నాన్నగారికి నేను బోర్ కొట్టేశానేమో!
‘‘తండ్రీ కొడుకులతో కలిసి నటించే అదృష్టం అందరికీ దక్కదు. ఆ ఆనందాన్ని దక్కేలా చేసిన మా నాన్నగారికి కృతజ్ఞతలు’’ అంటున్నారు నాగార్జున. డా. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన సినిమా ‘మనం’. విక్రమ్‌కుమార్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది. ఈ సినిమా విడుదల కోసం ప్రేక్షకులు, అక్కినేని కుటుంబ అభిమానులతో పాటు నాగార్జున కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జున పలు విశేషాలు చెప్పారు. ‘‘నాన్నగారితో కలిసి సినిమా చేయడంవల్ల ఇంకా ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి కుదిరింది. గతంలో నాన్నగారి కాంబినేషన్‌లో నేను చేసినప్పుడు ఆయన దృష్టంతా నా మీదే ఉండేది. కానీ, ఈ సినిమాకి మాత్రం నాన్నగారి దృష్టి మొత్తం చైతూ మీదే.
బహుశా నేను బోర్ కొట్టి ఉంటానేమో’’ అని సరదాగా అన్నారు నాగ్. ‘మనం’ షూటింగ్ లొకేషన్లో తన తండ్రి, తనయుడు ఒకరి మీద ఒకరు జోక్‌లేసుకుంటూ సరదాగా ఉండేవాళ్లని, ఈ సినిమా మొత్తం తనకో తీపి గుర్తులాంటిదని నాగ్ అన్నారు. ముఖ్యంగా తమ ముగ్గురి కాంబినేషన్‌లో షూటింగ్ చేసిన ఆ నాలుగైదు రోజులను ఎప్పటికీ మర్చిపోలేనని, అవి చాలా ప్రత్యేకం అని నాగార్జున పేర్కొన్నారు. 1920 నుంచి 2013 వరకు సాగే కథతో ఈ సినిమా ఉంటుందని, అంతకు మించి ఈ సినిమా కథకు సంబంధించిన విశేషాలేమీ బయటపెట్టలేనని కూడా ఆయన అన్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ నటించిన విషయం గురించి చెబుతూ -‘‘మా నాన్నగారికి అమితాబ్ బచ్చన్ అంటే చాలా ఇష్టం. ‘రేయ్.. ఎంత బాగా చేశాడురా... చక్కగా ఉంది కదరా...’ అని అమితాబ్ నటన గురించి అనేవారు. అమితాబ్ నటించిన సినిమాలను దాదాపు వదలకుండా చూసేవారు. అందుకే, ఆయన చివరి చిత్రంలో అమితాబ్ నటిస్తే బాగుంటుందనుకున్నా. బిగ్ బి నటించడంతో ఈ సినిమా మరింత ప్రత్యేకం అయ్యింది’’ అని నాగార్జున అన్నారు.