
నా వద్ద ఆధారాలున్నాయి
తమిళసినిమా, న్యూస్‌లైన్ : దర్శకుడు రవికుమార్‌కు తనకునిశ్చితార్థం మాత్రమే జరిగిందని, పెళ్లి జరగలేదని నటి సుజిబాల వడపళని పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అందులో రవికుమార్ తనను వేధిస్తున్నట్లు ఆమె ఆరోపణలు చేశారు. దీనికి స్పందించిన దర్శకుడు రవికుమార్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సుజిబాల తన భార్యనేనన్నారు. తమకు పెళ్లి కూడా జరిగిందని తెలిపారు. అందుకు ఆధారాలు ఉన్నాయని చెప్పారు. సుజిబాల తనపై పోలీసులకు ఫిర్యాదు చేయడం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు.
ఆమె పత్రికల వారికి చెప్పినవన్ని అబద్ధాలేనన్నారు. ఆమెపై తాను హత్యా బెదిరింపులకు పాల్పడుతున్నాననడం నిజం కాదన్నారు. వాస్తవానికి సుజిబాల తల్లినే చంపిస్తానని ఫోన్లో బెదిరించిందని తెలిపారు. తాను దర్శక, నిర్మాతగా రూపొందిస్తున్న చిత్రంలో హీరోయిన్ సుజిబాలనేనని ఆమె షూటింగ్‌కు రాకపోవడంతోనే చిత్రం ఆగిపోయిందని ఆరోపించారు. అదే విధంగా సుజిబాలకు తాను కారు, బంగ్లా, మామిడి తోట కొనివ్వడం అబద్దం అని అంటున్నారని వీటన్నింటికీ తన వద్ద ఆధారాలున్నాయని వాటిని పోలీసులకు అందచేస్తానని దర్శకుడు రవికుమార్ తెలిపారు.