'నా సినిమాను బాహుబలి 2 మింగేసింది'
ముంబయి: తన సినిమా బిజినెస్‌ను బాహుబలి 2 మింగేసిందని ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా అన్నారు. తన చిత్రం మేరి ప్యారీ బిందు బాక్సాపీస్ వద్ద రాబట్టిన వసూళ్లు చిత్రంపై ప్రేక్షకులు ప్రతిస్పందనవంటి విషయాలను ఆయన వద్ద ప్రస్తావించగా ఆయన పై విధంగా స్పందించారు.
'నా చిత్రానికి నా కుటుంబం నుంచి మిత్రుల నుంచి ప్రేక్షకుల నుంచి భిన్న స్పందన వచ్చింది. కొంతమంది నచ్చిందని చెప్పారు. కొంతమంది నచ్చలేదని చెప్పారు. ఏదేమైనా వ్యాపారపరంగా నా సినిమాపై బాహుబలి 2 ప్రభావం కొద్దిగా పడిందనే చెప్పగలను. నా సినిమా విడుదలయ్యే సమయానికి థియేటర్లలో బాహుబలి 2 లేకుంటే కచ్చితంగా నా సినిమా మరిన్ని వసూళ్లు రాబట్టేది. నా చిత్ర బిజినెస్‌ను బాహుబలి 2 మింగేసింది' అని ఆయన తెలిపారు. బాహుబలి 2 ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 28న విడుదల కాగా మేరి ప్యారీ బిందు మాత్రం మే నెలలో విడుదలైంది.