‘ప్రభాస్ కంటే ఆమెకు ఎక్కువ పేరు వచ్చేది’
హైదరాబాద్: హీరోయిన్ శ్రీదేవి ‘బాహుబలి 2’ అవకాశం వదులుకోవడం పట్ల దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఈ సినిమాలో నటించివుంటే ప్రభాస్ కంటే ఆమెకు ఎక్కువ పేరు వచ్చేదని అభిప్రాయపడ్డాడు.
‘బాహుబలి 2లో శ్రీదేవి నటించకపోడం నాకు నిజంగా ఆశ్చర్యం కలిగించింది. ఆమె కెరీర్‌లో అత్యద్భుతమైన ఈ చిత్రం కూడా చేరివుంటే బాగుండేది. బాహుబలి 2 సినిమాలో శ్రీదేవి బోనికపూర్ నటించివుంటే ప్రభాస్ కంటే ఎక్కువ క్రెడిట్ ఆమెకు దక్కేది. ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమా తర్వాత ఆమె నటించిన చిత్రం ఇదే అయ్యేద’ని రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. బాహుబలి సినిమాలో నటించే అవకాశాన్ని శ్రీదేవి వదులుకున్నట్టు అంతకుముందు వార్తలు వచ్చాయి. రమ్యకృష్ణ చేసిన శివగామి పాత్ర కోసం ముందుగా శ్రీదేవి సంప్రదించారని, రెమ్యునరేషన్ ఎక్కువ అడగడంతో నిర్మాతలు వెనక్కు తగ్గినట్టు గుసగుసలు వినిపించాయి.
బాహుబలి సిరీస్ రికార్డు విజయంతో దీనికి సంబంధించిన ప్రతి విషయం ప్రేక్షకులకు ఆసక్తి గొల్పుతోంది. ఇప్పటికే రూ. 1000 కోట్ల వసూళ్లు సాధించిన ‘బాహుబలి 2’ రూ.1500 కోట్ల మైలురాయిని అందుకునే దిశగా దూసుకెళ్తోంది.