ఆ వినోదం అమరం
‘‘నువ్వు సినిమాల్లోకి వెళ్లావంటే చంపేస్తా’’. సరిగ్గా తలకు తుపాకీ గురి పెట్టి కొడుకు వినోద్ ఖన్నాను బెదిరించారు కిషన్‌చంద్ ఖన్నా. సినిమా ల్లోకి వెళ్లాలని బలంగా నిర్ణయించుకున్న వినోద్ ఖన్నాకి ఏం పాలుపోలేదు. వెళ్లే తీరతానంటే తండ్రి ఊరుకోడు. ‘‘రెండంటే రెండేళ్లు అవకాశం ఇవ్వండి. నిలదొక్కుకోలేకపోతే వెనక్కి వచ్చేస్తాడు’’ అంటూ కొడుకుని సపోర్ట్ చేస్తూ, భర్తను ఒప్పించారు వినోద్ ఖన్నా తల్లి కమల. ఆ రోజు ఆ సపోర్ట్ లేకపోయుంటే వినోద్ ఖన్నా అనే ఆరడుగుల అందగాడు వెండితెరకు వచ్చి ఉండేవాడు కాదు. ప్రతినాయకుడిగా మొదలై నాయకుడిగా ఎదిగి, సహాయ నటుడిగానూ ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకున్నారాయన.
‘మొఘల్–ఎ–అజం’ ప్రభావంతో...
1946 అక్టోబర్ 6న పెషావర్‌లో వినోద్ ఖన్నా జన్మించారు. అతను పుట్టిన కొన్ని నెలలకే దేశ విభజన జరగడంతో వినోద్ కుటుంబం ముంబై చేరింది. నాసిక్‌లో డిగ్రీ చదువుకుంటున్న సమయంలోనే వినోద్ ఖన్నాకు సినిమాల పట్ల ఆసక్తి ఏర్పడింది. అప్పుడు చూసిన ‘సోల్వా సాల్’, ‘మొఘల్–ఎ–అజం’ చిత్రాలు సినిమాల్లోకి రావాలనే అభిప్రాయాన్ని కలిగించాయి. అనుకోకుండా ఓ పార్టీలో దర్శక–నిర్మాత సునీల్ దత్‌ని కలిశారు వినోద్ ఖన్నా. అప్పుడు తన సోదరుడు సోమ్ దత్ హీరోగా సునీల్ దత్ ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారు. అందులో విలన్‌గా వినోద్ ఖన్నాకు అవకాశం ఇచ్చారు. హీరోలా ఉన్నప్పటికీ నటన మీద మక్కువతో వినోద్ ఖన్నా ఒప్పేసుకున్నారు. అలా ‘మన్ కా మీత్’ (1968) సినిమా ద్వారా ఆయన తొలిసారి తెరపై కనిపించారు. ఆ సినిమాకి మన తెలుగు దిగ్గజం ఆదుర్తి సుబ్బారావు దర్శకుడు.
వారంలో 15 సినిమాలు!
మొదటి సినిమా రిలీజైన వారానికి ఏకంగా 15 సినిమాలకు సైన్ చేశారు వినోద్ ఖన్నా. పూరబ్ ఔర్ పశ్చిమ్, సచ్చా ఝూటా, మస్తానా, మేరో గోన్ మేరా దేశ్, ఎలానా వంటి చిత్రాల్లో విలన్‌గా, సహాయ నటుడిగా చేశారు.రీల్ లైఫ్ బాగుంది. రియల్ లైఫ్‌లోనూ సెటిలవ్వాలను కున్నారు. కాలేజీలో ప్రేమించిన గీతాంజలిని పెళ్లాడాలనుకున్నారు.
50 మల్టీస్టారర్స్‌లో...
1971లో ఈ ప్రేమికులు భార్యాభర్తలయ్యారు. అదే ఏడాది వినోద్ ఖన్నాకు హీరోగానూ బ్రేక్ వచ్చింది. ‘హమ్ తుమ్ ఔర్ ఓ’ సినిమాతో ఆయన హీరోగా మారారు. ఫరేబీ, కాయిద్, జాలిమ్, ఇన్కార్ వంటి చిత్రాల్లో హీరోగా నటించారు. ఇద్దరు హీరోలున్న సినిమాలూ ఎక్కువే చేశారు. ఫిరోజ్ ఖాన్ స్వీయదర్శకత్వంలో తెరకెక్కించి, నటించిన ‘కుర్బానీ’ (1980)లో వినోద్ ఖన్నా ఓ హీరో. ఆ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా గుర్తింపు పొందింది. శశికపూర్, అమితాబ్ బచ్చన్, రణధీర్ కపూర్ వంటి హీరోలతో కలిసి దాదాపు 50 మల్టీస్టారర్ మూవీస్ చేశారు వినోద్ ఖన్నా. అమితాబ్‌తో ఆయనకు మంచి పోటీ ఉండేది. అప్పటికి అమితాబ్ అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరో. అయితే 1974 నుంచి 1982 వరకూ అమితాబ్, జితేంద్ర కాంబినేషన్‌లో చేసిన సినిమాల్లో వినోద్ ఖన్నాకే ఎక్కువ పారితోషికం ఇచ్చారు దర్శక–నిర్మాతలు.
ఓషో ఆశ్రమంలో నిరాడంబర జీవితం
పేరు, డబ్బు, ప్రేమించి, పెళ్లి చేసుకున్న గీతాంజలి, ఇద్దరు కుమారులు (రాహుల్ ఖన్నా, అక్షయ్ ఖన్నా).. వినోద్ ఖన్నా జీవితం బ్రహ్మాండంగా ఉంది. అయితే జీవితం అంటే ఇదేనా? అనిపించిందాయనకు. అప్పటికే ఆధ్యాత్మిక గురువు ‘ఓషో’ బోధనలకు ఆకర్షితుడయ్యారాయన. చివరికి 1982లో సినిమాలకు ‘రిటైర్‌మెంట్’ ప్రకటించి, అమెరికాలోని రజనీష్ పురంలో గల ఓషో ఆశ్రమానికి వెళ్లిపోయారాయన. అక్కడ నిరాడంబర జీవితం గడిపారు. టాయ్‌లెట్స్ శుభ్రం చేసేవారు. గిన్నెలు కడిగేవారు. తోటమాలిగా చేసేవారు. అయితే వినోద్ ఖన్నా ఇంటికి దూరం కావడం ఆయన భార్యా, పిల్లలకు ఇబ్బందిగా మారింది. అదే ఆయన్ను వాళ్లకు దూరం చేసింది. వినోద్, గీతాంజలి విడాకులు తీసుకున్నారు. ఓషో ఆశ్రమంలో నాలుగేళ్లు ఉండి, ఇండియాకి వచ్చేసరికి వినోద్ ఖన్నా ఒంటరిగా మిగిలిపోయారు. మళ్లీ సినిమాలు చేయడం మొదలుపెట్టారు. మొదటి భార్య నుంచి విడిపోయిన ఐదేళ్లకు కవితను పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కొడుకు (సాక్షి), కూతురు (శ్రద్ధ) ఉన్నారు.
‘దిల్‌వాలే’ చివరి సినిమా
విశేషం ఏంటంటే.. కొంత గ్యాప్ తర్వాత వచ్చినా వినోద్ ఖన్నాకు అవకాశాలకు కొదవ లేకుండాపోయింది. ‘ఇన్సాఫ్’ (1987)తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి, వరుసగా సినిమాలు చేశారు. కొడుకు అక్షయ్ ఖన్నా కోసం ‘హిమాలయ్ పుత్ర్’ (1997) సినిమా నిర్మించి, నటించారు కూడా. 2015లో వచ్చిన షారుక్ ‘దిల్‌వాలే’ వినోద్ ఖన్నాకు చివరి చిత్రం.
రాజకీయాల్లోనూ సక్సెస్
1997లో వినోద్ ఖన్నా రాజకీయ రంగప్రవేశం చేశారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నియోజక వర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1999లోనూ అదే నియోజక వర్గం నుంచి గెలుచుకున్నారు. 2002లో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రిగా చేశారు. ఆ తర్వాత పలు పదవులు చేపట్టారు. ప్రస్తుతం గురుదాస్‌పూర్‌కి ఎంపీగా ఉన్నారు.
ఎక్కువ సినిమాల్లో ‘అమర్’ పేరుతో...
గత కొంతకాలంగా వినోద్ ఖన్నా ఆరోగ్యం బాగాలేదు. ఈ నెల మొదటి వారంలో వినోద్ ఖన్నా బక్క చిక్కిన శరీరంతో, చాలా బలహీనంగా కనిపించిన ఫొటో ఒకటి బయటికొచ్చింది. అది చూసి బాధపడనివాళ్లు లేరు. ఆయన బ్లాడర్ (మూత్రకోశం) కేన్సర్‌తో బాధపడుతున్నారనే వార్తలు రాగా, ‘అదేం లేదు. డీ హైడ్రేషన్‌తో బాధపడుతున్నారు’ అని వినోద్ ఖన్నా తనయుడు రాహుల్ ఖన్నా ప్రకటించారు. వినోద్ ఖన్నా త్వరగా కోలుకోవాలని పలువురు బాలీవుడ్ ప్రముఖులతో పాటు ఆయన అభిమానులూ కోరుకున్నారు.
కొన్ని రోజులుగా ముంబైలోని హెచ్.ఎన్. రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వినోద్ ఖన్నా (70) గురువారం తుది శ్వాస విడిచారు. ఆయన మరణవార్త విని సినీ, రాజకీయ రంగ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వినోద్‌ఖన్నా ఎక్కువ సినిమాల్లో ‘అమర్’ పేరుతో తెరపై మెరిశారు. కేన్సర్‌తో కన్నుమూసిన ఆయన ఇప్పుడిక అమర లోకంలో వినోదం పంచుతారనే వ్యాఖ్యలతో అభిమానులు ఆయన నటవైభవాన్ని గుర్తు చేసుకుంటున్నారు.