ఆస్కార్‌తో తన సత్తా చాటిన సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ తన జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులను, కెరీర్‌లో ఎదురైన అనుభవాలను పీటీఐ వార్త సంస్థతో పంచుకున్నారు. ‘నా 25వ ఏట వరకు ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచించేవాడిని. నా తండ్రిని కొల్పోయిన తర్వాత ఎదురైన పరిణామాలు నన్ను ఆ దిశగా ఆలోచించేలా చేశాయి. కానీ నా ప్రయాణం నాకు చాలా నేర్పింది. చావు అనేది అనివార్యమైంది. ప్రతి దానికి ఓ అంతం ఉంటుంది.. కాబట్టి దేనికైనా భయపడటం ఎందుకు?. నా తండ్రి మరణించిన సమయంలో నేను ఎక్కువగా సినిమాలు చేయలేదు. ఆ సమయంలో నాకు 35 సినిమా అవకాశాలు రాగా.. నేను రెండు మాత్రమే చేశాను. నేను ఎలా రాణిస్తానని చాలా మంది ఆశ్చర్యపోయార’ని రెహమాన్ తెలిపారు.
నా అసలు పేరు నాకు ఇష్టం లేదు
‘నేను 12 నుంచి 22 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడే జీవితంలో అన్ని కోణాలను చూశాను. నాకు అన్ని నార్మల్‌గా అనిపించడంతో.. వాటిని చేయాలని అనిపించేది కాదు. నా అసలు పేరు దిలీప్ కుమార్ అంటే నాకు ఇష్టం లేదు. నేను దానిని ఎందుకు ద్వేషిస్తానో అర్థం అయ్యేది కాదు. నాకు ఆ పేరు సరిపోదేమోనని అనిపించేది. నేను గతాన్ని పూర్తిగా చెరిపేయాలని అనుకున్నాన’ని రెహమాన్ వెల్లడించారు. కాగా, సంగీత దర్శకుడిగా తన తొలి చిత్రం రోజా విడుదలకు ముందు రెహమాన్ తన కుటుంబంతో కలిసి ఇస్లాంను స్వీకరించిన సంగతి తెలిసిందే.
కృష్ణ త్రిలోక్ రచించిన రెహమాన్ బయోగ్రఫీ ‘నోట్ ఆఫ్ ఏ డ్రీమ్: ది ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏఆర్ రెహమాన్’ పుస్తకాన్ని ఆయన శనివారం రోజున ముంబైలో అవిష్కరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్, శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 2.ఓ సినిమాకు రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment