వారిలా నిజజీవితంలో నటించలేను!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కథానాయిక ఎవరంటే... గతంలో అందరూ నయనతార పేరు చెప్పేవారు. ఇప్పుడు ఆ క్రెడిట్‌ని నిదానంగా సమంత సొంతం చేసుకుంటున్నారు. మాటలతోనే దుమారాలను రేపుతున్నారామె. మొన్నామధ్య ‘1’ పోస్టర్ విషయంలో ‘ఆడవారి మనోభావాలు దెబ్బతినేలా ఆ పోస్టర్ ఉంది’ అని ఓ రేంజ్‌లో రాద్ధాంతం చేసి అందరి దృష్టినీ ఆకర్షించారు. ఇప్పుడేమో.. చెన్నయ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ మరో వివాదానికి తెరలేపారు.
‘‘మేకప్ ఉన్నంతవరకే నేను నటిని. అప్పుడు నా ఆలోచనంతా పాత్ర మీదే ఉంటుంది. మేకప్ తీసేస్తే.. మామూలు సమంతని అయిపోతా. ఇక పొరపాటున కూడా పాత్ర గురించి ఆలోచించను. కొందరిలా నిజజీవితంలో కూడా నటించడం నాకు చేతకాదు’’ అనేసి పెద్ద చర్చకే తెరలేపారు సమంత. ఇంతకీ ‘ఆ కొందరు ఎవరు?’ అనే చర్చ కోలీవుడ్‌లో జోరందుకుంది. తన తోటి హీరోయిన్లను ఉద్దేశించే సమంత అలా అన్నారా? అని పలువురు సందేహం. మరి సమంతకు పోటీగా చలామణీ అవుతున్న హీరోయిన్లు ఈ విషయంపై ఎలా స్పందిస్తారో చూడాలి.