
చెన్నై : నాకలా ఉండటమే ఇష్టం అంటోంది నటి నిత్యామీనన్. ఇతర హీరోయిన్లకంటే ఈ అమ్మడు కాస్త భిన్నమని చెప్పకతప్పదు. ఎవరో ఏదో అంటారని కాకుండా తనకు అనిపించింది చేసేసే నటి నిత్యామీనన్. విమర్శలను అస్సలు పట్టించుకోని నటి ఈ అమ్మడు. ఆ మధ్య కాస్త లావెక్కింది. దానిపై కొందరు కామెంట్స్ చేస్తే, తానెలా ఉండాలో తనకు బాగా తెలుసని, తన గురించి ఆలోచించడం మానేసి ఎవరి పని వారు చేసుకోవడం మంచిదని చురకలు వేసింది. ఆ మధ్య అవకాశాలు సన్నగిల్లాయనే ప్రచారం జరిగింది. ఇప్పుడు మళ్లీ చేతి నిండా చిత్రాలతో బిజీ అయిపోయింది. హిందీతో సహా పలు భాషల్లో. తమిళంలో సైకో అనే చిత్రంలో నటిస్తోంది.
దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌లో నటించే అవకాశం వరించింది. వీటితో పాటు మాతృభాషలో రెండు చిత్రాలు, హిందీలో మిషన్ మంగళ్ అనే చిత్రంలోనూ నటిస్తోంది. తాజాగా చాలా సన్నబడి కొత్తఅందాలను సంతరించుకుంది. ఇంతకుముందు బొద్దుగా తయారయ్యిందని సెటైర్లు వేసిన వారే ఇప్పుడు వావ్ నిత్యా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇటీవల మీడియాకు పలు విషయాలను పంచుకుంది. అవేంటో చూసేద్దామా! నటీనటులను అభిమానులు చూసే కోణం వేరు, మమ్మల్ని మేము చేసుకునే కోణం వేరు అని చెప్పింది. ముఖ్యంగా ఒక ప్రముఖ నటిననే భావన తనకు ఉండదని చెప్పింది. తనను తాను ఒక సాధారణ మహిళగానే అనుకుంటానని అంది. షూటింగ్ లేని సమయాల్లో ఒంటరిగా ఉన్నప్పుడు తన ఆలోచనలు సగటు మహిళ మాదిరిగానే ఉంటాయని పేర్కొంది. షూటింగ్ కారణంగా అలసిపోవడం సహజం అని, అలాంటి సమయంలో తనకు శక్తినిచ్చేది ప్రకృతినేనని చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment