
ఆ ఇద్దరికీ నేనే కథ రాయాలి.. రాజమౌళి తీయాలి!
‘ఇప్పటివరకూ నేను థ్రిల్లర్ కథ రాయలేదు. సరదాగా రాయాలనిపించి, ‘శ్రీవల్లీ’ రాశా. ఈ సినిమా చూసి, పరుచూరి గోపాలకృష్ణ ‘చాలా ట్విస్టులున్నాయి. ఒక్కదాన్నీ ముందే ఊహించ లేకపోయా. బాగుంది’ అన్నారు. ఆయన ప్రసంశ నాకు అవార్డులాంటిది’’ అన్నారు విజయేంద్రప్రసాద్. రజత్, నేహా హింగే జంటగా ఆయన దర్శకత్వంలో సునీత, రాజ్‌కుమార్ బృందావనం నిర్మించిన ‘శ్రీవల్లీ’ ఈ శుక్రవారం రిలీజవుతోంది. విజయేంద్ర ప్రసాద్ చెప్పిన విశేషాలు.
నాకు రమేశ్ అనే బెస్ట్ ఫ్రెండ్ ఉండేవాడు. 2000 సంవత్సరంలో నేను హైదరాబాద్ వచ్చాక మా ఫ్రెండ్‌షిప్ కట్ అయింది. ఓ వినాయక చవితి నాడు రమేశ్‌ని తలచుకున్నా. విజయవాడలో ఉన్నాడని తెలిసి వెళ్లా. తను చనిపోయాడని తెలిసింది. రమేశ్ కూడా నిన్ను చూడాలనుందంటూ వినాయక చవితిరోజే అనుకున్నాడని, డైరీలోనూ రాశాడని వాళ్ల అమ్మ నాకు చూపించారు. ఒకేరోజు మేం ఒకరిని ఒకరం తలచుకోవడం విచిత్రంగా అనిపించింది. అప్పుడు పుట్టిన కథ ‘శ్రీవల్లీ’. రాజమౌళి, క్రిష్, సుకుమార్, కోన వెంకట్‌లకు వినిపిస్తే, తర్వాత ఏం జరుగుతుంది? అని ఊహించలేకపోయారు. ∙‘మహాభారతం’ తీయాలన్నది రాజమౌళి లక్ష్యం. కనీసం ఐదారు పార్టులైతేనే న్యాయం జరుగుతుంది. ఆ సినిమా ఎప్పుడు తీస్తాడా? అని ఎదురు చూస్తున్నా.
∙చిరంజీవి, రామ్‌చరణ్ కలసి చేసే సినిమా కథ రాసే ఛాన్స్ నాకు రావాలి. ఆ సినిమాని రాజమౌళి తీయాలి. ‘శ్రీవల్లీ’ ప్రీ–రిలీజ్ ఫంక్షన్‌లో చరణ్ బాగా మాట్లాడాడు. అందుకు తనకి థ్యాంక్స్. ∙మనకంటే తెలివైనోళ్లమని తమిళవాళ్ల ఫీలింగ్. ‘బాహుబలి’ తర్వాత ‘టాలీవుడ్‌లోనూ మంచి తెలివైనోళ్లు ఉన్నారు’ అంటున్నారు. తమిళంలో తొలిసారి ‘మెర్సల్’ అనే సినిమాకి స్టోరీ ఇచ్చా. ∙‘మణికర్ణిక’ కథ రాయమన్నప్పుడే నిర్మాతలకు క్రిష్ అయితేనే న్యాయం చేయగలడని చెప్పా. తెలుగులో ఒకటి, హిందీలో ఓ సినిమాకి డైరెక్షన్ చేయబోతున్నా.