అనుబంధాలతోనే సార్థకత
సహనటులతో ప్రేమలో పడిందంటూ చాలాసార్లు వార్తలు వచ్చినా దీపికా పదుకొణే బహిరంగంగా ఎప్పుడూ వాటిపై పెదవి విప్పలేదు. ప్రేమ సంబంధాలపై తన అభిప్రాయాన్ని మాత్రం వివరించింది. ఎవరితోనైనా అనుబంధం పెంచుకున్నప్పుడే జీవితానికి సార్థకత ఉంటుందని, మనసు చెప్పినట్టే నడుచుకోవడం తన పద్ధతని తెలిపింది. ‘సినిమాలు ఎంచుకునేటప్పుడు కూడా ఇదే పద్ధతి పాటిస్తాను. మన సుకు నచ్చిన ప్రాజెక్టుపైనే సంతకం చేస్తాను. విజయానికి ఇది ఉత్తమ మార్గం అని నేను అనుకుంటాను. మనం ఎలా ఉండాలనుకుంటామో అలాగే ఉండాలి. ఇతరులకు అనుగుణంగా మనల్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఇతరుల కోసం బతికేవాళ్లలో నిజాయితీ ఉంటుందని అనుకోను. స్క్రిప్టుల ఎంపిక కోసం ప్రత్యేక విధానమంటూ నాకు లేదు. ఇక ఎవరితోనైనా అనుబంధం పెంచుకోవడం చాలా ముఖ్యం. నాలాగే ఇతర మహిళలూ ఆలోచిస్తారని అనిపిస్తుంది. అయితే ఆ అనుబంధం మనోహరంగా ఉండాలి. ప్రేమలో పడ్డ ఇద్దరికీ మేలు చేసేలా ఉండాలి. బాధపెట్టేలా ఉండకూడదు.
నేను ఈ రెండు రకాల అనుభవాలను ఎదుర్కొన్నాను’ అని వివరించింది. నగరంలో శుక్రవారం జరిగిన ఇండియాటుడే కాన్‌క్లేవ్‌లో మాట్లాడుతూ దీపికా పదుకొణే ఈ విషయాలన్నింటినీ వివరించింది. రామ్‌లీలా కథానాయకుడు రణ్‌వీర్‌సింగ్‌తో ప్రేమాయణం గురించి ప్రస్తావించినప్పుడు స్పందిస్తూ ఇప్పుడు అలాంటి విషయాల జోలికి వెళ్లదల్చుకోలేదని చెప్పింది. ఏ వ్యక్తి గురించి అయినా పూర్తిగా తెలుసుకున్నాకే అతనితో అనుబంధం పెంచుకోవాలన్న విషయాన్ని అనుభవాలతో గ్రహించానని తెలిపింది. లేకుంటే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పింది. రణ్‌బీర్ కపూర్‌ను గాఢంగా ప్రేమించిన ఈ కన్నడ బ్యూటీ ఏడాది తరువాత అతనికి గుడ్‌బై చెప్పింది. సహనటులతో సంబంధాలు బెడిసికొట్టినా కెరీర్‌కు మాత్రం ఇబ్బందులు రాలేదు. కాక్‌టెయిల్, రేస్ 2, యే జవానీ హై దివానీ, చెన్నయ్ ఎక్స్‌ప్రెస్, రామ్‌లీల వంటి హిట్ సినిమాలు దీపిక ఖాతాలో ఉన్నాయి. ఈ ఏడాది కూడా దీపిక నటించిన పలు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.