Dilwale
-
ఆ వినోదం అమరం
‘‘నువ్వు సినిమాల్లోకి వెళ్లావంటే చంపేస్తా’’. సరిగ్గా తలకు తుపాకీ గురి పెట్టి కొడుకు వినోద్ ఖన్నాను బెదిరించారు కిషన్‌చంద్ ఖన్నా. సినిమా ల్లోకి వెళ్లాలని బలంగా నిర్ణయించుకున్న వినోద్ ఖన్నాకి ఏం పాలుపోలేదు. వెళ్లే తీరతానంటే తండ్రి ఊరుకోడు. ‘‘రెండంటే రెండేళ్లు అవకాశం ఇవ్వండి. నిలదొక్కుకోలేకపోతే వెనక్కి వచ్చేస్తాడు’’ అంటూ కొడుకుని సపోర్ట్ చేస్తూ, భర్తను ఒప్పించారు వినోద్ ఖన్నా తల్లి కమల. ఆ రోజు ఆ సపోర్ట్ లేకపోయుంటే వినోద్ ఖన్నా అనే ఆరడుగుల అందగాడు వెండితెరకు వచ్చి ఉండేవాడు కాదు. ప్రతినాయకుడిగా మొదలై నాయకుడిగా ఎదిగి, సహాయ నటుడిగానూ ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకున్నారాయన. ‘మొఘల్–ఎ–అజం’ ప్రభావంతో... 1946 అక్టోబర్ 6న పెషావర్‌లో వినోద్ ఖన్నా జన్మించారు. అతను పుట్టిన కొన్ని నెలలకే దేశ విభజన జరగడంతో వినోద్ కుటుంబం ముంబై చేరింది. నాసిక్‌లో డిగ్రీ చదువుకుంటున్న సమయంలోనే వినోద్ ఖన్నాకు సినిమాల పట్ల ఆసక్తి ఏర్పడింది. అప్పుడు చూసిన ‘సోల్వా సాల్’, ‘మొఘల్–ఎ–అజం’ చిత్రాలు సినిమాల్లోకి రావాలనే అభిప్రాయాన్ని కలిగించాయి. అనుకోకుండా ఓ పార్టీలో దర్శక–నిర్మాత సునీల్ దత్‌ని కలిశారు వినోద్ ఖన్నా. అప్పుడు తన సోదరుడు సోమ్ దత్ హీరోగా సునీల్ దత్ ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారు. అందులో విలన్‌గా వినోద్ ఖన్నాకు అవకాశం ఇచ్చారు. హీరోలా ఉన్నప్పటికీ నటన మీద మక్కువతో వినోద్ ఖన్నా ఒప్పేసుకున్నారు. అలా ‘మన్ కా మీత్’ (1968) సినిమా ద్వారా ఆయన తొలిసారి తెరపై కనిపించారు. ఆ సినిమాకి మన తెలుగు దిగ్గజం ఆదుర్తి సుబ్బారావు దర్శకుడు. వారంలో 15 సినిమాలు! మొదటి సినిమా రిలీజైన వారానికి ఏకంగా 15 సినిమాలకు సైన్ చేశారు వినోద్ ఖన్నా. పూరబ్ ఔర్ పశ్చిమ్, సచ్చా ఝూటా, మస్తానా, మేరో గోన్ మేరా దేశ్, ఎలానా వంటి చిత్రాల్లో విలన్‌గా, సహాయ నటుడిగా చేశారు.రీల్ లైఫ్ బాగుంది. రియల్ లైఫ్‌లోనూ సెటిలవ్వాలను కున్నారు. కాలేజీలో ప్రేమించిన గీతాంజలిని పెళ్లాడాలనుకున్నారు. 50 మల్టీస్టారర్స్‌లో... 1971లో ఈ ప్రేమికులు భార్యాభర్తలయ్యారు. అదే ఏడాది వినోద్ ఖన్నాకు హీరోగానూ బ్రేక్ వచ్చింది. ‘హమ్ తుమ్ ఔర్ ఓ’ సినిమాతో ఆయన హీరోగా మారారు. ఫరేబీ, కాయిద్, జాలిమ్, ఇన్కార్ వంటి చిత్రాల్లో హీరోగా నటించారు. ఇద్దరు హీరోలున్న సినిమాలూ ఎక్కువే చేశారు. ఫిరోజ్ ఖాన్ స్వీయదర్శకత్వంలో తెరకెక్కించి, నటించిన ‘కుర్బానీ’ (1980)లో వినోద్ ఖన్నా ఓ హీరో. ఆ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా గుర్తింపు పొందింది. శశికపూర్, అమితాబ్ బచ్చన్, రణధీర్ కపూర్ వంటి హీరోలతో కలిసి దాదాపు 50 మల్టీస్టారర్ మూవీస్ చేశారు వినోద్ ఖన్నా. అమితాబ్‌తో ఆయనకు మంచి పోటీ ఉండేది. అప్పటికి అమితాబ్ అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరో. అయితే 1974 నుంచి 1982 వరకూ అమితాబ్, జితేంద్ర కాంబినేషన్లో చేసిన సినిమాల్లో వినోద్ ఖన్నాకే ఎక్కువ పారితోషికం ఇచ్చారు దర్శక–నిర్మాతలు. ఓషో ఆశ్రమంలో నిరాడంబర జీవితం పేరు, డబ్బు, ప్రేమించి, పెళ్లి చేసుకున్న గీతాంజలి, ఇద్దరు కుమారులు (రాహుల్ ఖన్నా, అక్షయ్ ఖన్నా).. వినోద్ ఖన్నా జీవితం బ్రహ్మాండంగా ఉంది. అయితే జీవితం అంటే ఇదేనా? అనిపించిందాయనకు. అప్పటికే ఆధ్యాత్మిక గురువు ‘ఓషో’ బోధనలకు ఆకర్షితుడయ్యారాయన. చివరికి 1982లో సినిమాలకు ‘రిటైర్మెంట్’ ప్రకటించి, అమెరికాలోని రజనీష్ పురంలో గల ఓషో ఆశ్రమానికి వెళ్లిపోయారాయన. అక్కడ నిరాడంబర జీవితం గడిపారు. టాయ్‌లెట్స్ శుభ్రం చేసేవారు. గిన్నెలు కడిగేవారు. తోటమాలిగా చేసేవారు. అయితే వినోద్ ఖన్నా ఇంటికి దూరం కావడం ఆయన భార్యా, పిల్లలకు ఇబ్బందిగా మారింది. అదే ఆయన్ను వాళ్లకు దూరం చేసింది. వినోద్, గీతాంజలి విడాకులు తీసుకున్నారు. ఓషో ఆశ్రమంలో నాలుగేళ్లు ఉండి, ఇండియాకి వచ్చేసరికి వినోద్ ఖన్నా ఒంటరిగా మిగిలిపోయారు. మళ్లీ సినిమాలు చేయడం మొదలుపెట్టారు. మొదటి భార్య నుంచి విడిపోయిన ఐదేళ్లకు కవితను పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కొడుకు (సాక్షి), కూతురు (శ్రద్ధ) ఉన్నారు. ‘దిల్వాలే’ చివరి సినిమా విశేషం ఏంటంటే.. కొంత గ్యాప్ తర్వాత వచ్చినా వినోద్ ఖన్నాకు అవకాశాలకు కొదవ లేకుండాపోయింది. ‘ఇన్సాఫ్’ (1987)తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి, వరుసగా సినిమాలు చేశారు. కొడుకు అక్షయ్ ఖన్నా కోసం ‘హిమాలయ్ పుత్ర్’ (1997) సినిమా నిర్మించి, నటించారు కూడా. 2015లో వచ్చిన షారుక్ ‘దిల్వాలే’ వినోద్ ఖన్నాకు చివరి చిత్రం. రాజకీయాల్లోనూ సక్సెస్ 1997లో వినోద్ ఖన్నా రాజకీయ రంగప్రవేశం చేశారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నియోజక వర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1999లోనూ అదే నియోజక వర్గం నుంచి గెలుచుకున్నారు. 2002లో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రిగా చేశారు. ఆ తర్వాత పలు పదవులు చేపట్టారు. ప్రస్తుతం గురుదాస్‌పూర్‌కి ఎంపీగా ఉన్నారు. ఎక్కువ సినిమాల్లో ‘అమర్’ పేరుతో... గత కొంతకాలంగా వినోద్ ఖన్నా ఆరోగ్యం బాగాలేదు. ఈ నెల మొదటి వారంలో వినోద్ ఖన్నా బక్క చిక్కిన శరీరంతో, చాలా బలహీనంగా కనిపించిన ఫొటో ఒకటి బయటికొచ్చింది. అది చూసి బాధపడనివాళ్లు లేరు. ఆయన బ్లాడర్ (మూత్రకోశం) కేన్సర్‌తో బాధపడుతున్నారనే వార్తలు రాగా, ‘అదేం లేదు. డీ హైడ్రేషన్‌తో బాధపడుతున్నారు’ అని వినోద్ ఖన్నా తనయుడు రాహుల్ ఖన్నా ప్రకటించారు. వినోద్ ఖన్నా త్వరగా కోలుకోవాలని పలువురు బాలీవుడ్ ప్రముఖులతో పాటు ఆయన అభిమానులూ కోరుకున్నారు. కొన్ని రోజులుగా ముంబైలోని హెచ్.ఎన్. రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వినోద్ ఖన్నా (70) గురువారం తుది శ్వాస విడిచారు. ఆయన మరణవార్త విని సినీ, రాజకీయ రంగ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వినోద్‌ఖన్నా ఎక్కువ సినిమాల్లో ‘అమర్’ పేరుతో తెరపై మెరిశారు. కేన్సర్‌తో కన్నుమూసిన ఆయన ఇప్పుడిక అమర లోకంలో వినోదం పంచుతారనే వ్యాఖ్యలతో అభిమానులు ఆయన నటవైభవాన్ని గుర్తు చేసుకుంటున్నారు. -
'అందరి ముందు తినాలంటే సిగ్గు'
బాలీవుడ్ స్టార్ హీరోలలో అభిమానులతో తన అనుభవాలను, ఇష్టా ఇష్టాలను మొహమాటం లేకుండా పంచుకునే హీరో సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్. తను పడ్డా కష్టాలతో పాటు ఇప్పుడు స్టార్ డమ్‌ను కాపాడుకోవటానికి తను ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాడో కూడా తన ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటుంటాడు బాద్షా. ఇటీవల ఫ్యాన్స్‌తో నిర్వహించిన లైవ్ వీడియో చాట్‌లో తన ఆహారపు అలవాట్ల గురించి అభిమానులకు తెలియజేశాడు. ఫిట్‌గా ఉండేందుకు పక్కా డైట్ ఫాలో అయ్యే షారూఖ్, రెగ్యులర్‌గా గ్రిల్డ్ చికెన్, మొలకలు, బ్రోకొలి, పప్పు మాత్రమే తీసుకుంటాడట. అంతేకాదు ఏదైనా పార్టీకి వెళ్లినా.. ఇంట్లో వండిన ఆహారం తినడానికే ఇష్టపడతాడట. ముఖ్యంగా ఫంక్షన్స్, పార్టీలలో చాలా మంది ముందు తినటానికి ఇబ్బందిగా ఉంటుదన్నాడు షారూఖ్. తనలా ఫర్ఫెక్ట్ బాడీ మెయిన్టైన్ చేయడానికి అభిమానులకు టిప్స్ కూడా చెప్పాడు. ప్రతీరోజు తప్పకుండా వ్యాయామం చేయాలని, భోజనం చేసేప్పుడు మితంగా తినాలని, అది కూడా కింద కూర్చొని తినటం ఆరోగ్యానికి ఎంతో మంచిదని తెలియజేశాడు. -
2015లో అత్యంత చెత్త సినిమా ఏదో తెలుసా?
షారుఖ్ ఖాన్, కాజోల్ జోడీ ఐదేళ్ల తర్వాత వెండితెర మీద తళుక్కుమన్న సినిమా 'దిల్వాలే'. బాలీవుడ్లోనే సూపర్ హిట్ జోడీగా పేరొందిన ఈ జంట 'దిల్వాలే' చిత్రంలో ఆ మ్యాజిక్ చూపించలేకపోయింది. బాక్సాఫీసు వద్ద భారీగానే కలెక్షన్లు రాబట్టినా.. ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను తీవ్ర నిరాశ పరిచింది. తాజాగా 'దిల్వాలే' సినిమా 2015 సంవత్సరానికిగాను అత్యంత చెత్త సినిమాగా గోల్డెన్ కేలా పురస్కారాన్ని అందుకొంది. భారీ అంచనాలతో విడుదలైన 'ప్రేమ్ రతన్ ధన్‌పాయో' సినిమాకుగాను సోనం కపూర్ అత్యంత చెత్త నటి పురస్కారానికి ఎంపికైంది. ఈ మేరకు 8వ వార్షిక గోల్డెన్ కేలా పురస్కారాలను ప్రకటించారు. గత ఏడాది ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపర్చి.. ప్లాఫ్ సినిమాలుగా నిలిచిన బొంబే వెల్వెట్, షాన్‌దార్, తెవర్, అక్షయ్‌కుమార్ 'సింగ్ ఈజ్ బ్లింగ్'తో పోటీపడి మరీ 'దిల్వాల్' చెత్త చిత్రం రేసులో విన్నర్‌గా నిలిచింది. 'ఏబీసీడీ-2'కుగాను శ్రద్ధా కపూర్, 'సింగ్ ఈజ్ బ్లింగ్'కుగాను అమీ జాక్సన్‌తో పోటీపడి సోనం కపూర్ చెత్తనటి పురస్కారాన్ని దక్కించుకుంది. ఆమె నటించిన 'ప్రేమ్ రతన్ ధన్‌పాయో'ను తెరకెక్కించిన దర్శకుడు సూరజ్ బర్జాత్యా 'చెత్త దర్శకత్వం అవార్డు'కు ఎంపికయ్యాడు. దాంతోపాటు 'బస్ కిజియో బహుత్ హోగయా అవార్డు' (చాలా చేశారు, ఇకనైనా ఆపండి) కూడా ఆయననే వరించింది. 'హీరో' సినిమాతో బాలీవుడ్‌కు ఎంటరైన సూరజ్ పంచోలి చెత్త నటుడిగా ఎంపికయ్యాడు. అర్జున్ రాంపాల్ (రాయ్), అర్జున్ కపూర్ (తెవర్), ఇమ్రాన్ ఖాన్ (కట్టిబట్టీ)తో పోటీపడి ఈ అవార్డును దక్కించుకున్నాడు. ఆన్లైన్లో హల్చల్ చేసిన 'ప్రేమ్ రతన్ ధన్‌పాయో' టైటిల్ పాటకు 'మోస్ట్ ఇరిటేటింగ్ సాంగ్' (బాగా చికాకు పరిచే పాట) అవార్డు దక్కింది. 'దిల్లీవాలి జాలీమ్ గర్ల్‌ఫ్రెండ్'లోని 'బర్త్‌డే బాష్' పాటకు అరాచకమైన పాట పురస్కారం దక్కింది. అలాగే కేలా బృందం ఈసారి కూడా కొన్ని ప్రత్యేక అవార్డులు ప్రకటించింది. అవి... మనోజ్ కుమార్ అవార్డ్ ఫర్ హిస్టారిక్ అక్యూరెసి: సంజయ్ లీలా బన్సాలీ (బజీరావు మస్తానీ) ధారాసింగ్ అవార్డు (చెత్తగా డైలాగులు పలికినందుకు): రణ్‌దీప్ హుడా (మై ఔర్ చార్లెస్) సంఘ్ పరివార్ అవార్డు: దిల్వాలే లోని 'గెరువా' పాట శక్తి కపూర్ 'స్త్రీ ద్వేషి' అవార్డు: ప్యార్ కా పంచునామా 2 వాట్ ద హెల్ అవార్డు: సోనాక్షి సిన్హా (ఇష్కాహాలిక్) -
చెత్త సినిమా పోటీలో ఆ రెండు చిత్రాలు!
న్యూఢిల్లీ: ప్రతి ఏడాది వచ్చే ఉత్తమ సినిమాలకే కాదు.. అత్యంత చెత్త సినిమాలకు కూడా పురస్కారాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఏర్పాటైనవే గోల్డెన్ కేలా అవార్డ్స్. ఈ ఏడాది గోల్డెన్ కేలా అవార్డుల కోసం ఊహించనివిధంగా ఇద్దరు సూపర్ స్టార్ చిత్రాలు పోటీ పడుతుండటం గమనార్హం. బాలీవుడ్లో గత ఏడాది విడుదలైన అత్యంత చెత్త సినిమా అవార్డు కేటగిరీలో సల్మాన్ ఖాన్ నటించిన 'ప్రేమ్‌రతన్ ధన్‌పాయో', షారుఖ్ ఖాన్ చిత్రం 'దిల్వాలే' హోరాహోరీగా పోటీపడుతున్నాయి. నిజానికి ఈ రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద వంచి వసూళ్లే రాబట్టాయి. వందకోట్లకు పైగా కలెక్షన్లు సాధించాయి. అయితే దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ జత కట్టిన షారుఖ్-కాజోల్ జోడీ 'దిల్వాలే'లో తమ మ్యాజిక్‌ను పునరావృతం చేయలేకపోయింది. మరోవైపు 'మైనే ప్యార్ కియా' దర్శకుడు సూరజ్ బర్జాత్యా సల్మాన్ ను డబుల్ రోల్ చూపించిన 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' కూడా పెద్దగా ప్రేక్షకుల మనుసు గెలుచుకోలేకపోయింది. ఈ రెండు సినిమాలతో పాటు అర్జున్ కపూర్ 'తెవర్', అక్షయ్ కుమార్ 'సింగ్ ఈజ్ బ్లింగ్' కూడా చెత్త సినిమా అవార్డుకు పోటీపడుతున్నాయి. ఈ సినిమాలకు ఇప్పటివరకు అత్యధిక నామినేషన్లు దక్కాయి. ఈ నెల 30 వరకు గోల్డెన్‌కేలా.కామ్ లో ఓటింగ్ తెరిచి ఉంటుంది. ఇక చెత్త నటుల అవార్డు కేటగిరీలో ఈ సారి అన్నా-చెల్లెలు పోటీపడుతుండటం గమనార్హం. అన్న అర్జున్ కపూర్ 'తెవర్' సినిమా కోసం చెత్త హీరోగా.. చెల్లి సోనం కపూర్ 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' సినిమా కోసం చెత్త హీరోయిన్గా అవార్డు రేసులో ముందున్నారు. చెత్త నటుడి కేటగిరీలో ఇంకా అర్జున్ రాంపాల్ (రాయ్), సూరజ్ పంచోలీ (హీరో), ఇమ్రాన్ ఖాన్ (కట్టిబట్టి) తదితరులు.. చెత్త నటి కేటగిరీలో సోనాక్షి సిన్హా (తెవర్), శ్రద్ధ కపూర్ (ఏబీసీడీ2), ఆమీ జాక్సన్ (సింగ్ ఈజ్ బ్లింగ్) రేసులో ఉన్నారు. -
ఔను! 'దిల్వాలే' నిరాశపర్చింది: షారుఖ్
ముంబై: బాలీవుడ్లో సూపర్ హిట్ పెయిర్‌గా నిలిచిన జోడీ షారుఖ్ ఖాన్, కాజోల్. వీరు గతంలో కలిసి నటించిన చిత్రాలు భారీ విజయాలు సాధించాయి. వీరు మళ్లీ జత కట్టడంతో 'దిల్వాలే' సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రోహిత్ శెట్టి దర్శకత్వంలో ఈ జోడీ బాక్సాఫీస్ వద్ద మళ్లీ తమ మ్యాజిక్‌ను చూపుతుందని చాలామంది భావించారు. అయితే 'దిల్వాలే' మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. భారీ ఓపెనింగ్ కలెక్షన్లు సాధించినప్పటికీ ఆ ఊపును కొనసాగించలేకపోయింది. ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయిందనే విషయాన్ని షారుఖ్ సైతం అంగీకరించాడు. 'దిల్వాలే' పెద్ద విజయాన్ని సాధించలేకపోయిందని చెప్పాడు. 'ఈ సినిమా ఆడాల్సినంత గొప్పగా ఆడలేదు. వ్యక్తిగతంగా ఈ విషయంలో నిరాశ చెందాను. అయితే, భారత్‌లో కంటే విదేశాల్లో 'దిల్వాలే' మంచి కలెక్షన్లు సాధించింది. జర్మనీ, ఆస్ట్రియా వంటి దేశాల్లో మంచి కలెక్షన్లు వచ్చాయి. భారతీయ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయాన్ని ఇది చాటుతోంది' అని షారుఖ్ తెలిపారు. సంజయ్ లీలా భన్సలీ 'బాజీరావు మస్తానీ' సినిమాతో పోటీపడి.. డిసెంబర్ 18న విడుదలైన 'దిల్వాలే' మొత్తంగా రూ. 350 కోట్లకుపైగా వసూలు చేసింది. అయినా ఈ సినిమా ప్రక్షకుల నుంచి సానుకూల స్పందన రాబట్టలేకపోయింది. -
బతిమాలినా అతను కనికరించలేదు!
కష్టపడి సంపాదించుకున్న డబ్బును ఎవరైనా లూఠీ చేస్తే, ఎంత బాధ అనిపిస్తుందో... కళ్లెదుటే పైరసీ సీడీ కొనుక్కుని, సినిమా చూస్తున్నప్పుడు అందులో నటించినవాళ్లకూ, ఆ సినిమా తీసినవాళ్లకూ అంతే బాధగా ఉంటుంది. ఇటీవల కృతీ సనన్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఏదో పని మీద ఆమె ఢిల్లీ వెళ్లారు. విమానంలో ఓ వ్యక్తి ‘దిల్వాలే’ సినిమాను మొబైల్ ఫోన్లో చూడడం కృతీ సనన్ దృష్టిలో పడింది. షారుక్ ఖాన్, కాజోల్, వరుణ్ ధావన్, కృతీ సనన్ తదితరుల కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రం వారం రోజుల క్రితం విడుదలైంది. ఆ సినిమా పైరసీ కాపీనే ఆ ప్రయాణీకుడు చూస్తున్నాడు. కృతి ఆగ్రహం, ఆవేదనతో అతగాడి దగ్గరికెళ్లి, ‘ప్లీజ్... ఇలా ఫోన్లోకన్నా థియేటర్లో చూస్తే, మీరింకా ఎంజాయ్ చేస్తారు’ అని చాలా రిక్వెస్టింగ్‌గా చెప్పారు. కానీ, అతను కనికరించలేదు. ఈ బ్యూటీ మాటలను ఖాతరు చేయకుండా హాయిగా సినిమా చూశాడు. ఈ తతంగాన్ని ఫొటో తీసి, తన ట్విట్టర్లో కృతి పోస్ట్ చేశారు. ‘‘నా కళ్లెదుటే పైరసీ కాపీ చూశాడు. నేను తట్టుకోలేకపోయా. ఎంతోమంది కష్టంతో ఓ సినిమా రూపొందుతోంది. పైరసీ కాపీ చూసి, మా కష్టాన్ని వృథా చేయకండి. దయచేసి థియేటర్లకు వెళ్లి, సినిమా చూడండి’’ అని కూడా కృతి పేర్కొన్నారు. -
అక్కడ 'దిల్వాలే' జోరు- 'బాజీరావు' బేజారు!
కరాచీ: బాలీవుద్ బాద్షా షారుఖ్‌ఖాన్ నటించిన యాక్షన్ కామెడీ 'దిల్వాలే' పాకిస్థాన్ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల జాతర చేస్తోంది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా తొలి మూడురోజుల్లో ఏన్నడులేనంతంగా వసూళ్లు రాబట్టింది. 'దిల్వాలే'తో ధాటిగా దీటుగా పోటీపడి రీలిజైన 'బాజీరావు మస్తానీ' మాత్రం పాకిస్థాన్‌లో పెద్దగా సందడి చేయలేకపోతున్నది. రోహిత్‌శెట్టి మార్క్ సినిమా అయిన 'దిల్వాలే' పాక్‌లో తొలి మూడురోజుల్లో రూ. 6.5 కోట్లు (65 మిలియన్లు) రాబట్టింది. ఈ సినిమా వరుసగా మూడురోజుల్లో రూ. 2.13 కోట్లు, రూ. 2.4 కోట్లు, రూ. 2.3 కోట్ల వసూళ్లు రాబట్టిందని డిస్ట్రిబ్యూటర్ సంస్థ ఎవర్రెడీ పిక్చర్స్ తెలిపింది. ఇక సంజయ్‌లీలా భన్సాలీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'బాజీరావు మస్తానీ' మాత్రం తొలి మూడురోజుల్లో రూ. 2.1 కోట్లు వసూలు చేసింది. 'దిల్వాలే' కలెక్షన్‌తో పోల్చుకుంటే ఇది మూడోవంతు కూడా కాదు. అయితే 'బాజీరావు మస్తానీ' పాక్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నదని ఇప్పుడే చెప్పడం సరికాదని, ఇప్పుడు ఆ సినిమా థియేటర్లకు కూడా 'క్యూ' కట్టే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతున్నదని, 'బాజీరావు' కలెక్షన్లు కూడా పెరిగే అవకాశముందని ఆ సినిమా పంపిణీదారు నదీం మందిద్వివాలా తెలిపారు. ఇటు షారుఖ్-కాజోల్ జోడీ 'దిల్వాలే', అటు భన్సాలీ మార్క్ చారిత్రక ప్రణయకావ్యం 'బాజీరావు'.. రెండు సినిమాలు భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యాయి. రెండు సినిమాలకు దాదాపు సానుకూల రివ్యూలే వచ్చాయి. భారత్‌లో మాత్రం రెండు సినిమాలు పోటాపోటీగా వసూళ్లు రాబడుతున్నాయి. -
షారుఖ్.. ఎప్పుడు యాక్టింగ్ నేర్చుకుంటావ్!
రెండు దశాబ్దాలకుపైగా కెరీర్లో ఎన్నో సినిమాలతో, విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్‌ఖాన్. ఆయనకు ఇటీవల ఓ అభిమాని నుంచి ఊహించని షాక్ ఎదురైంది. షారుఖ్ తాజా సినిమా 'దిల్వాలే'ను చూసిన ఓ అభిమాని.. 'మీరెప్పుడు నటన నేర్చుకుంటారు' అంటూ ఆయనను నేరుగా అడిగారు. ఊహించని ఈ ప్రశ్నకు షారుఖ్ నింపాదిగానే సమాధానమిచ్చారు. నటుడిగా కొనసాగేందుకు ప్రత్యేకంగా ఎలాంటి ఫార్ములాలు ఉండవని, చనిపోయేవరకు కూడా తాను నటనను నేర్చుకోలేనని ఆయన పేర్కొన్నారు. ఇటీవల కింగ్ ఖాన్ అభిమానులతో ట్విట్టర్లో ముచ్చటించిన సందర్భంగా ఇది చోటుచేసుకుంది. షారుఖ్ తాజా సినిమా 'దిల్వాలే'కు కలెక్షన్లు జోరుగా ఉన్నా సినీ సమీక్షుల నుంచి మాత్రం మిశ్రమ స్పందన వచ్చింది. ఈ ట్విట్టర్ చాటింగ్‌లో 'దిల్వాలే' గురించి అభిమానులు భిన్నమైన స్పందన వ్యక్తం చేశారు. మీరు ఇలాంటి సినిమాలే చేస్తూ పోతే మీకున్న అభిమానబలం తగ్గిపోక తప్పదని ఓ నెటిజన్ అభిప్రాయపడగా.. నటుడిగా తాను ఒక మూసలో ఒదిగిపోనని, అన్ని రకాల పాత్రలు చేస్తానని షారుఖ్ రిప్లై ఇచ్చాడు. ఐఐఎం వంటి ప్రముఖ విద్యాసంస్థల్లో ఉపన్యాసాలు ఇవ్వడంపై స్పందిస్తూ 'నా ఉపన్యాసాలు ప్రేరణ కలిగించేందుకు, సినిమాలు వినోదం కలిగించేందుకు, రెండింటిని మిక్స్ చేయవద్దు' అని బదులిచ్చాడు. @PoojaMissra @iamsrk When will u learn acting #AskSRK -
మూడు రోజుల్లో రూ. 121 కోట్లు వసూలు
ముంబై: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన తాజా చిత్రం 'దిల్వాలే' బాక్సాఫీసు వద్ద కనకవర్షం కురిపిస్తోంది. వసూళ్ల వేటలో మరో బాలీవుడ్ సినిమా 'బాజీరావు మస్తానీ' కంటే ముందంజలో నిలిచింది. గత శుక్రవారం విడుదలైన రోమాంటిక్ యాక్షన్ కామెడీ చిత్రం దిల్వాలే మూడు రోజుల్లో 121 కోట్ల రూపాయలను వసూలు చేసింది. భారత్‌లో రూ. 65.02 కోట్లు, విదేశాల్లో రూ. 56 కోట్లు రాబట్టింది. విదేశాల్లో ఈ సినిమాకు అమితాదరణ లభిస్తోందని విశ్లేషకుడు కోమల్ నెహతా చెప్పారు. గల్ఫ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ చిత్రం ఇదేనని తెలిపారు. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో షారుక్, కాజోల్, వరుణ్ ధావన్, కృతి సనన్ నటించారు. అదే రోజు విడుదలైన హిస్టారికల్ మూవీ బాజీరావు మస్తానీకి మూడు రోజుల్లో రూ. 46.77 కోట్లు (భారత్‌లో) కలెక్షన్లు వచ్చాయి. కాగా ఈ సినిమాకు విదేశాల్లో ఏమేరకు కలెక్షన్ల వచ్చాయన్న విషయం తెలియరాలేదు. ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్, దీపిక పదుకోన్ నటించారు. ఈ రెండు చిత్రాలను వంద కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్‌తో నిర్మించారు. క్రిస్మస్, న్యూ ఇయర్ రానుండటంతో మంచి కలెక్షన్లు వస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. -
'దిల్వాలే' సినిమా రివ్యూ
టైటిల్: దిల్వాలే జానర్: రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ తారాగణం: షారూక్ ఖాన్, కాజోల్, వరుణ్ ధావన్, కృతిసనన్ నిర్మాత: గౌరీఖాన్ సంగీతం: ప్రీతమ్ చక్రవర్తి, అమర్ మొహిలే దర్శకత్వం: రోహిత్ శెట్టి చాలా కాలం తరువాత బాలీవుడ్ రొమాంటిక్ కపుల్ షారూక్ ఖాన్, కాజోల్ కలిసి నటించిన సినిమా దిల్వాలే. మాస్ కమర్షియల్ సినిమాల స్పెషలిస్ట్ రోహిత్ శెట్టి తన పంథా మార్చి రొమాంటిక్ జానర్లో తెరకెక్కించిన ఈ సినిమా.. రిలీజ్‌కు ముందు నుంచే భారీ హైప్ క్రియేట్ చేసింది. సావరియా, ఓం శాంతి ఓం సినిమాల సమయంలో వెండితెర మీద పోటీపడిన షారూఖ్, సంజయ్ లీలా బన్సాలీలు మరోసారి దిల్వాలే, బాజీరావ్ మస్తానీ సినిమాలతో ఢీకొన్నారు. మరి ఈ పోటిలో దిల్వాలే విజయం సాదించిందా..? కథ: రాజ్ (షారూక్ ఖాన్), వీర్ (వరుణ్ ధవన్)లు కార్లను మోడిఫికేషన్ చేసే గ్యారేజ్ నడుపుతుంటారు. వీర్ తన కార్లో లిఫ్ట్ తీసుకున్న ఇషిత (కృతిసనన్)తో ప్రేమలో పడతాడు. అయితే తమ ప్రేమకు తన అన్నను ఒప్పించే ప్రయత్నం చేయాలనుకుంటాడు. అదే సమయంలో రాజ్ గతం తెలుస్తుంది. రాజ్ అసలు పేరు కాళీ, 15 ఏళ్ల కిందట బల్గేరియాలో ఓ మాఫియా డాన్. తన తండ్రితో కలిసి స్మగ్లింగ్ చేస్తుంటాడు. ఈ వ్యాపారపరంగా మరో డాన్‌తో వీరికి శతృత్వం ఏర్పాడుతుంది. కానీ షారుఖ్ అనుకోకుండా ప్రత్యర్థి కూతురు మీరా(కాజోల్)తో ప్రేమలో పడతాడు. తండ్రుల మధ్య ఉన్న వైరం ఆ ప్రేమికులను విడదీస్తుంది. 15 ఏళ్ల తరువాత వీర్, ఇషితల ప్రేమ కారణంగా మరోసారి రాజ్, మీరా కలుసుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజ్ తిరిగిన తన ప్రేమను గెలుచుకున్నాడా.. అన్నదే అసలు కథ. విశ్లేషణ: ఈ సినిమాలో ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది కాజోల్ నటన గురించి. లాంగ్ గ్యాప్ తరువాత వెండితెర మీద కనిపించిన ఈ డస్కీ బ్యూటీ గ్లామరస్ అపియరెన్స్‌తో పాటు యాక్టింగ్‌తోనూ ఆడియన్స్‌ను కట్టిపడేసింది. డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న పాత్రలో షారూఖ్ మరోసారి మెప్పించాడు. ముఖ్యంగా సెకండాఫ్‌లో షారూక్ నటన అద్భుతం. ఈ ఇద్దరి కెమిస్ట్రీ.. సినిమానే కాదు.. ఆడియన్ మూడ్‌ను 1990ల లోకి తీసుకెళ్తుంది. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్‌తో మరోసారి బాలీవుడ్ బెస్ట్ కపుల్ అనిపించుకున్నారు షారూఖ్, కాజోల్. వరుణ్, కృతి కూడా తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. ఇతర పాత్రల్లో నటించిన జానీ లీవర్, బొమన్ ఇరానీ, వరుణ్ శర్మ, సంజయ్ మిశ్రాల కామెడీ ఆకట్టుకుంది. పైసా వసూల్ సినిమాలను తెరకెక్కించటం బాగా తెలిసిన రోహిత్ శెట్టి మరోసారి పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. రెగ్యులర్‌గా తను ఎంచుకునే యాక్షన్ కామెడీకి తోడు ఈసారి కాస్త రొమాంటిక్ టచ్ కూడా ఇచ్చాడు. అయితే ఆ జానర్‌ను ఆశించిన స్థాయిలో ప్రజెంట్ చేయటంలో ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. ముఖ్యంగా షారూఖ్, కాజోల్ మధ్య వచ్చే సన్నివేశాలు చాలా రొటీన్‌గా అనిపిస్తాయి. యాక్షన్ కామెడీ కూడా రెగ్యులర్ రోహిత్ శెట్టి సినిమాల తరహాలోనే సాగిపోతుంది. భారీ ఛేజ్‌లు, కార్ బ్లాస్ట్‌లు, పంచ్ డైలాగులు ఇలా అన్ని రకాల మాస్ ఎలిమెంట్స్‌తో కమర్షియల్ ట్రీట్ ఇచ్చాడు రోహిత్. ప్లస్ యింట్స్ : షారూఖ్, కాజోల్ జోడీ ఫస్టాఫ్ కామెడీ నిర్మాణ విలువలు మైనస్ పాయింట్స్ : రొటీన్ టేకింగ్ స్క్రీన్ ప్లే మితిమీరిన డ్రామా ఓవరాల్‌గా దిల్‌వాలేతో షారూఖ్, కాజోల్‌లు మెప్పించినా, రొహిత్ శెట్టి మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. -
ఆ వ్యాఖ్యలు చేసినందుకు షారుఖ్ సారీ!
తన తాజా చిత్రం 'దిల్వాలే' విడుదలకు రెండురోజుల ముందు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఆసక్తికర ప్రకటన చేశారు. దేశంలో తీవ్ర అసహనం నెలకొందని గతంలో తాను చేసిన వ్యాఖ్యలకుగాను ఆయన క్షమాపణలు చెప్పారు. తన పుట్టినరోజు సందర్భంగా ఓ టీవీచానెల్‌తో మాట్లాడుతూ దేశంలో విపరీతమైన మత అసహనం ఉందని షారుఖ్ అన్నారు. మత అసహనం, లౌకికవాదిగా ఉండకపోవడం అనేవి దేశానికి ఒక దేశభక్తుడు చేసే తీవ్రమైన నేరమే అవుతుందని ఆయన పేర్కొన్నారు. అసహనంపై షారుఖ్ వ్యాఖ్యల తర్వాత అమీర్‌ఖాన్ కూడా వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో ఇద్దరు బాలీవుడ్ స్టార్లు విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏబీపీ న్యూస్‌తో మాట్లాడిన షారుఖ్ తన వ్యాఖ్యలు ఎవరి మనోభావాలనైనా దెబ్బతీస్తే క్షమించాలని కోరారు. దేశంలో తాను ఎలాంటి అసహనాన్ని ఎదుర్కొనలేదని, దాని గురించి కూడా తాను ఎప్పుడూ మాట్లాడలేదని చెప్పారు. ఈ నెల 18న 'దిల్వాలే' విడుదల కానున్న నేపథ్యంలో తాను ఈ వ్యాఖ్యలు చేయడం లేదని ఆయన వివరణ ఇచ్చారు. -
'నేను ఫెరారి ఉన్న సన్యాసిని'
ముంబై: రెండు దశాబ్దాలకుపైగా నటప్రస్థానంలో ఇప్పటికీ తిరుగులేని స్టార్ బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్. ఎన్నో చిత్రాలతో అభిమానులను మెప్పించిన ఆయన తనకు ఇప్పటికీ నటించడమే చాలా ఇష్టమని చెప్తున్నాడు. కెమెరా ముందు ఉండటమే మించినదేమీ తనకు లేదని తెలిపాడు. 'నా దగ్గర అన్ని ఉన్నాయి. కానీ నేను దేనిని పెద్దగా వినియోగించను. 'ద మాంక్ వూ సోల్డ్ హిస్ ఫెరారి' అని ఒక పుస్తకం ఉంది. అదే తరహాలో నేను ఫెరారి కలిగిన సన్యాసిని. కానీ దానిని ఎక్కువగా నేను నడుపను' అని షారుఖ్ చెప్పాడు. 'నాకు పనిచేయడం ఇష్టం. కెమెరా ముందు ఉండటం కన్నా దేనిని నేను ఎక్కువగా ఇష్టపడను. అదేవిధంగా పిల్లలను, నా కుటుంబాన్ని కూడా ప్రేమిస్తాను' అని షారుఖ్ చెప్పాడు. నటనే తనకు అత్యంత ముఖ్యమైనదన్నాడు. ఇప్పటికే షారుఖ్ 80కిపైగా సినిమాల్లో నటించాడు. టీవీల్లోనూ పలు షోలతో అలరించాడు. తాజాగా కాజోల్‌తో జోడీగా నటించిన 'దిల్వాలే' సినిమా త్వరలోనే విడుదలకానుంది. షారుఖ్ మాట్లాడుతూ 'నాకు సిగ్గెక్కువ. వ్యక్తిగతంగా ముభావంగా ఉంటాను. ఇంట్లో ఎవరితో పెద్దగా మాట్లాడాను. సినిమా కోసమే ఐదేళ్ల తర్వాత కాజోల్‌ను కలిశాను. నేను సంఘ వ్యతిరేకినని అమ్మ ఎప్పుడూ అంటుండేది' అని చెప్పారు. -
క్రేజ్‌కు క్రేజు! క్యాష్కు క్యాష్!
‘దిల్వాలే’ సినిమాలో హైలైట్ ఎవరు? అంటే టక్కున వచ్చే సమాధానం షారుక్ ఖాన్-కాజోల్. ఇప్పటివరకూ వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు ఆరు. కానీ ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’లో ఈ జంట మధ్య పండిన కెమిస్ట్రీ , ఆ సినిమా చేసిన మాయ మాత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయడానికి వస్తున్న చిత్రం ‘దిల్వాలే’. ఈ నెల 18న రిలీజ్ కానున్న ఈ సినిమా మీద అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమా గురించి ఆసక్తికరమైన అంశాలు మీ కోసం... * శాటిలైట్ హక్కులు 60 కోట్లు! * ఆడియో రైట్స్19 కోట్లు! * 22 ఏళ్ల క్రితం ‘బాజీగర్’ కోసం తొలిసారి జతకట్టారు షారుక్ ఖాన్, కాజోల్. ఆ చిత్రంతోనే జంట బాగుందనిపించుకున్నారు. ఇక, ఈ ఇద్దరూ జంటగా నటించిన చిత్రాల్లో ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’కి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ చిత్రంలో ఇద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుంది. ఇప్పటివరకూ అరడజను చిత్రాల్లో జంటగా నటించి, తమ కెమిస్ట్రీతో ప్రేక్షకులను మాయ చేశారు. అందుకే షారుక్, కాజోల్ ఓ చిత్రంలో జంటగా నటిస్తున్నారంటే ఆ చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటాయి. తాజా చిత్రం ‘దిల్వాలే’పై ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. * ఐదేళ్ల క్రితం షారుక్ సరసన ‘మై నేమ్ ఈజ్ ఖాన్’లో నటించిన కాజోల్ ఆ తర్వాత ఈ హీరోగారితో జతకట్టిన చిత్రం ‘దిల్వాలే’. వాస్తవానికి చిత్రదర్శకుడు రోహిత్‌శెట్టి ఈ చిత్రం గురించి చెప్పినప్పుడు, ఎక్కువ శాతం షూటింగ్ విదేశాల్లో ఉండటంవల్ల కాజోల్ చేయకూడదనుకున్నారు. కానీ, కాజోల్ కూతురు నైసా ‘మమ్మీ.. నువ్వీ సినిమా కచ్చితంగా చేయాల్సిందే. ఎక్కువ సినిమాల్లో నువ్వు ఏడవడం చూశాను. ఈ సినిమాలో కామెడీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, నువ్వు నవ్వడం చూడాలి’ అనడంతో కాజోల్ నవ్వుతూ ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. * ఇది రొమాంటిక్ యాక్షన్ కామెడీ మూవీ. ఇందులో షారుక్ ‘కార్ మాడిఫైర్’గా చేశారు. అండర్ కరెంట్‌లో గ్యాంగ్‌స్టర్ అని సమాచారం. షారుక్ తమ్ముడిగా వరుణ్ ధావన్ నటించారు. వరుణ్‌కు జోడీగా కృతీసన న్ నటించగా, మరో కీలక పాత్రను బొమన్ ఇరానీ చేశారు. * షారుక్, కాజోల్‌ల సూపర్ హిట్ మూవీ ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ (డీడీఎల్‌జె)లో ట్రైన్ సీక్వెన్స్ హైలైట్‌గా నిలిచింది. ఆ సీక్వెన్స్‌ని ఆదర్శంగా తీసుకుని పలువురు దర్శకులు ఆ తరహా సన్నివేశాన్ని తమ చిత్రాల్లో జోడించారు. ‘దిల్వాలే’లో కూడా ‘డీడీఎల్‌జె’ తరహా ట్రైన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించారు రోహిత్. మరి.. ఈ సీక్వెన్స్ ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. * గత నెల 9న విడుదలైన ఈ ప్రచార చిత్రానికి అద్భుతమైన స్పందన లభించింది. ఇప్పటివరకూ దాదాపు కోటీ 70 లక్షల మంది ట్రైలర్‌ను వీక్షించారు. * ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ నిర్మించారు. హిట్ పెయిర్ షారుక్, కాజోల్ జంటగా నటించిన చిత్రం కావడంతో పలు ప్రముఖ టీవీ ఛానల్స్ శాటిలైట్ హక్కులు దక్కించుకోవడానికి పోటీ పడ్డాయి. ఈ పోటీని నిర్మాత చక్కగా క్యాష్ చేసుకున్నారు. ఓ ప్రముఖ టీవీ ఛానల్ ఏకంగా రూ. 60 కోట్లకు శాటిలైట్ హక్కులు సొంతం చేసుకుందని సమాచారం. ఇప్పటివరకూ ఏ చిత్రానికి ఇంత ధర పలకలేదని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. * మ్యూజిక్ రైట్స్ పరంగా కూడా రెడ్ చిల్లీస్కి భారీ మొత్తమే దక్కిందట. సోనీ మ్యూజిక్ సంస్థ ఆడియో హక్కులను 19 కోట్ల రూపాయలకు చేజిక్కించుకుందని భోగట్టా. * ఈ చిత్రంలోని ‘గేరువా...’ ప్రోమో సాంగ్‌ను ముంబైలోని మరాఠా మందిర్‌లో విడుదల చేశారు. ‘డీడీఎల్జే’ ఇక్కడే 20 ఏళ్ల పాటు ఆడిన విషయం తెలిసిందే. ఈ పాటను ఐస్‌ల్యాండ్‌లో చిత్రీకరించారు. మైనస్ డిగ్రీల చలిలో షారుక్-కాజోల్ మధ్య ఏడు రోజుల పాటు తీశారు. ఈ పాట మొత్తం బ్లూ కలర్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉంటుందట. ఈ పాటకు సంబంధించిన ఓ దృశ్యంలో ఒక ధ్వంసమైన విమానం కనిపిస్తుంది. అది సెట్ అని ప్రోమో చూసినవాళ్లు భావించారు. కానీ అది నిజమైన విమానమే అట. ఐస్‌ల్యాండ్‌లో జరిగిన ఓ ప్రమాదంలో ధ్వంసమైన విమానం అది. ఆ త ర్వాత దాన్ని ఓ టూరిస్ట్ స్పాట్‌గా ఆ దేశ ప్రభుత్వం అభివృద్ధి చేసింది. * రోహిత్ శెట్టి దర్శకత్వంలో వస్తున్న సినిమా అంటే ఫుల్ ఆఫ్ యాక్షన్ సీన్స్‌ను అభిమానులు ఆశిస్తారు. దానికి తగ్గట్టుగా ఈ సినిమాలో నాలుగు పోరాట సన్నివేశాలు ఉంటాయట. ఈ పోరాట సన్నివేశాలను దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్ సిటీ, మార్షియస్, అబుదబి దేశాల్లో చిత్రీకరించారు. * చాలా కాలం తర్వాత హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకున్న షారుక్ చిత్రమిదే. కీలక సన్నివేశాలను హైదరాబాద్‌లోని ఆర్ఎఫ్సీ, చార్మినార్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు * షూటింగ్ సమయంలో షారుక్‌ఖాన్ మోకాలికి గాయమైంది. ఆ గాయం నుంచి కోలుకోవడానికి రోహిత్‌శెట్టి ఓ సైకిల్ కొనిచ్చారట. మోకాలి గాయం తగ్గడానికి షారుక్ సైక్లింగ్ చేసేవారట. ఆ సైకిల్‌నే ఈ చిత్రంలోని ఓ షాట్లో వాడారు. * ఈ చిత్రం నిర్మాణ వ్యయం సుమారు వంద కోట్లు అని సమాచారం. ఏ విషయంలోనూ రాజీపడకుండా గౌరీ ఈ చిత్రాన్ని నిర్మించారట. * ‘దిల్వాలే’ విడుదల రోజే రణ్‌వీర్‌సింగ్, దీపికా పదుకొనె, ప్రియాంకా చోప్రా నటించిన ‘బాజీరావ్ మస్తానీ’ విడుదల కానుంది. సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. విచిత్రం ఏమిటంటే 2007 నవంబరు 7న షారుక్‌ఖాన్ ‘ఓం శాంతి ఓం’, సంజయ్‌లీలా భన్సాలీ ‘సావరియా’ ఒకే రోజున విడుదలయ్యాయి. ‘సావరియా’ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడితే, ‘ఓం శాంతి ఓం’ సూపర్‌హిట్‌గా నిలిచింది. మరి.. ఈసారి ఏం జరుగుతుందో? -
మంచుకొండల్లో ఆ పాటను ఎలా తీశారు?
చుట్టూ మంచుకొండలు.. ఎముకలు కొరిచే చలి.. స్వెట్టర్లు, తలకు రుమాళ్లు ధరించినా.. ఆ చలికి కాసేపు నిలువడం కష్టం. అలాంటి క్లిష్టమైన ఐస్‌ల్యాండ్‌లో వేసవి తరహాలో స్లీవ్‌లెస్ దుస్తులు వేసుకొని పాట తీయడమంటే మాటలు కాదు. అందుకే 'దిల్వాలే' సినిమాలో మంచుకొండల్లో తీసిన 'గెరువా' పాటను ఎలా చిత్రీకరించారనే విషయాన్ని తాజా మేకింగ్ వీడిమోలో షారుఖ్‌ఖాన్-కాజోల్ పంచుకున్నారు. భారీ జలపాతం ఎదురుగా పోజు ఇవ్వడం, ఐస్‌బెర్గ్ మధ్యలో నిలబడటం, చీర కట్టుకొని మంచు కొండలమీద స్టెప్పులు వేయడం అంత ఈజీ కాదని కాజోల్ చెప్పింది. 'గెరువా' పాట కోసం షారుఖ్, కాజోల్ స్లీవ్‌లెస్ దుస్తులు వేసుకున్నా.. షూటింగ్ గ్యాప్‌లో మాత్రం చలిని తట్టుకునేందుకు భారీ స్వెట్టర్లు వేసుకున్నారు. సాధారణంగా అత్యంత అసాధ్యమైన లోకేషన్లలో షూటింగ్ చేస్తేగానీ దర్శకుడు రోహిత్ శెట్టికి సంతృప్తి ఉండదు. అందుకే ఇంత క్లిష్టమైన ఐస్‌బర్గ్ మధ్యలో ఈ పాటను చిత్రీకరించారు. ఈ పాటకు సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో షారుఖ్, కాజోల్ పంచుకున్నారు. అత్యంత హిట్‌పెయిర్‌గా పేరొందిన షారుఖ్, కాజోల్ మళ్లీ కలిసి నటిస్తున్న 'దిల్వాలే' ఈ నెల 18న విడుదల కానుంది. -
'షారూక్ సినిమాతో పోటీ కాదు'
బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ మీద వచ్చే నెల ఆసక్తి కరమైన పోటీ జరగనుంది. టాప్ స్టార్స్‌తో రూపొందిన రెండు భారీ చిత్రాలు ఒకే సమయంలో బాలీవుడ్ తెర మీద పోటికి దిగుతున్నాయి. క్రిస్టమస్ సీజన్ కావటంతో ఈ గ్యాప్‌ను క్యాష్ చేసుకునేందుకు రెండు చిత్రాలు ఎదురుచూస్తున్నాయి. అయితే ఈ రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అయినా.. ఒక సినిమాకు మరో సినిమా పోటీ కాందంటున్నారు చిత్రయూనిట్. చాలా ఏళ్ల తరువాత బాలీవుడ్ ఐకానిక్ పెయిర్ షారూక్ ఖాన్, కాజోల్‌లు కలిసి నటిస్తున్న దిల్ వాలే సినిమా డిసెంబర్ రెండో వారంలో రిలీజ్‌కు రెడీ అవుతుంది. మాస్ సినిమాల స్పెషలిస్ట్ రోహిత్ శెట్టి రూపొందిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్లో వరుణ్ దావన్, కృతి సనన్‌లు కూడా లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు కళాత్మక చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ రూపొందించిన పీరియాడిక్ రొమాంటిక్ వార్ డ్రామా బాజీరావ్ మస్తానీ కూడా అదే సమయంలో రిలీజ్ కానుంది. రణవీర్ సింగ్, దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రాలు ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఇటీవల బాజీరావ్ మస్తానీ సినిమా ప్రమోషన్లో పాల్గొన్న హీరోయిన్ ప్రియాంక మాత్రం ఈ రెండు సినిమాలు ఒకదానితో ఒకటి పోటీ కావని, ఒకే సమయంలో రిలీజ్ అయినా.. పెద్దగా సమస్య ఉండదని చెపుతోంది. దిల్వాలే పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్, బాజీరావ్ మస్తానీ వార్ డ్రామా. ఈ రెండు సినిమాలకు ఎక్కడా పోలిక లేదు కనుక ఒకేసారి రిలీజ్ అయిన కలెక్షన్ల పరంగా ఎలాంటి సమస్యలు తలెత్తవంటుంది ఈ బాలీవుడ్ బ్యూటీ. -
బాహుబలి నిరాశ కలిగించింది : సెంథిల్
బాహుబలి తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన భారీ చిత్రం. ఓ రీజినల్ సినిమా కూడా చక్కటి కథా కథనాలతో తెరకెక్కించి భారీగా ప్రమోట్ చేస్తే జాతీయ స్ధాయిలో మంచి మార్కెట్ సాధించగలదని నిరూపించిన సినిమా. ఇంతటి భారీ చిత్రం కాబట్టే ఇప్పటికీ ఆ సినిమాలో నటించే అవకాశం రాలేదే అని చాలా మంది నటీనటులు బాధపడుతున్నారు. అలాంటి బాహుబలి ఆ సినిమాకు పనిచేసిన ఓ సాంకేతిక నిపుణుడిని నిరాశపరిచిందట..! పీరియాడిక్ వార్ డ్రామాగా తెరకెక్కిన బాహుబలి సినిమాలో చాలా భాగం గ్రాఫిక్స్ లో రూపొందించారు. ముఖ్యంగా తొలి భాగంలో వచ్చే పాటతో పాటు క్లైమాక్స్ మొత్తాన్ని గ్రాఫిక్స్ లోనే క్రియేట్ చేశారు. ఇలా ఎక్కువ భాగం విజువల్ ఎఫెక్ట్స్ తో రూపొందించటం, గ్రాఫిక్స్ విషయంలో జరిగిన చిన్న చిన్న పొరపాట్లు కెమరామేన్ సెంథిల్ ను నిరాశపరిచాయట. ఇంటర్ నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో పాల్గొన్న సెంథిల్ ఈ వ్యాఖ్యలు చేశాడు. మగధీర, అరుంథతి, ఈగ లాంటి భారీ చిత్రాలకు పనిచేసిన సెంథిల్, షారూఖ్, కాజోల్ జంటగా రూపొందుతున్న దిల్ వాలే సినిమాలో ఒక పాటకు సినిమాటోగ్రఫి అందించాడు. ప్రస్తుతం ఈ స్టార్ సినిమాటోగ్రాఫర్ బాహుబలి 2 మరింత క్వాలిటీతో అందించడానికి ప్రయత్నిస్తామన్నాడు. -
అభిమానులకు షారూఖ్ రిటర్న్ గిఫ్ట్
ఇటీవలే తన యాభయ్యో పుట్టిన రోజు జరుపుకున్న బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూక్ ఖాన్, మరోసారి తన అభిమానుల మనసు గెలుచుకున్నాడు. అమితాబ్ తరువాత అదే స్ధాయిలో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే షారూఖ్, తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ, తానే వ్యక్తిగతంగా ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలియజేశాడు. ఆ రోజంతా తన తన ఇంటికి వచ్చిన అభిమానులను, సన్నిహితులను కలుస్తూ ఎంతో ఆనందంగా గడిపాడు షారూక్. అక్కడితో వదిలేయకుండా తనకు శుభాకాంక్షలు తెలిపిన అభిమానులకు ఓ ఆశ్చర్యకరమైన రిటర్న్ గిఫ్ట్‌ను పంపాడు బాద్ షా. షారూక్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ దిల్వాలే. షారూక్ సరసన కాజోల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా అఫీషియల్ థియేట్రికల్ ట్రైలర్‌ను సోమవారం రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌ను అఫీషియల్ రిలీజ్ కంటే ముందు తనకు శుభాకాంక్షలు తెలిపిన ఫ్యాన్స్ ట్విట్టర్ అకౌంట్లకు నేరుగా పోస్ట్ చేశాడు కింగ్‌ఖాన్. షారూక్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్‌తో షాక్ అయిన అభిమానులు, ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. షారూక్, కాజోల్‌లతో పాటు వరుణ్ ధవన్, కృతి సనన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు రోహిత్ శెట్టి దర్శకుడు. షారూక్ సొంత బ్యానర్ రెడ్ చిల్లీస్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
''దిల్వాలే'తో నా ఎఫైర్ ముగిసిపోయింది'
ముంబై: 'సినిమా నిర్మాణమంటేనే ఒక ఎఫైర్ లాంటింది. ఆ ఎఫైర్‌ను సమాజం కూడా అంగీకరిస్తుంది. కానీ అది ముగిసిపోవడం ఎంతైనా బాధాకరమే. 'దిల్వాలే'లో నా వంతు షూటింగ్ ముగిసిపోయింది' అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు బొమన్ ఇరానీ. బాలీవుడ్లో విలక్షణ నటుడిగా పేరొందిన ఆయన ప్రస్తుతం షారుఖ్ ఖాన్, కాజోల్ జంటగా దర్శకుడు రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న 'దిల్వాలే' సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో తన పాత్ర షూటింగ్ పూర్తయిందని ఆయన శుక్రవారం రాత్రి ట్విట్టర్లో పేర్కొన్నారు. రొమాన్స్, కామెడీ, యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 18న విడుదలకానుంది. బాలీవుడ్ బెస్ట్ స్క్రీన్ కపుల్‌గా పేరొందిన షారుఖ్, కాజోల్ ఐదేళ్ల తర్వాత ఈ సినిమాలో మళ్లీ జత కట్టడంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాలో వరుణ్ ధావన్, కృతి సనన్ కూడా నటిస్తున్నారు. -
ప్రపంచంలో మేమే చెత్త డ్యాన్సర్లం
ఐదేళ్ల విరామం తరువాత 'దిల్వాలే' సినిమా కోసం మరోసారి కలిసి నటిస్తున్నారు బాలీవుడ్ హాట్ పెయిర్ షారూఖ్, కాజోల్. దిల్వాలే దుల్హనియా లేజాయేంగే, బాజీగర్, కభీ కుషి కభీ గమ్ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఈ జోడీ చివరగా మై నేమ్ ఈజ్ ఖాన్ సినిమాలో కలిసి కనిపించింది. తాజాగా దిల్వాలే సినిమా కోసం కాజోల్‌తో కలిసి ఓ సాంగ్ షూట్ లో పాల్గొంటున్న షారూఖ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశాడు. ' నాకు పనిచేయటం కంటే ఇష్టమైన పని ఇంకొంకటి లేదు. అది కూడా కాజోల్ తో డ్యాన్స్ చేయటం అయితే ఇంకా ఇష్టం. నిజం చెప్పాలంటే ఈ ప్రపంచంలోనే చెత్త డ్యాన్సర్లం మేమే' అంటూ ట్వీట్ చేశాడు షారూఖ్ ఖాన్. షారూక్ ఖాన్ స్వయంగా నిర్మిస్తున్న దిల్వాలే సినిమాకు రోహిత్ శెట్టి దర్శకుడు. కాజోల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో వరుణ్ ధావన్, కృతిసనన్ లు ఇతర లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ 18న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. There’s nothing I like more than working. A dancing nite with Kajol even better.V r the worst best dancers in the world!!! Honest confession — Shah Rukh Khan (@iamsrk) October 14, 2015 -
సెంథిల్‌కు షారూఖ్ పిలుపు
రాజమౌళి ఆస్థాన సినిమాటోగ్రాఫర్ సెంథిల్ గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడు. రాజమౌళి తెరకెక్కించిన సినిమాల విజయంలో సెంథిల్ది కూడా కీలక పాత్ర. ముఖ్యంగా ఈగ సినిమా తరువాత జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సెంథిల్, బాహుబలి సినిమాతో స్టార్ సినిమాటోగ్రాఫర్‌గా మారిపోయాడు. బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా సెంథిల్ కెమరా పనితనానికి ఫిదా అయిపోతున్నారు. మామూలు స్టార్లే కాదు ఏకంగా బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ కూడా సెంథిల్‌తో కలిసి పనిచేయాలనుకుంటున్నాడట. అందుకే ప్రస్తుతం షారూఖ్ చేస్తున్న 'దిల్వాలే' సినిమా కోసం షూట్ చేయాల్సి ఉన్న ఒక్క పాటకు సెంథిల్‌ను సినిమాటోగ్రఫీ అందించాలంటూ ఆహ్వానించాడు. ఇందుకు అంగీకరించిన సెంథిల్ త్వరలోనే దిల్వాలే టీంతో జాయిన్ అవుతున్నాడు. ప్రస్తుతానికి ఒక్క పాటకు మాత్రమే ఛాన్స్ ఇచ్చిన షారూఖ్, తన వర్క్ నచ్చితే తదుపరి సినిమాకు పూర్తి స్థాయి కెమెరామన్‌గా తీసుకునే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తుంది. -
మహేష్‌తో షారుఖ్ ఖాన్..
శనివారం రామోజీ ఫిలిం సిటీ ఓ అరుదైన కలయికకు వేదిక అయ్యింది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబును బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ కలిశారు. మహేష్ రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్లో జరిగే బ్రహోత్సవం సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు. కొద్ది రోజులుగా షారూఖ్ కూడా దిల్వాలే సినిమా కోసం ఫిలింసిటీలో ఉన్నారు. గత రెండు మూడు రోజులుగా షూటింగ్ బిజీ లేకపోవటంతో ఫ్రీగా ఉన్న షారూఖ్ బ్రహ్మోత్సవం సెట్ లో మహేష్ ను కలిశారు. షారూఖ్ సడన్ విజిట్‌తో యూనిట్ సభ్యులంతా థ్రిల్ అయ్యారు. మహేష్ కూడా తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. 'ఈ రోజు బ్రహ్మోత్సవం సెట్ లో షారూఖ్ ను కలవడం ఆనందంగా ఉంది. మన యూనిట్ సభ్యులంతా థ్రిల్ అయ్యారు. థ్యాంక్స్ సర్' అంటూ ట్వీట్ చేశాడు మహేష్. -
'ఆయనతో గడిపిన క్షణాలు ఇప్పటికీ గుర్తొస్తున్నాయి'
వరుస షూటింగ్ లతో నిద్ర కూడా లేకుండా బిజీగా గడుపుతున్న షారూఖ్ ఖాన్ గత రెండు రోజులుగా ఫ్యామిలీతోనే గడుపుతున్నాడు. శనివారం తన తండ్రి మీర్ తాజ్ మొహమ్మద్ ఖాన్ వర్థంతి సందర్భంగా ఆయనతో ఉన్న అనుబందాన్ని బాద్ షా అభిమానులతో పంచుకున్నాడు. తన తండ్రి మరణించి 35 సంవత్సరాలు పూర్తయినా ఆయనతో గడిపిన క్షణాలు ఇప్పటికీ గుర్తొస్తున్నాయంటూ ట్వీట్ చేశాడు. నిన్న కూడా ఆసక్తి కరమైన ట్వీట్ లతో అభిమానులను అలరించాడు షారూఖ్. షూటింగ్ లకు కాస్త బ్రేక్ దొరకటంతో ఆ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. మొన్నటి వరకు దిల్వాలే సినిమా కోసం హైదరాబాద్ షెడ్యూల్ లో బిజీగా ఉన్న బాద్షా, శుక్రవారం ఉదయం కూడ అదే మూడ్ లో నిద్రలేచాడు. అయితే షూటింగ్ లేకపోవటంతో 'ఇవాళ ఇంకా చాలా సేపు పడుకునే ఛాన్స్ ఉంది, ఇంత కన్నా ఆనందం కలిగించే ఫీలింగ్ ఏముంటుంది' అంటూ ట్వీట్ చేశాడు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజోల్ హీరోయిన్గా నటిస్తుండగా, వరుణ్ ధావన్, కృతిసనన్లు ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. దిల్వాలే సినిమాకు సంబందించిన వర్క్ పూర్తి కాగానే ఫ్యాన్, రాయిస్ సినిమాల షూటింగ్లో పాల్గొననున్నాడు షారూఖ్. Yrs accumulate & our wounds turn into water, & reflect the unlikely glimmer of happiness in moments of remembrance.35 yrs since I saw my Dad — Shah Rukh Khan (@iamsrk) September 18, 2015 -
భర్త నిర్మాత... భార్య హీరోయిన్!
‘దిల్వాలే’ షూటింగ్‌తో కాజోల్ చాలా బిజీగా ఉన్నారు. అలాగే ఆమె భర్త, హీరో అజయ్ దే వ్గణ్ తాను హీరోగా నటించిన మలయాళ ‘దృశ్యం’ హిందీ రీమేక్ ప్రచార కార్యక్రమాల్లో తలమునకలై ఉన్నారు. ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉన్నారు. మరి.. మీరు, మీ సతీమణి జంటగా సినిమా చేసే అవకాశం ఉందా? అనే ప్రశ్న అజయ్ దేవ్‌గణ్ ముందుంచితే -‘‘ఇప్పుడా ప్లాన్స్ ఏవీ లేవు’’ అన్నారు. కాకపోతే, తాను నిర్మాతగా మారి కాజోల్ హీరోయిన్గా ఓ చిత్రాన్ని నిర్మిస్తాన న్నారు. ‘‘మా ఇద్దరి కాంబినేషన్‌కి నప్పే కథ రెడీగా లేదు. కాజోల్ ఇప్పుడు నటిస్తున్న ‘దిల్వాలే’ షూటింగ్ అయిపోతే, డిసెంబర్లో తను హీరోయిన్గా ఓ చిత్రాన్ని మొదలుపెడతా. మంచి స్క్రిప్ట్ దొరికినప్పుడు కచ్చితంగా ఇద్దరం కలిసి నటిస్తాం’’అని అజయ్ చెప్పారు. -
అమ్మో... కోటి రూపాయలా!
కృతీసనన్ ఇప్పటివరకూ తెలుగులో రెండు సినిమాలు చేస్తే, హిందీలో చేసింది కేవలం ఒకటే. ఆమె తాజాగా హిందీలో నటిస్తున్న చిత్రం ‘దిల్వాలే’. రోహిత్ శెట్టి దర్శకత్వంలో షారుక్ ఖాన్, కాజోల్ మళ్లీ కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్‌ధావన్‌కు జోడీ కృతీ సనన్. చిత్రం ఏమిటంటే, ఈ భారీ ప్రాజెక్టుతో కృతీకి క్రేజ్ అమాంతం పెరిగిపోయి ఓ జాక్‌పాట్ తగిలింది. సౌందర్య సాధనాల ఉత్పత్తుల కంపెనీ ఒకటి తమ వాణిజ్య ప్రకటనలో నటించడానికి ఆమెకు ఏకంగా కోటి రూపాయలు ఆఫర్ చేసిందట. దీంతో కృతి ఆనందానికి అవధులు లేవు. బాలీవుడ్లో ఒక్క సినిమాతోనే ఇంత బంపర్ ఆఫర్ కొట్టేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. -
అమ్మో! అయిదు కోట్లా!?
నటి కాజోల్ చాలాకాలం తరువాత మరోసారి వెండితెరపై మెరుస్తున్న సంగతి తెలిసిందే. అదీ... భారీ బడ్జెట్ చిత్రం ‘దిల్వాలే’ ద్వారా! అందులోనూ తనకు విజయవంతమైన జోడీ అయిన షారుఖ్ ఖాన్ సరసన!! రోహిత్షెట్టీ రూపొందిస్తున్న ఈ చిత్రం గురించి తాజాగా మరో ఆసక్తికరమైన కబురు తెలిసింది. ఈ సినిమాకు కాజోల్ అందుకుంటున్న పారితోషికం అక్షరాలా రూ. 5 కోట్లట! ఒక ప్రముఖ ట్యాబ్లాయిడ్ ఈ సంగతి వెల్లడించింది. చాలా కాలంగా సినిమాల్లో కనిపించని కాజోల్ ఇప్పుడు ఈ చిత్రంతో ఏకంగా అగ్రశ్రేణి తారలు కరీనా కపూర్, కత్రినా కైఫ్‌ల స్థాయిలో అత్యధిక పారితోషికం అందుకోనుందన్న మాట! రానున్న జూన్ నుంచి ఈ చిత్రం కోసం షారుఖ్, కాజోల్‌లు షూటింగ్లో పాల్గొననున్నారు. గతంలో ‘బాజీగర్’, ‘దిల్వాలే దుల్హనియా లే జాయేంగే’, ‘కుఛ్ కుఛ్ హోతా హై’, ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ చిత్రాల్లో ఈ హిట్ జోడీ అందరినీ ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఈ వినోదాత్మక కుటుంబకథలో తెరపై మెరవనున్నారు. రోహిత్ షెట్టీతో పాటు షారుఖ్ భార్య గౌరీ ఖాన్ కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామి. షారుఖ్, కాజోల్‌ల జోడీతో పాటు వరుణ్ ధావన్, కృతీ సనన్‌లు యువ జంట కూడా ఈ కథలోని కీలక పాత్రధారులు. చకచకా షూటింగ్ పూర్తి చేసి, ఈ ఏడాది క్రిస్మస్కు సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నట్లు దర్శకుడు రోహిత్ షెట్టీ చెప్పారు. విడుదల లోగా మరెన్ని విశేషాలు బయటకొస్తాయో కానీ, ప్రస్తుతానికి పారితోషికం వ్యవహారంతో కాజోల్ అందరినీ అవాక్కయ్యేలా చేసింది.