
జ్యోతిలక్ష్మీ-2 కూడా చేస్తా: పూరి జగన్నాథ్
‘‘ఈ టీమ్‌తో పనిచేశాక అప్పుడే ముసలివాళ్లం అయిపోతున్నాం అన్న భయం పోయింది. మల్లాది వెంకటకృష్ణమూర్తిగారు 45 సంవత్సరాల క్రితం రాసిన ‘మిసెస్ పరాంకుశం’ కథను సినిమాగా తీద్దామని నేను దర్శకుడు కాకముందే అనుకున్నా. అప్పట్లో నా దగ్గర డబ్బుల్లేవ్. దాంతో దర్శకుడయ్యాక కథ తీసుకుంటానని మల్లాది గారి దగ్గర అన్నాను. చివరికి ఇప్పటికి కుదిరింది’’ అని పూరి జగన్నాథ్ చెప్పారు. చార్మి, సత్య ప్రధాన పాత్రల్లో సీకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై చార్మి కౌర్ సమర్పణలో శ్వేతలానా, వరుణ్, తేజ, సీవీ రావు నిర్మించిన చిత్రం ‘జ్యోతిలక్ష్మీ’. పూరి జగన్నాథ్ దర్శకుడు.
సునీల్ కశ్యప్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ సంద ర్భంగా పూరి జగన్నాథ్ మాట్లాడుతూ- ‘‘ఈ సినిమా చెయ్యాలంటే ఒక పవర్‌హౌస్ కావాలి. అందుకే చార్మీని తీసుకున్నా. మంచి ఎనర్జీతో ఈ పాత్ర చేసింది. త్వరలో ‘జ్యోతిలక్ష్మి-2’ చేయబోతున్నా’’ అని తెలిపారు. ‘‘ఇప్పటి వరకూ హీరోయిన్‌గా కెమెరా ముందుండి వర్క్ చేశాను. మొదటి సారి కెమెరా వెనక ఉండి ఈ సినిమాకు వర్క్ చేశాను. తెర వెనుక టెక్నీషియన్స్ కష్టం ఎంత ఉంటుందో ఈ చిత్రం నిర్మించడం ద్వారా నాకు అర్థమైంది.
నా కెరీర్‌కు ఇది స్పెషల్ మూవీ’’ అని చార్మి అన్నారు. ఏడేళ్ల క్రితం పూరితో సినిమా చేద్దామనుకున్నాననీ, చివరికి ఈ చిత్రంతో నెరవేరిందని, ఈ నెల 12న చిత్రాన్ని విడుదల చేస్తామని సి. కల్యాణ్ చెప్పారు. ‘‘పూరీ అన్నయ్యతో నాకిది ఇరవైమూడవ సినిమా. అన్ని పాటలు చాలా బాగా వచ్చాయి. సునీల్ కశ్యప్ భవిష్యత్తులో చాలా మంచి మ్యూజిక్ డెరైక్టర్ అవుతాడు’’ అని గేయ రచయిత భాస్కరభట్ల చెప్పారు. ఈ కార్యక్రమంలో సహ నిర్మాత బీఏ రాజు, నటులు ఉత్తేజ్, సంపూర్ణేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.