ముంబై: నటి దివ్యభారతి మరణం వెనుక ఎటువంటి కుట్ర లేదని ఆమె తండ్రి ఓమ్ భారతి వెల్లడించారు. ప్రమాదవశాత్తు ఆమె మరణించిందని ఓ మేగజీన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. నేడు దివ్యభారతి 45వ జయంతి సందర్భంగా మరోసారి ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. దివ్యభారతి మరణంపై వ్యక్తమైన అనేక అనుమానాలు ఇప్పటికే అలాగే ఉన్నాయి. చిన్న వయసులోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన దివ్యభారతి 1993, ఏప్రిల్ 5న అంధేరీ ప్రాంతంలోని తులసీ అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తు నుంచి పడిపోయి ప్రాణాలు కోల్పోయింది.
దివ్యభారతి ఆత్మహత్య చేసుకోలేదని, ఆమెను ఎవరూ హత్య చేయలేదని ఓమ్ భారతి చెప్పారు. ఆమె మరణించడానికి కొద్ది గంటల ముందు ఏం జరిగిందనేది ఆయన మాటల్లోనే... ‘ ఆ రోజు దివ్య మద్యం సేవించింది. అంత ఎక్కువగా ఏమీ తాగలేదు. ఆమె కుంగుబాటుకు లోనుకాలేదు. అది ప్రమాదం మాత్రమే. పిట్టగోడపై కూర్చునివున్న ఆమె నియంత్రణ కోల్పోయి కింద పడిపోయింది. దివ్య ఫ్లాట్‌కు తప్ప ఆ అపార్ట్‌మెంట్‌లోని అన్ని ఫ్లాట్‌లకు గ్రిల్స్ ఉన్నాయి. కింద ఎప్పుడూ కార్లు పార్క్ చేసి వుండేవి. కానీ ఆ రాత్రి ఒక్క కారు కూడా లేదు. దివ్య నేరుగా కింద పడిపోయింది. నేను షాక్ గురయ్యాను. స్పృహ కోల్పోయాను. వైద్య బృందం వచ్చే సరికి ఆమె కొనప్రాణంతో ఉంది. దగ్గరలోని ఆస్పత్రికి తరలించిన కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయింద’ని ఓమ్ భారతి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment