హాలీవుడ్ కు అభినయ
మనిషి సాధనకు అంగవైకల్యం అస్సలు అడ్డు కాదని చాలా మంది ఎల్లలు దాటిన విజయాలతో నిరూపించారు.యువ నటి అభినయను ఈ కోవకు ఆపాదించవచ్చు. తనలోని మైనస్‌లను ప్లస్‌గా మార్చుకుని నటిగా ఎదుగుతున్న నటి అభినయ. సాధారణంగా ఒక చిన్న లోపం ఉంటేనే ఇక జీవతమే లేదన్నంతగా నిరాశ నిస్పృహలకు లోనైపోయే చాలా మంది నటి అభినయను స్ఫూర్తిగా తీసుకుంటే వారి జీవితాలను బాగుపరుచుకోవచ్చు. ఈ నటిని మూగ,చెవుడు అంటి పెట్టుకున్నాయి.అయినా ఏమాత్రం కుంగిపోలేదు. అకుంఠిత దీక్షతో ఎదురొడ్డి గెలిచారు.ఏకంగా హీరోయిన్‌గానే తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుని బహుభాషా నటిగా రాణిస్తున్నారు. మాట్లాడలేక పోయినా, వినిపించకపోయినా ఎదుటి వాళ్ల పెదాల కదలికలను చూసి వారేమి మాట్లాడుతున్నారో అర్థం చేసుకోగల శక్తి, పాత్రల కనుగుణంగా చక్కని భావాలను వ్యక్తం చేయగల ప్రతిభ కలిగిన నటి అభినయ.
నాడోడిగళ్ చిత్రంతో కథానాయకిగా తెరంగేట్రం చేసిన అభినయ ఆ తరువాత ఈశన్ చిత్రాల్లో నటించారు.ప్రస్తుతం చేతిలో నాలుగైదు చిత్రాలు ఉన్నాయి.అందులో అడిడా మేళం, తమిళ్‌సెల్వనుమ్ తనియార్ అంజలియుమ్, నిశబ్దం,విళిత్తిరు, తుడి చిత్రాలు ఉన్నాయి. తుడి చిత్రం విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. కథానాయకి ఇతివృత్తంగా ముంబై పేలుళ్ల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అభినయ హీరోయిన్‌గా నటించారు. ఈమె ఇప్పుడు కోలీవుడ్, టోలీవుడ్‌లను దాటి ఏకంగా హాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు.అక్కడ ఒన్ లిటిల్ ఫింగర్ అనే చిత్రంలో నటిస్తున్నారు. దీనికి అకాడమీ అవార్డు గ్రహీత రూపంశర్మ దర్శకత్వం వహిస్తున్నారు. 56 మంది వికలాంగుల ఇతివృత్తంగా తెరకెక్కుతున్న చిత్రం ఇది.శారీరకంగా బాధింపునకు గురైనా వికలాంగులు మాన సికంగా చాలా ప్రతిభావంతులను చెప్పే కథా చిత్రంగా ఒన్ లిటిల్ ఫింగర్ చిత్రం ఉంటుందని తెలిసింది. ఇందులో అభినయ ఎన్‌జీఓ వర్కర్‌గా ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ఇలా కోలీవుడ్ నుంచి హాలీవుడ్ స్థాయికి ఎదిగిన అతి కొద్ది మంది నటీమణుల్లో ఒకరుగా అభినయ పేరు తెచ్చుకోవడం విశేషం.