మళ్లీ కెమెరా వెనక్కు వెళ్తా!
మళ్లీ కెమెరా వెనక్కు వెళ్తా!
Published Thu, Nov 21 2013 3:06 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
కెమెరా వెనక్కు వెళ్లాలనే కోరిక తనలో ఇంకా అలాగే ఉందంటున్నాడు బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్. ఇప్పటిదాకా నటుడిగా కెమెరా ముందు ఎన్నో అనుభవాలను ఎదుర్కొన్న సన్నీ దర్శకుడిగా కూడా కొన్ని అనుభవాలను మూటగట్టుకున్నాడు. అయితే మరోసారి దర్శకత్వం వహించాలనే తన కల సాకారం కావడానికి ఒకట్రెండేళ్లు పట్టే అవ కాశముందంటున్నాడు. త్వరలో ‘సింగ్ సహాబ్ ద గ్రేట్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ యాభయేడేళ్ల నటుడు 1999లో ‘దిల్లగీ’ సినిమాతో దర్శకుడిగా మారాడు. నటుడిగా కాకుండా ఇంకేదైనా చేయాలనే కోరిక తనను దర్శకత్వం వైపు లాగుతోందని, అయితే ఒకట్రెండేళ్లు ఆగుతానంటున్నాడు.
సినిమాను తెరకెక్కించే మంచి అంశమేదైనా బుర్రకు తట్టగానే కెమెరా వెనక్కు వెళ్తానంటున్నాడు. తనలోని నటుడిని బయటపెట్టిన దర్శకుడు అనిల్ శర్మతో కలిసి మరోసారి పనిచేసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉందన్నాడు. గదార్-ఏక్ ప్రేమ్ కథా, ద హీరో: లవ్‌స్టోరీ ఆఫ్ ఏ స్పై, అప్నే తదితర చిత్రాలను సన్నీతో కలిసి శర్మ తెరకెక్కించినవే. దీంతో తాజాగా విడుదల కానున్న ‘సింగ్ సహాబ్ ద గ్రేట్’పై అంచనాలు కూడా భారీగానే పెరిగాయి.ఈ విషయమై సన్నీ మాట్లాడుతూ... ‘దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ఈ సినిమాను చేస్తున్నా.
ఓ రకంగా ఇది సోలో ఫిల్మ్ అని చెప్పొచ్చు. వందశాతం కష్టపడుతున్నా.. మరోసారి యాంగ్రీ-యాక్షన్ హీరోగా నిలబెడుతుందనే విశ్వాసముంది. అమృతారావు, నూతన నటి ఊర్వశీ రౌతేలాలు కథనాయికలుగా నటిస్తున్నారు. శర్మ చెప్పిన కథపై చాలా నమ్మకముంది. నాకు సరిపడే కథలతోనే ఆయన నా వద్దకు వస్తారు. అందుకే ఆయనతో కలిసి పనిచేసే ఏ అవకాశాన్ని కూడా ఇప్పటిదాకా వదలిపెట్టలేదు. సినిమాలో కొంత భాగాన్ని జైలులో చిత్రీకరించాం. అందులో ఖైదీలో ఎంతో క్రమశిక్షణతో ఉన్నార’ని కితాబునిచ్చాడు.
Advertisement
Advertisement