ఆ హీరోకి నేను ఫీమేల్ వెర్షన్: నటి
ముంబై: మోడల్ గా కెరీర్ ఆరంభించి హీరోయిన్ గా మారిన వారిలో ఊర్వశీ రౌతెలా ఒకరు. యాక్షన్-రొమాన్స్ మేలవింపుతో సింగ్ సాబ్ ద గ్రేట్ మూవీతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ 'గ్రేట్ గ్రాండ్ మస్తీ'లో నటనకు గానూ మంచి మార్కులు కొట్టేసింది. యమహా ఫాసినో మిస్ దివా 2015- మిస్ యూనివర్స్ ఇండియా కంటెస్టెంట్ గా అందరికీ సుపరిచితురాలు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని ఈ బ్యూటీ నిర్ణయించుకుంది. థైక్వాండో, జిమ్నాస్టిక్స్ లలో శిక్షణ తీసుకుంటానని చెప్పిన ఊర్వశీ.. తాను అక్షయ్ కుమార్ ఫిమెల్ వెర్షన్ గా పేరు తెచ్చుకోవాలని ఆశపడుతున్నట్లు పేర్కొంది.
అక్షయ్ ని స్ఫూర్తిగా తీసుకుని మార్షల్ ఆర్ట్స్ లో పట్టు సాధిస్తానంటోంది. ప్రస్తుతం టీ సిరీస్ తో మూడు మూవీల కోసం ఒప్పందం కుదుర్చుకున్న ఈ అందాల భామ ఆ పనిలో బిజీగా ఉన్ననని చెప్పింది. 'గాల్ బాన్ గాయి' అనే సాంగ్ లో తాను భాగస్వామిని అయ్యానని దీంతో గ్రేట్ సింగర్ సుఖ్ బిర్ తో పనిచేయాలన్న తన కల నెరవేరిందని చెప్పుకొచ్చింది. తనకు యాక్షన్ మూవీలలో నటించడమంటే ఎంతో ఇష్టమని.. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న తర్వాత ఆ తరహా సినిమాలు చేయాలనుందని తెలిపింది.