార్టీలు, ఫ్రెండ్స్ అంటూ బయట తిరగను. నేనిప్పటి వరకూ ఎవరి ప్రేమలోనూ పడలేదు. అందువల్ల నా గురించి తప్పుడు ప్రచారం జరిగే ఆస్కారమే ఉండదు.
మీ చెల్లెలు నిషా నటిస్తున్న సమయంలోనే సడన్‌గా పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అయిపోయింది. మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు?
నిషా ప్రేమలో పడింది. అదే జీవితం అని భావించి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. నాకూ నచ్చినోడు దొరికితే నేనూ పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అయిపోతాను. ప్రస్తుతానికి మాత్రం నా శ్వాస, ప్రాణం సినిమానే.