అమ్మాయిలందరూ నన్ను ద్వేషిస్తారని భావించా..
మర్దానీ ఫేం తాహిర్ రాజ్ బాసిన్
న్యూఢిల్లీ: ‘నేను అనుకున్నంతా అయ్యింది.. ‘మర్దానీ’ సినిమా చేసినప్పుడు నా పాత్రను చూసి అమ్మాయిలందరూ నన్ను ద్వేషిస్తారని భావించా.. సినిమా విడుదలయ్యాక నేను ఊహించినట్లే జరిగింది..’ అని మర్దానీ సినిమా ద్వారా సినిమా పరిశ్రమలోకి ఆరంగేట్రం చేసిన ఢిల్లీ వాసి తాహిర్ రాజ్ బాసిన్ తెలిపాడు. యష్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ సినిమాలో రాణి ముఖర్జీ టైటిల్ పాత్ర పోషించింది. ఇందులో ఆమె పవర్‌ఫుల్ పోలీస్ అధికారిణిగా నటించగా అమ్మాయిల అక్రమ రవాణా వ్యాపారం చేసే దుర్మార్గమైన వ్యక్తిగా 27 యేళ్ల తాహిర్ నటించాడు. ఈ సినిమా బాక్సాఫిస్ వద్ద మంచి టాక్ సంపాదించింది.
దీనిపై తాహిర్ ఆనందం వ్యక్తం చేస్తూ.. ‘ ఈ సినిమా చేసేటప్పుడు నా పాత్ర స్వభావం చూసి అమ్మాయిలు నన్ను అసహ్యించుకుంటారని భావించా.. అయితే అమ్మాయిలు అందులో నా స్టైల్‌ను మాత్రం ఇష్టపడ్డారు..’ అని అన్నాడు. ఈ సినిమాలో చాలా బాగున్నానని సూపర్‌స్టార్ షారూఖ్ ఖాన్ ట్విటర్‌లో ట్వీట్ చేయడం నాకు అవార్డు వచ్చినంత ఆనందం ఇచ్చిందని చెప్పాడు. ఈ సినిమాలో నటించేందుకు మొదట చాలా ఇబ్బంది పడ్డానని ఆయన అన్నాడు. ప్రధాన పాత్రలో సీనియర్ నటి రాణీ ముఖర్జీ నటిస్తుండటంతో ఆమెతో స్క్రీన్‌ను పంచుకోవడానికి కొంచెం తడబడ్డానని తెలిపాడు. ఆమె సినిమాలు చూస్తూ పెరిగిన తనకు ఆమెతోనే నటించడమనేసరికి ఒకరకమైన ఒణుకు వచ్చిందని నవ్వుతూ చెప్పాడు. అయితే రాణి మాత్రం తనకు అన్నివిధాల మద్దతు ఇచ్చిందని, తనను కొత్త నటుడుడి చూడలేదని దాంతో త్వరలోనే మామూలుగానే నటించగలిగానని తాహిర్ అన్నాడు.
ఇదిలా ఉండగా, ఈ చిత్రంలో పాత్ర సంపాదించడానికి తాను చాలా కష్టపడాల్సి వచ్చిందని తాహిర్ వివరించాడు. నాలుగేళ్లుగా తాను ముంబైలో ఉంటూ సినిమా ఆఫర్ల కోసం ప్రయత్నిస్తున్నానని, అందులో భాగంగా రెండేళ్ల కిందట యశ్‌రాజ్ ఫిల్మ్స్ కాస్టింగ్ డెరైక్టర్ షనూ శర్మను కలిసి తన ఫొటోలు చూపించానన్నాడు. కట్ చేస్తే.. కొన్ని రోజుల తర్వాత ఈ సినిమాలో అవకాశం కోసం స్క్రీన్ టెస్ట్‌కు రావాలని ఆమెనుంచి ఆహ్వానం అందిందని చెప్పాడు. తీరా అక్కడికి వెళ్లేసరికి అప్పటికే సుమారు 200 మందికిపైగా లైన్‌లో ఉన్నారని వివరించాడు.. చివరికి ఆ పాత్ర తనను వరించడం ఆనందంగా ఉందన్నాడు.
బాలీవుడ్‌లో విలన్ పాత్రతో కెరీర్‌ను ప్రారంభించడంపై ఆయన మాట్లాడుతూ.. దానిపై తనకు ఎటువంటి బాధ లేదన్నాడు. ప్రస్తుతం పరిశ్రమలో ఉన్న విలన్ పాత్రధారులెవరూ నేను చేసిన పాత్రను చేసేందుకు ఇష్టపడకపోవచ్చు. అంత నీచమైన నేరప్రవృత్తిగల ఒక శాడిస్టు పాత్ర కాబట్టే నటించడానికి చాలా అవకాశం లభించింది. మున్ముందు కూడా ఇలాంటి పాత్రలొస్తే చాలెంజ్‌గా తీసుకుని నటిస్తాను..’ అని ముక్తాయించాడు.