ఆమె జీవితకథలో నటించాలని ఉంది!
నాటి తరంలో బాలీవుడ్ ను ఒక ఊపు ఊపిన అందగత్తెల్లో పర్వీన్ బాబీ ఒకరు. గ్లామరస్ పాత్రలకు చిరునామాగా నిలిచారామె. ఈ హాట్ బ్యూటీతో నటించడానికి అప్పట్లో హీరోలు పోటీపడేవారట. దాన్నిబట్టి పర్వీన్‌కు ఎంత క్రేజ్ ఉండేదో ఊహించుకోవచ్చు. ఇప్పుడు పర్వీన్ బాబీ గురించి చెప్పడానికి ఓ కారణం ఉంది. ఇటీవల ఓ సందర్భంలో ఈ హాట్ లేడీ గురించి శ్రద్ధాకపూర్ నాన్‌స్టాప్‌గా మాట్లాడారు. పర్వీన్ బాబీ అంటే తనకెంతో అభిమానమని శ్రద్ధాకపూర్ పేర్కొన్నారు.
ఏ స్థాయి అభిమానం అంటే... ఎవరైనా పర్వీన్ బాబీ జీవితం ఆధారంగా సినిమా తీస్తే, అందులో నటించాలని శ్రద్ధాకపూర్ అనుకుంటున్నారట. ఈ విషయం గురించి శ్రద్ధాకపూర్ చెబుతూ - ‘‘పర్వీన్ మా ఇంటి పక్కనే ఉండేవారు. ఆమె కనిపిస్తే చాలు అలా చూస్తూ ఉండిపోవాలనిపించేది. గొప్ప అందగత్తె. ఆమె అందాన్ని మాటల్లో వర్ణించలేం. చిన్న వయసులోనే బోల్డన్ని పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. వృత్తి జీవితంలో తిరుగులేదనిపించుకున్న పర్వీన్ వ్యక్తిగతంగా మాత్రం అంత ఆనందంగా గడపలేదనిపిస్తోంది. ఎందుకో తెలియదు కానీ, పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయారు. చివరికి, అనారోగ్యంతో ఆమె జీవితం విషాదాంతంగా ముగిసింది’’ అని చెప్పుకొచ్చారు.