పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలనేది నా కోరిక
‘‘తెలుగు ప్రేక్షకుల ఆలోచనా దృక్పథం మారింది. మంచి కథాంశాలతో వస్తున్న చిన్న చిత్రాలను ఆదరిస్తున్నారు. భారీ చిత్రాల్లో కథ లేకుంటే తిరస్కరిస్తున్నారు. ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని చిత్రాలు చేయాలి’’ అని ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. ఆయన సమర్పణలో జి.శ్రీనినాసరావు నిర్మించిన చిత్రం ‘రోజులు మారాయి’. మురళీకృష్ణ ముడిదాని దర్శకుడు. చేతన్, కృతిక, పార్వతీశం, తేజస్వి ప్రధాన పాత్రధారులు.
మారుతి కథ, కథనం అందించిన ఈ చిత్రం జూలై 1న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ - ‘‘సోషల్ మీడియా వలన నలుగురి జీవితాల్లో ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయనేది చిత్ర కథాంశం. అమ్మాయిల కోణంలో ఉంటుందీ చిత్రం. అలాగని వాళ్లను తప్పుగా చూపించడం లేదు. సమాజంలో ప్రస్తుత పరిస్థితులను చూపిస్తున్నాం.
పరిమిత నిర్మాణ వ్యయంలో మారుతి మంచి చిత్రాలు చేస్తున్నారు. ఈ కథ నాకు బాగా నచ్చడంతో నా సమర్పణలో నిర్మించాం. ‘భలే భలే మగాడివోయ్’ తర్వాత మారుతి స్థాయి పెరిగింది. ఇలాంటి చిత్రాలకు దర్శకత్వం వహించేంత ఖాళీ అతనికి లేదు. దాంతో ఇతరులకు అవకాశం ఇస్తున్నాడు. మారుతి కథకు మురళి వంద శాతం న్యాయం చేశాడు.
పవన్ కళ్యాణ్‌తో ఓ సినిమా చేయాలనేది నా కోరిక. నా ప్రయత్నాలు చేస్తున్నాను. నా కోరిక తీరుతుందో? లేదో? త్రివిక్రమ్ సినిమా స్క్రిప్ట్ దశలో ఉంది. కథకు తగిన హీరోని ఆయనే ఎంపిక చేసుకుంటారు. నాని హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో నిర్మించాలనుకుంటున్న సినిమా చిత్రీకరణ ఆగస్టులో ప్రారంభిస్తాం. డిసెంబర్‌లో విడుదల చేయాలనుకుంటున్నాం. శర్వానంద్ ‘శతమానం భవతి’ సంక్రాంతికి విడుదలవుతుంది’’ అని చెప్పారు.