
నేను చాలా ప్రాక్టికల్: హీరోయిన్
ముంబై: తొలిచూపులోనే ప్రేమలో పడడంపై తనకు నమ్మకం లేదని బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ తెలిపింది. తాను గుడ్డిగా ప్రేమలో పడనని పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. 'నేను చాలా ప్రాక్టికల్ మనిషిని. తొలిచూపులోనే గుడ్డిగా ప్రేమలో పడను. మొదటి చూపులోనే ప్రేమ కలుగుతుందో నాకు అర్థం కాదు. ఎవరైనా అబ్బాయిలు నన్ను ప్రేమిస్తున్నామని చెబితే వారిని స్నేహితులుగానే భావిస్తాన'ని అనుష్క పేర్కొంది.
ఆమె నటించిన 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమాలో అక్టోబర్ 28న విడుదలకానుంది. ప్రేమలో విఫలమైన యువతిగా ఈ సినిమాలో కనిపించనుంది. నిజజీవితంలో ఎప్పుడైనా ప్రేమలో విఫలమయ్యారా అని ప్రశ్నించగా... 'నేను చాలా ప్రాక్టికల్. ఎప్పుడూ ప్రేమలో విఫలం కాలేదు. నేను అంత తొందరగా ప్రేమలో పడను. నేను కాలేజీ చదివే రోజుల్లో నా ఫ్రెండ్స్ చాలా మంది లవ్ లో పడ్డారు. నా వ్యక్తిగత జీవితం గురించి చెప్పడానికి నేను ఇష్టపడను. అలాగే ఇతరుల వ్యక్తిగ విషయాల్లో జోక్యం చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఆరోగ్యం బాగా చూసుకోవాలని మా అమ్మానాన్న, సోదరుడికి మాత్రం సలహాయిస్తాన'ని అనుష్క శర్మ స్పష్టం చేసింది.