కమల్ దివాళాకు నేను కారణం కాదు!
‘‘భర్త నుంచి విడాకులు పొందాక దక్కే మనోవర్తి వల్ల ఒక మహిళ జీవితాంతం సకల సౌకర్యాలతో ఉండగలుగుతుందా? అలాగే, మనోవర్తి ఇవ్వడం వల్ల ఆ మగవాడు దివాళా తీసేస్తాడా? దివాళా తీసినా ఫరవాలేదు. ఆ మహిళ సౌకర్యవంతంగా స్థిరపడితే చాలనే విధంగా కోర్టు తీర్పునిస్తుందా? ఆశ్చర్యంగా ఉంది’’ అని వాణీగణపతి అంటున్నారు. స్వతహాగా గొప్ప శాస్త్రీయ నృత్య కళాకారిణి అయిన ఆమె కమల్‌హాసన్ మాజీ భార్య అనే విషయం తెలిసిందే. వారిద్దరూ విడిపోయి పాతికేళ్లకు పైనే అయ్యింది.
విడాకుల కారణంగా తాను దివాళా తీసినట్లు ఇటీవల ఓ సందర్భంలో కమల్ పేర్కొనడం చర్చనీయాంశమైంది. ఈ చర్చలు వాణీ గణపతి వరకూ వెళ్లాయి. ‘‘నాకు విడాకులిచ్చాక అద్దె ఇంటికి మారాల్సి వచ్చిందని ఆయన పేర్కొనడం విచిత్రంగా ఉంది. అసలు అప్పట్లో కమల్‌కి సొంత ఇల్లు ఉన్నదెప్పుడు? మేము కూడా అద్దె ఇంట్లోనే ఉండేవాళ్లం’’ అని కమల్‌కి గట్టిగానే జవాబిచ్చారామె. ఒకవేళ కూతుళ్ళ దగ్గర జాలి కబుర్లు చెప్పి, అభిమానం కొట్టేయడానికే ఆయన అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారేమోనని కూడా వాణి పేర్కొన్నారు.
ఏదైనా జరగకూడనిది జరిగితే ఆ తప్పును ఇతరులపై సులువుగా మోపేయడం ఆయనకు అలవాటనీ, దివాళా తీయడానికి విడాకులు కాకుండా వేరే కారణాలు ఉండి ఉంటాయనీ ఆమె ఘాటుగా స్పందించారు. ఒకవేళ నాకు భారీ ఎత్తున మనోవర్తి దక్కి ఉంటే, ఈపాటికి బెంగళూరులో మంచి లగ్జరీ ఏరియాలో విలాసవంతమైన ఇంట్లో ఉండి ఉండేదాన్ననీ, ఇప్పుడు ఉంటున్న ఇల్లు తన సొంత డబ్బుతో కొనుక్కున్నాననీ వాణి స్పష్టం చేశారు.