నా డిక్షనరీలో కష్టమనే పదం లేదు:మాధురీ దీక్షిత్
న్యూఢిల్లీ: తన కెరీర్ లో కష్టసాధ్యమైన అనే పదం లేనే లేదని బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ అన్నారు. ఏదైనా సమస్య ఎదురైతే జయించేందుకే ఇష్టపడతానని ఆమె తెలిపారు. రాబోయే సినిమా గులాబ్ గ్యాంగ్‌లో సొంతంగా మాధురీ స్టంట్‌లు చేశారు. కొత్తవ్యక్తి సౌమిక్ సేన్ దర్శకత్వం వహించిన గులాబ్ గ్యాంగ్ సినిమా ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖాండ్‌లోని సామాజిక అన్యాయానికి వ్యతిరేకంగా గులాబీ రంగు చీరల్లో ఇండియన్ ఉమెన్ విజిలెంట్స్ బృందం చేసిన పోరాటం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో డ్యాన్స్, నటనలో ఎలాంటి ఇబ్బంది పడలేదని మధురి దీక్షిత్ మీడియాకు తెలిపారు. ఇప్పటికే తైక్వాండోలో శిక్షణ తీసుకోవడం వల్ల యాక్షన్ చేయడం మరింత సులభమైందని చెప్పారు. ఈ సినిమాల్లో ఫైట్‌లు, నటనలు సొంతంగానే చేశానని వివరించారు.
డ్యాన్స్ చేస్తున్న సమయంలో గాయపడిన ఘటనలు ఉన్నా పట్టించుకోలేదన్నారు. తన డిక్షనరీలో కష్టసాధ్యమైన అనే పదం లేదన్న మధురి సమస్యను గెలిచేందుకు ఇష్టపడతానని వ్యాఖ్యానించారు. బాక్సాఫీస్ వద్ద గులాబ్ గ్యాంగ్ సినిమా మంచి వ్యాపారం చేస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సినిమాతో తొలిసారిగా జుహి చావ్లా, మధురి స్క్రీన్‌పై కనపడనున్నారు. గతంలో వీరిద్దరి కలిసి నటించేందుకు అవకాశాలు వచ్చినా ఆ సమయంలో జుహీ తిరస్కరించారు. ‘ఈ సినిమాలో మధురితో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. గతంలో కలిసి పనిచేయనందుకు పశ్చాత్తం లేదు. మళ్లీ ఒకసారి ఆమెతో కలిసి పనిచేస్తానని భావిస్తున్నా. సినిమాలో ఇద్దరు కలిసి వేర్వేరు పాత్రలు పోషిస్తున్నప్పుడు ఒకరితో మరొకరిని పొల్చుకోలేమ’ని జుహీ చావ్లా అన్నారు.