Mardaani
-
శివానీ శివాజీ రాయ్ నాకు చాలా ప్రత్యేకం
బాలీవుడ్ హీరోయిన్ రాణీ ముఖర్జీ ప్రధానపాత్రలో నటించనున్న ‘మర్దానీ 3’ సినిమా ప్రకటన వచ్చింది. ప్రదీప్ సర్కార్ దర్శకత్వంలో రాణీ ముఖర్జీ లీడ్ రోల్ చేసిన ‘మర్దానీ’ చిత్రం 2014 ఆగస్టు 22 విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ సినిమాకి సీక్వెల్‌గా గోపీ పుత్రన్ డైరెక్షన్లో రూపొందిన ‘మర్దానీ 2’ సినిమా 2019 డిసెంబరు 13న రిలీజై బ్లాక్‌బస్టర్ అయింది. తొలి, ద్వితీయ భాగాల్లో సిన్సియర్ పోలీసాఫీసర్ శివానీ శివాజీ రాయ్పాత్రలో రాణీ ముఖర్జీ నటనకు ప్రశంసలు దక్కాయి.ఇక ‘మర్దానీ 2’ ఐదవ వార్షికోత్సవం సందర్భంగా ‘మర్దానీ 3’కి సంబంధించిన మేకింగ్ వీడియోను యశ్ రాజ్ ఫిల్మ్స్ విడుదల చేసింది. ఈ చిత్రానికి అభిరాజ్ మినవాలా దర్శకత్వం వహించనున్నారు. ఈ సందర్భంగా రాణీ ముఖర్జీ మాట్లాడుతూ– ‘‘2025 ఏప్రిల్‌లో ‘మర్దానీ 3’ చిత్రం షూటింగ్‌ను ప్రారంభించబోతున్నామని తెలియజేయటానికి ఎంతో సంతోషంగా ఉంది.పోలీస్ డ్రెస్ వేసుకుని అద్భుతమైనపాత్ర (శివానీ శివాజీ రాయ్) ను చేయటం నాకెప్పుడూ ప్రత్యేకమే. ఈపాత్ర చేయటం ద్వారా ప్రేక్షకుల నుంచి నాకు అపరిమితమైన ప్రేమాభిమానాలు లభించాయి. ‘మర్దానీ 3’లోనూ పవర్‌ఫుల్‌పోలీస్ ఆఫీసర్‌గా నటించనుండటం ఎంతో గర్వంగా ఉంది. మనల్ని కంటికి రెప్పలా కాపాడుతూ, విధి నిర్వహణలో ప్రాణ త్యాగానికి సైతం వెనుకాడని ధైర్యవంతులైనపోలీస్ ఆఫీసర్స్కి ఈ సినిమా అంకితం. తొలి, మలి భాగాలను మించేలా ‘మర్దానీ 3’లో గొప్ప సన్నివేశాలున్నాయి’’ అని తెలిపారు. కాగా ‘రైల్వే మెన్’ మూవీ ఫేమ్ ఆయుష్ గు΄్తా ‘మర్దానీ 3’కి స్క్రిప్ట్‌ను అందించారు. -
‘రాచకొండ మహిళా పోలీసులకు మర్దానీ-2 ప్రదర్శన’
సాక్షి, హైదరాబాద్ : రాచకొండ పోలీస్ కమీషనరేట్ పరిధిలో విధులు నిర్వరిస్తున్న మహిళా పోలీసుల కోసం రాచకొండ సీపీ మహేష్ భగవత్ ‘మర్దానీ’ 2 చిత్రాన్ని ప్రదర్శించారు. ఉప్పల్‌లోని ఏషియన్ సినిమా థియేటర్లో ఈ సినిమాను ప్రదర్శించారు. మర్దానీ చిత్రంలో మహిళల భద్రత కోసం రాణి ముఖర్జీ ఎలా కృషి చేసిందే ప్రతీ ఒక్కరు అలాగే పనిచేయాలని సీపీ మహేష్ భగవత్ సూచించారు. 2020లో మహిళలపై ఒక్క నేరం కూడా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని, మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ నిరంతరం పనిచేస్తున్నాయని అన్నారు. శివారు ప్రాంతాల భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని సీపీ పేర్కొన్నారు. -
లెక్కకు మించి వసూళ్లు చేస్తున్న చిత్రం
నిజ జీవితంలో జరిగిన కిరాతకమైన అత్యాచారాల సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రమే ‘మర్దానీ 2’. బాలీవుడ్ హీరోయిన్ రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం తొలిరోజు అంతంతమాత్రంగానే వసూలు చేసింది. ఇది చిత్రబృందాన్నిఅయోమయానికి గురిచేసినప్పటికీ అనూహ్యంగా రెండోరోజు విపరీత వసూళ్లను సాధించింది. సాధారణంగా ఏ సినిమానైనా విడుదలైన తర్వాతి రోజుల్లో 50 నుంచి 60 శాతం వసూళ్లు పుంజుకుంటాయి. కానీ మర్దానీ 2 అందుకు భిన్నంగా రాకెట్ స్పీడులో రెండోరోజే 75 శాతం వసూళ్లు పుంజుకున్నాయి. ఈ సినిమా శుక్రవారం సుమారు రూ.4 కోట్లు అందుకోగా శనివారం ఏకంగా రూ. 6 కోట్ల పైచిలుకు సాధించింది. దీంతో ఇప్పటివరకు ఈ చిత్రం మొత్తంగా రూ.10 కోట్ల పైచిలుకు వసూళ్లు రాబట్టింది. ఇక బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ నటించిన ‘దబాంగ్ 3’ శుక్రవారం రిలీజ్ అవుతుండటంతో మర్దానీ 2 చిత్రానికి వసూళ్లు తగ్గే అవకాశం లేకపోలేదు. -
‘ఆపద తలుపు తట్టి రాదు.. పక్కనే ఉంటుంది’
ప్రపంచంలోని ఏ దేశం కూడా మహిళలకు, యువతులకు సురక్షితం కాదనేది సాధారణంగా తెలిసిన విషయమేనని బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ అన్నారు. అయితే ఆపదలను ధైర్యంగా ఎదుర్కొనేలా.. నైపుణ్యాలు పెంపొందించుకునేలా మహిళలను ప్రోత్సహించాలని పేర్కొన్నారు. రాణి ముఖర్జీ తాజాగా నటిస్తున్న చిత్రం మార్దానీ-2. ఇటీవల విడుదలైన సినిమా ఈ ట్రైలర్లో యువతులపై జరిగే భయనక లైంగిక దాడులు ఉండటంతో ఈ చిత్రం వివాదస్పదమైంది. ఈ విషయంపై స్పందించిన రాణీ ముఖర్జీ ‘మర్దానీ-2’ మహిళలకు, యువతులకు అవగాహన కల్పించేలా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. ఈ సినిమాలో కనిపించే సంఘటనలను గుడ్డిగా వ్యతిరేకించకుండా అలాంటి దాడులు నిజంగానే జరుగుతున్నాయని ప్రతి ఒక్కరు గమనించాలన్నారు. ప్రతి తల్లిదండ్రులుగా తమ కూతురు స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటారు.. అదే క్రమంలో వారికి భద్రత కూడా కల్పించాలని రాణి ముఖర్జీ పేర్కొన్నారు. ‘ప్రతి ఏటా మహిళలపై 2000లకు పైగా లైంగిక దాడులు జరుగుతున్నాయి. అందులోనూ ఎక్కువగా 18 ఏళ్ల వయసున్న యువకులే ఈ నేరాలకు పాల్పడుతున్నట్లు నేషనల్ క్రైం బ్యూరో తమ అధికారిక రికార్డులలో పేర్కొంది. వాటి ఆధారంగానే ‘మర్దానీ-2’ తెరకెక్కించాం. మేము తీసేది భారతీయ సినిమా కాబట్టి భారత్‌లో జరిగే లైంగిక దాడులనే ప్రధానంగా తీసుకుని సినిమా చేశాం’ అని రాణి చెప్పుకొచ్చారు. ‘యువతను ఉద్దేశించి వారికి అవగాహన కల్పించడమే మర్దానీ సారాంశం. ఆపద అనేది ఇంటి తలుపు తట్టి రాదు.. అది మన పక్కనే ఉంటుంది. అయితే అది గ్రహించి అమ్మాయిలు అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించడమే సినిమా ఉద్దేశం. అయితే ఇది పూర్తిగా నేరాలను అరికట్టకపోవచ్చు కానీ కొంతమేర యువతులను మాత్రం అప్రమత్తం చేయగలదని నేను నమ్ముతున్నాను’ అని అన్నారు. కాగా 2014లో వచ్చిన ‘మర్దానీ’ సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాణి ముఖర్జీ క్రైం పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నారు. సినిమాను యష్‌రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తుంది. (చదవండి: ఇది ఆమోదయోగ్యం కాదు: ఓం బిర్లా) -
ఒళ్లు గగుర్పొడిచే రేప్ సన్నివేశాలు..
దేశంలో 2000కు పైగా అత్యాచారాలు చేస్తున్నది 18 ఏళ్ల లోపు వయసున్నవారే. ఇది రికార్డుల్లో నమోదైన లెక్కలు. మరి రికార్డులకు అందనివి ఇంకెన్ని ఉంటాయి? మానవ మృగాలు ఒంటరిగా కనిపించిన మహిళలనే టార్గెట్ చేస్తూ వారిని చిత్రహింసలు పెట్టి అత్యాచారం చేసి దారుణంగా చంపేస్తున్నారు. ఇలాంటి భయానక ఘటనలతో మహిళలు అర్ధరాత్రి స్వేచ్ఛగా తిరగడం మాట అటుంచితే, కనీసం పట్టపగలు కూడా గడప దాటాలంటే జంకుతున్నారు. నిజ జీవితంలో జరిగిన కిరాతకమైన అత్యాచారాల సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రమే ‘మర్దానీ 2’. ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ గురువారం విడుదల చేసింది. 2014లో విజయాన్ని సొంతం చేసుకున్న మర్దానీకి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. పవర్ఫుల్ పోలీస్ అధికారిణిగా శివానీ శివాజీరాయ్ పాత్రలో రాణి ముఖర్జీ నటించింది. ఈ సినిమా ట్రైలర్ ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశాలతో నిండి ఉంది. ఇందులోని ప్రతీ సీన్ ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. అత్యాచారాలు చేస్తూ హత్య చేస్తున్న వ్యక్తి... మృతదేహాలకు రాణీ ముఖర్జీ మాస్క్‌లు పెట్టి ఆమెకు సవాల్ విసురుతాడు. అతన్ని పట్టుకోడానికి రాణీ ఏం చేసింది? ఆ దారుణాలను ఎలా అరికట్టింది? అనేది సినిమా విడుదలయ్యాక చూడాలి. ఇందులో రాణీ ముఖర్జీ ఒక నటిగా కాకుండా ఆడపిల్లలను వేధించేవాళ్ల భరతం పట్టే స్త్రీ శక్తిగా దర్శనమిస్తుంది. ఈ సినిమాతో రాణీముఖర్జీ స్థాయి రెట్టింపు అవుతుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేసింది. ‘మర్దానీ 2’ లో విక్రమ్ సింగ్ చౌహాన్, శ్రుతి బాప్నా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రాణీ ముఖర్జీ ఉగ్రరూపాన్ని చూసిన నెటిజన్లు ఈ యేడాదిలోనే బెస్ట్ ట్రైలర్ అని కొనియాడుతున్నారు. -
పెళ్లైతే హీరోయిన్గా పనికి రామా?
.... అంటున్నారు రాణీ ముఖర్జీ. దర్శక–నిర్మాత ఆదిత్యా చోప్రాను పెళ్లాడిన తర్వాత రాణీ సినిమాలకు దూరమైపోతారని అనుకున్నారంతా. కానీ ‘మర్దానీ’ సినిమాతో కమ్‌బ్యాక్ ఇచ్చి అందరి అంచనాలను తారుమారు చేశారు. ఇప్పుడు తన లేటెస్ట్ సినిమా ‘హిచ్కీ’తో సూపర్ హిట్ అందుకున్నారు రాణీ. ఈ సినిమా హిట్ చాలా ప్రత్యేకమైంది అంటున్నారామె. ‘‘సాధారణంగా పెళ్లైతే హీరోయిన్గా పనికి రారు అనే ఒకలాంటి అపోహ మన ఇండస్ట్రీలో ఉంది. ఈ అపోహ కచ్చితంగా తొలగిపోవాలి. పెళ్లయినవారు హీరోయిన్లుగా సేల్ అవ్వరు, ఎవ్వరూ చూడరు అనే అభిప్రాయం తప్పని ఈ సినిమా హిట్‌తో ప్రేక్షకులు నిరూపించారు. పెళ్లై పిల్లలు పుడితే మాలో ఏం మారుతుంది? మేం ఎప్పుడూ యాక్టర్స్మే కదా. అప్పుడు ఉన్నంత ప్రొఫెషనల్‌గానే ఇప్పుడూ ఉంటాం. మాకంటూ సెపరేట్ లైఫ్ ఉండకుడదా? మా పర్సనల్ లైఫ్‌ని కెరీర్ కోసం త్యాగం చేయాలా? మేల్ యాక్టర్స్‌కి ఇలాంటివి ఏమీ ఉండవు. కేవలం హీరోయిన్స్ మాత్రమే కెరీర్ కోసం మ్యారేజ్‌ని ఆలస్యం చేసుకోవాలి. ఎందుకంటే పెళ్లైతే హీరో యిన్స్‌కు మార్కెట్లో సెల్లింగ్ ఫ్యాక్టర్ పోతుంది కాబట్టి. ఈ సినిమాపై అభిమానులు చూపించిన ప్రేమ చూస్తే అర్థం అవుతోంది. హీరోయిన్‌కి పెళ్లి అయిందా? తల్లయిందా? అని కాదు. స్క్రీన్ మీద ఆ హీరోయిన్ ఎలా కనిపించారన్నదే వాళ్లకు ముఖ్యం’’ అని పేర్కొన్నారు రాణీ ముఖర్జీ. -
అమ్మాయిలందరూ నన్ను ద్వేషిస్తారని భావించా..
మర్దానీ ఫేం తాహిర్ రాజ్ బాసిన్ న్యూఢిల్లీ: ‘నేను అనుకున్నంతా అయ్యింది.. ‘మర్దానీ’ సినిమా చేసినప్పుడు నా పాత్రను చూసి అమ్మాయిలందరూ నన్ను ద్వేషిస్తారని భావించా.. సినిమా విడుదలయ్యాక నేను ఊహించినట్లే జరిగింది..’ అని మర్దానీ సినిమా ద్వారా సినిమా పరిశ్రమలోకి ఆరంగేట్రం చేసిన ఢిల్లీ వాసి తాహిర్ రాజ్ బాసిన్ తెలిపాడు. యష్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ సినిమాలో రాణి ముఖర్జీ టైటిల్ పాత్ర పోషించింది. ఇందులో ఆమె పవర్ఫుల్ పోలీస్ అధికారిణిగా నటించగా అమ్మాయిల అక్రమ రవాణా వ్యాపారం చేసే దుర్మార్గమైన వ్యక్తిగా 27 యేళ్ల తాహిర్ నటించాడు. ఈ సినిమా బాక్సాఫిస్ వద్ద మంచి టాక్ సంపాదించింది. దీనిపై తాహిర్ ఆనందం వ్యక్తం చేస్తూ.. ‘ ఈ సినిమా చేసేటప్పుడు నా పాత్ర స్వభావం చూసి అమ్మాయిలు నన్ను అసహ్యించుకుంటారని భావించా.. అయితే అమ్మాయిలు అందులో నా స్టైల్‌ను మాత్రం ఇష్టపడ్డారు..’ అని అన్నాడు. ఈ సినిమాలో చాలా బాగున్నానని సూపర్‌స్టార్ షారూఖ్ ఖాన్ ట్విటర్లో ట్వీట్ చేయడం నాకు అవార్డు వచ్చినంత ఆనందం ఇచ్చిందని చెప్పాడు. ఈ సినిమాలో నటించేందుకు మొదట చాలా ఇబ్బంది పడ్డానని ఆయన అన్నాడు. ప్రధాన పాత్రలో సీనియర్ నటి రాణీ ముఖర్జీ నటిస్తుండటంతో ఆమెతో స్క్రీన్‌ను పంచుకోవడానికి కొంచెం తడబడ్డానని తెలిపాడు. ఆమె సినిమాలు చూస్తూ పెరిగిన తనకు ఆమెతోనే నటించడమనేసరికి ఒకరకమైన ఒణుకు వచ్చిందని నవ్వుతూ చెప్పాడు. అయితే రాణి మాత్రం తనకు అన్నివిధాల మద్దతు ఇచ్చిందని, తనను కొత్త నటుడుడి చూడలేదని దాంతో త్వరలోనే మామూలుగానే నటించగలిగానని తాహిర్ అన్నాడు. ఇదిలా ఉండగా, ఈ చిత్రంలో పాత్ర సంపాదించడానికి తాను చాలా కష్టపడాల్సి వచ్చిందని తాహిర్ వివరించాడు. నాలుగేళ్లుగా తాను ముంబైలో ఉంటూ సినిమా ఆఫర్ల కోసం ప్రయత్నిస్తున్నానని, అందులో భాగంగా రెండేళ్ల కిందట యశ్‌రాజ్ ఫిల్మ్స్ కాస్టింగ్ డెరైక్టర్ షనూ శర్మను కలిసి తన ఫొటోలు చూపించానన్నాడు. కట్ చేస్తే.. కొన్ని రోజుల తర్వాత ఈ సినిమాలో అవకాశం కోసం స్క్రీన్ టెస్ట్‌కు రావాలని ఆమెనుంచి ఆహ్వానం అందిందని చెప్పాడు. తీరా అక్కడికి వెళ్లేసరికి అప్పటికే సుమారు 200 మందికిపైగా లైన్లో ఉన్నారని వివరించాడు.. చివరికి ఆ పాత్ర తనను వరించడం ఆనందంగా ఉందన్నాడు. బాలీవుడ్లో విలన్ పాత్రతో కెరీర్‌ను ప్రారంభించడంపై ఆయన మాట్లాడుతూ.. దానిపై తనకు ఎటువంటి బాధ లేదన్నాడు. ప్రస్తుతం పరిశ్రమలో ఉన్న విలన్ పాత్రధారులెవరూ నేను చేసిన పాత్రను చేసేందుకు ఇష్టపడకపోవచ్చు. అంత నీచమైన నేరప్రవృత్తిగల ఒక శాడిస్టు పాత్ర కాబట్టే నటించడానికి చాలా అవకాశం లభించింది. మున్ముందు కూడా ఇలాంటి పాత్రలొస్తే చాలెంజ్‌గా తీసుకుని నటిస్తాను..’ అని ముక్తాయించాడు. -
మర్ధానీ చిత్రం చూసి పాఠాలు నేర్చుకోండి!
పాట్నా: బాలీవుడ్ తార రాణీ ముఖర్జీ నటించిన మర్ధానీ చిత్రం బీహార్ పోలీసులకు స్పూర్తిగా నిలిచింది. ఇటీవల విడుదలైన మర్దానీ చిత్రం విమర్శకుల ప్రశంసలందుకుంటోంది. పోలీసులందరూ మర్ధానీ చిత్రం చూసి పాఠాలు నేర్చుకునేందుకు ఆ చిత్ర ప్రదర్శను బీహార్ లోని అన్ని జిల్లాల ఎస్పీలు, జీఆర్పీ ఎస్పీలు, బీహార్ మిలటరీ పోలీసు కమాండెంట్స్ లకు ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర సీఐడీ ఐజీ అరవింద్ పాండే ఆదేశించారు. మర్ధానీ చిత్రం మహిళల అక్రమ రవాణా కథాంశంతో రూపొందించింది. మహిళల అక్రమ తరలింపు ప్రపంచవ్యాప్తంగా కీలక సమస్య మారింది. అవయవ, మహిళల, పసిపాపల అమ్మకాలు లాంటి నేరాలు పెరిగిపోతున్నాయి అని అరవింద్ పాండే ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి అంశాలను చక్కగా తెరకెక్కించిన మర్ధానీ చిత్రాన్ని చూసి పోలీసులు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. -
రాణీ ముఖర్జీ చిత్రానికి నో టాక్స్
భోపాల్:బాలీవుడ్ నటి రాణీముఖర్జీ నటించిన 'మర్దానీ' చిత్రం అరుదైన ఘనతను దక్కించుకుంది. సాధారణంగా ఎక్కడ ఏ చిత్రం విడుదలైనా పన్ను నిమిత్తం కొంత మొత్తాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిస్తుంటాం. అయితే మర్దానీ చిత్రానికి ట్యాక్స్ ఫ్రీ హోదా కల్పించడానికి మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సిద్ధమైయ్యారు. ఆ చిత్రాన్ని ఆదివారం రాత్రి సతీ సమేతంగా వీక్షించిన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ చిత్రంలో మహిళలు, టీనేజ్ బాలికలపై జరుగుతున్నఅరాచకాలకు సంబంధించి ఒక మంచి సందేశం ఉండటమే దీనికి ప్రధాన కారణం. మర్దానీ చిత్రాన్ని వీక్షించిన అనంతరం ఆయన ట్విట్టర్ లో రాణి ముఖర్జీ పాత్రపై ప్రశంసలు కురిపించారు. 'మర్దానీ లో ఆమె పోషించిన పాత్ర అద్భుతమైనదే కాకుండా చాలా శక్తివంతమైనదిగా ఉంది. ఈ చిత్ర నిర్మాత ఆదిత్య చోప్రాకు ప్రత్యేక అభినందనలు. మంచి చిత్రాన్ని ప్రజల ముందుకు తీసుకువచ్చి సామాజిక చైతన్యం కల్గించే ప్రయత్నం చేశారు. ఈ చిత్రానికి టాక్స్ ఫ్రీ హోదా కల్పిస్తాం' అని పేర్కొన్నారు. ఆయన బీజీ షెడ్యూల్లో ఉన్నా కూడా చాలాకాలం తరువాత ఆయన కుటుంబ సమేతంగా సినిమాను వీక్షించడం గమనార్హం.