మంచుకొండల్లో ఆ పాటను ఎలా తీశారు?
చుట్టూ మంచుకొండలు.. ఎముకలు కొరిచే చలి.. స్వెట్టర్లు, తలకు రుమాళ్లు ధరించినా.. ఆ చలికి కాసేపు నిలువడం కష్టం. అలాంటి క్లిష్టమైన ఐస్‌ల్యాండ్‌లో వేసవి తరహాలో స్లీవ్‌లెస్ దుస్తులు వేసుకొని పాట తీయడమంటే మాటలు కాదు. అందుకే 'దిల్‌వాలే' సినిమాలో మంచుకొండల్లో తీసిన 'గెరువా' పాటను ఎలా చిత్రీకరించారనే విషయాన్ని తాజా మేకింగ్ వీడిమోలో షారుఖ్‌ఖాన్-కాజోల్ పంచుకున్నారు. భారీ జలపాతం ఎదురుగా పోజు ఇవ్వడం, ఐస్‌బెర్గ్ మధ్యలో నిలబడటం, చీర కట్టుకొని మంచు కొండలమీద స్టెప్పులు వేయడం అంత ఈజీ కాదని కాజోల్ చెప్పింది. 'గెరువా' పాట కోసం షారుఖ్, కాజోల్ స్లీవ్‌లెస్ దుస్తులు వేసుకున్నా.. షూటింగ్ గ్యాప్‌లో మాత్రం చలిని తట్టుకునేందుకు భారీ స్వెట్టర్లు వేసుకున్నారు.
సాధారణంగా అత్యంత అసాధ్యమైన లోకేషన్లలో షూటింగ్ చేస్తేగానీ దర్శకుడు రోహిత్ శెట్టికి సంతృప్తి ఉండదు. అందుకే ఇంత క్లిష్టమైన ఐస్‌బర్గ్ మధ్యలో ఈ పాటను చిత్రీకరించారు. ఈ పాటకు సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో షారుఖ్, కాజోల్ పంచుకున్నారు. అత్యంత హిట్‌పెయిర్‌గా పేరొందిన షారుఖ్, కాజోల్ మళ్లీ కలిసి నటిస్తున్న 'దిల్‌వాలే' ఈ నెల 18న విడుదల కానుంది.