బాహుబలి నిరాశ కలిగించింది : సెంథిల్
బాహుబలి తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన భారీ చిత్రం. ఓ రీజినల్ సినిమా కూడా చక్కటి కథా కథనాలతో తెరకెక్కించి భారీగా ప్రమోట్ చేస్తే జాతీయ స్ధాయిలో మంచి మార్కెట్ సాధించగలదని నిరూపించిన సినిమా. ఇంతటి భారీ చిత్రం కాబట్టే ఇప్పటికీ ఆ సినిమాలో నటించే అవకాశం రాలేదే అని చాలా మంది నటీనటులు బాధపడుతున్నారు. అలాంటి బాహుబలి ఆ సినిమాకు పనిచేసిన ఓ సాంకేతిక నిపుణుడిని నిరాశపరిచిందట..!
పీరియాడిక్ వార్ డ్రామాగా తెరకెక్కిన బాహుబలి సినిమాలో చాలా భాగం గ్రాఫిక్స్ లో రూపొందించారు. ముఖ్యంగా తొలి భాగంలో వచ్చే పాటతో పాటు క్లైమాక్స్ మొత్తాన్ని గ్రాఫిక్స్ లోనే క్రియేట్ చేశారు. ఇలా ఎక్కువ భాగం విజువల్ ఎఫెక్ట్స్ తో రూపొందించటం, గ్రాఫిక్స్ విషయంలో జరిగిన చిన్న చిన్న పొరపాట్లు కెమరామేన్ సెంథిల్ ను నిరాశపరిచాయట. ఇంటర్ నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో పాల్గొన్న సెంథిల్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
మగధీర, అరుంథతి, ఈగ లాంటి భారీ చిత్రాలకు పనిచేసిన సెంథిల్, షారూఖ్, కాజోల్ జంటగా రూపొందుతున్న దిల్ వాలే సినిమాలో ఒక పాటకు సినిమాటోగ్రఫి అందించాడు. ప్రస్తుతం ఈ స్టార్ సినిమాటోగ్రాఫర్ బాహుబలి 2 మరింత క్వాలిటీతో అందించడానికి ప్రయత్నిస్తామన్నాడు.