అంతా నా స్వయంకృషే : పరిణీతి చోప్రా
అంతా నా స్వయంకృషే : పరిణీతి చోప్రా
Published Sun, Aug 25 2013 10:58 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
వరుసకు సోదరి అయిన ప్రియాంక చోప్రావల్లే తనకు సినిమా అవకాశాలు వస్తున్నాయనే విషయాన్ని కొట్టిపారేస్తోంది నటి పరిణీతి చోప్రా. తన స్వయంకృషి వల్లే గుర్తింపు తెచ్చుకుంటున్నానని చెబుతోంది. సినిమాల ఎంపిక విషయంలో కూడా తానే నిర్ణయం తీసుకుంటానని, అందులో మరొకరి ప్రమేయాన్ని తాను ఇష్టపడడనంటోంది. యశ్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థలో పబ్లిక్ రిలేషన్ కన్సల్టెంట్‌గా చేరిన తనకు సంస్థ నిర్వాహకుల నుంచే మొదటగా ఆఫర్ వచ్చిందని, అలా తాను సినిమాల్లోకి నటిగా అడుగు పెట్టానంది.
ఆ సంస్థతో మూడు చిత్రాలకు సంతకం చేసిన తనకు ప్రతిభ ఆధారంగానే అవార్డులు వచ్చాయని, వాటివల్లే గుర్తింపు దక్కిందని, అంతేతప్ప ఇందులో మరొకరి ప్రమేయం లేదని పేర్కొంది. నటనకు సంబంధించి ప్రియాంక నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటానని, అవకాశాలు మాత్రం తన స్వయంకృషి వల్లే వస్తున్నాయని పునరుద్ఘాటించింది. దర్శకులు రాసుకున్న కథలకు తాను సరిపోతానని భావిస్తే వారే తన దగ్గరకు వస్తారని, నచ్చితే అంగీకరిస్తానని, ఇప్పటిదాకా జరిగింది ఇదేనంది. అంతేగానీ తానెవరి సిఫారసుతో దర్శకులను కలవలేదని, అలా ఏ అవకాశాన్ని కూడా పొందలేదని చెప్పింది.
పియాంక పరిశ్రమలో నిలదొక్కుకోవడం కొంతమేర తనకు ప్రయోజనకరమైనప్పటికీ అవకాశాలన్నీ ఆమె వల్లే వస్తున్నాయని ఆరోపించడం సరికాదని, ఇకనైనా ఇలాంటి వార్తలు రాయడం మానుకోవాలని మీడియాను కోరింది. సినిమాలతో పరిచయం ఉన్న కుటుంబం కాకపోవడంతో అనుభవం ఉన్న ప్రియాంక నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నానని, ఇకముందు కూడా తీసుకుంటానని తెలిపింది. అదిత్య చోప్రా, మనీశ్ శర్మ కూడా ప్రియాంకలాగే తనకు సలహాలు, సూచనలు ఇస్తుంటారని, ఏ విషయంలోనైనా అనుమానాలుంటే వారిని అడిగి నివృత్తి చేసుకుంటానంది.
Advertisement
Advertisement