సాక్షి, చెన్నై: ఇంతకంటే మంచిది మరొకటి ఉంటుందా అంటోంది నటి అనుష్క. నటనపై ఆధారపడి, సినిమాల్లో సంపాదించుకుంటూ సినిమా శాశ్వతం కాదు, వేరే వ్యాపారం చేసుకోవాలి అంటూ ఈ రంగాన్నే విమర్శించేవారు కొందరు. సినిమానే ఆస్తులు, అంతస్తులు, ఆనందం అన్నీ ఇచ్చింది అని మర్యాదనిచ్చే వారు మరి కొందరు. ఇక నటి అనుష్క ఈ రెండవ కోవకు చెందినదిన వారని చెప్పక తప్పదు. నటిగా 13 ఏళ్ల అనుభవం. అంచెలంచెలుగా ఎదిగి అగ్ర హీరోయిన్‌గా రాణిస్తున్న అనుష్క చిత్రం అంటే కాసుల వర్షమే అనే పేరును సంపాందించుకున్నారు.
అందం, అభినయం కలబోసిన అద్భుత నటి అనుష్క. తాజాగా భాగమతి చిత్రంలో తన నట విశ్వరూపాన్ని చూపారు. అందరూ స్వీటీ అని ప్రేమగా పిలుచుకునే ఈ బ్యూటీ తన సినీ అనుభవాన్ని ఒక భేటీలో పంచుకున్నారు. అవేమిటో చూద్దాం. సినిమాల్లో నటించడం కూడా ఉద్యోగం లాంటిదే. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో మాదిరిగానే సినిమాల్లో మేము పనిచేస్తున్నాం. అయితే ఇతరుల కంటే మాదే అత్యుత్తమ పని. ఎందుకంటే సినిమాలను ఇష్టపడని వారు ఉండరు. ప్రపంచ వ్యాప్తంగా ప్రేమించే సినిమారంగంలో ఒక నటిగా నేనుండడం ఘనతగా భావిస్తున్నాను.
ఒక్క పారితోషికం మాత్రమే కాకుండా ఇక్కడ చాలా సౌకర్యాలను అనుభవిస్తున్నాను. ఇక కష్టనష్టాలనేవి అన్ని రంగాల్లోనూ ఉంటాయి. అయితే సినిమారంగంలో శ్రమించి ఉన్నత స్థాయికి చేరుకుంటే హీరోయిన్లను రాణులుగా చూస్తారు. మా మాటలను ఎంతగానో విశ్వసిస్తారు. మేము ఎం చెబుతామోనన్న ఆసక్తి చూపుతారు. సాధారణ అమ్మాయిల కంటే మేము చెప్పేవి ఆదర్శంగా తీసుకుని, వాటిని అనుసరిస్తారు. ఇతర రంగాల్లో ఉద్యోగం చేసేవారు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే పని చేసి అలసిపోతారు. మేము మాత్రం 24 గంటలు స్టూడియోల్లో మగ్గి పని చేసినా అలుపు ఉండదు. అలాంటి ఇష్టమైన వృత్తి సినిమా రంగం. ఇంతకంటే ఉత్తమమైన పని వేరేమీ ఉండదు.
Comments
Please login to add a commentAdd a comment