
హైదరాబాద్‌ను సినీ రాజధానిగా ఉంచాలి
‘‘రాష్ట్రం రెండుగా విడిపోయిన సందర్భంగా... ఏపి ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ పేరును తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్‌గా మార్చాలని నిర్ణయించాం. ఇక్కడ రూపొందేవి తెలుగు సినిమాలే కాబట్టే ఈ పేరే సముచితమైంది. ఇరు ప్రాంతాల్లోనూ ఆయా ప్రాంతాల సినిమాల స్థితిగతులు తెలుసుకోవడానికి గతంలోనే లోకల్ చాంబర్‌లు ఏర్పాటు చేశాం. అవేమీ ఈ వాణిజ్యమండలికి ప్రతిబంధకాలు కాకూడదు’’ అని సీనియర్ దర్శక - నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నారు. శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రం రెండుగా విడిపోయిన నేపథ్యంలో తెలుగు సినిమా ఎదుర్కొంటున్న పలు సమస్యల గురించి ఏకరువు పెట్టారు.
‘‘ప్రస్తుతం తెలుగు సినిమా పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. కొత్తగా ఏర్పడ్డ రెండు ప్రభుత్వాలూ ఈ పరిస్థితిని సరిదిద్దాలి. రెండు రాష్ట్రాల్లోనూ ఉంది తెలుగు ప్రేక్షకులే కాబట్టి తెలుగు సినిమాపై వివక్ష తగదు’’ అని ఆయన అన్నారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించి, అటు ప్రేక్షకులకు, ఇటు పరిశ్రమకు మంచి జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలను రెంటినీ అభ్యర్థించారు. ముంబయ్ తరహాలో హైదరాబాద్‌ని సినీ రాజధానిగా ఉంచి కార్యకలాపాలు జరపాలని ఆయన ప్రభుత్వాలకు సూచించారు.