ఆ వ్యాఖ్యలు చేసినందుకు షారుఖ్ సారీ!
తన తాజా చిత్రం 'దిల్‌వాలే' విడుదలకు రెండురోజుల ముందు బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఆసక్తికర ప్రకటన చేశారు. దేశంలో తీవ్ర అసహనం నెలకొందని గతంలో తాను చేసిన వ్యాఖ్యలకుగాను ఆయన క్షమాపణలు చెప్పారు. తన పుట్టినరోజు సందర్భంగా ఓ టీవీచానెల్‌తో మాట్లాడుతూ దేశంలో విపరీతమైన మత అసహనం ఉందని షారుఖ్ అన్నారు. మత అసహనం, లౌకికవాదిగా ఉండకపోవడం అనేవి దేశానికి ఒక దేశభక్తుడు చేసే తీవ్రమైన నేరమే అవుతుందని ఆయన పేర్కొన్నారు. అసహనంపై షారుఖ్ వ్యాఖ్యల తర్వాత అమీర్‌ఖాన్ కూడా వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో ఇద్దరు బాలీవుడ్ స్టార్లు విమర్శలు ఎదుర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ఏబీపీ న్యూస్‌తో మాట్లాడిన షారుఖ్ తన వ్యాఖ్యలు ఎవరి మనోభావాలనైనా దెబ్బతీస్తే క్షమించాలని కోరారు. దేశంలో తాను ఎలాంటి అసహనాన్ని ఎదుర్కొనలేదని, దాని గురించి కూడా తాను ఎప్పుడూ మాట్లాడలేదని చెప్పారు. ఈ నెల 18న 'దిల్‌వాలే' విడుదల కానున్న నేపథ్యంలో తాను ఈ వ్యాఖ్యలు చేయడం లేదని ఆయన వివరణ ఇచ్చారు.