దేశంలో 2000కు పైగా అత్యాచారాలు చేస్తున్నది 18 ఏళ్ల లోపు వయసున్నవారే. ఇది రికార్డుల్లో నమోదైన లెక్కలు. మరి రికార్డులకు అందనివి ఇంకెన్ని ఉంటాయి? మానవ మృగాలు ఒంటరిగా కనిపించిన మహిళలనే టార్గెట్ చేస్తూ వారిని చిత్రహింసలు పెట్టి అత్యాచారం చేసి దారుణంగా చంపేస్తున్నారు. ఇలాంటి భయానక ఘటనలతో మహిళలు అర్ధరాత్రి స్వేచ్ఛగా తిరగడం మాట అటుంచితే, కనీసం పట్టపగలు కూడా గడప దాటాలంటే జంకుతున్నారు. నిజ జీవితంలో జరిగిన కిరాతకమైన అత్యాచారాల సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రమే ‘మర్దానీ 2’. ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ గురువారం విడుదల చేసింది. 2014లో విజయాన్ని సొంతం చేసుకున్న మర్దానీకి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.
పవర్‌ఫుల్ పోలీస్ అధికారిణిగా శివానీ శివాజీరాయ్ పాత్రలో రాణి ముఖర్జీ నటించింది. ఈ సినిమా ట్రైలర్ ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశాలతో నిండి ఉంది. ఇందులోని ప్రతీ సీన్ ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. అత్యాచారాలు చేస్తూ హత్య చేస్తున్న వ్యక్తి... మృతదేహాలకు రాణీ ముఖర్జీ మాస్క్‌లు పెట్టి ఆమెకు సవాల్ విసురుతాడు. అతన్ని పట్టుకోడానికి రాణీ ఏం చేసింది? ఆ దారుణాలను ఎలా అరికట్టింది? అనేది సినిమా విడుదలయ్యాక చూడాలి. ఇందులో రాణీ ముఖర్జీ ఒక నటిగా కాకుండా ఆడపిల్లలను వేధించేవాళ్ల భరతం పట్టే స్త్రీ శక్తిగా దర్శనమిస్తుంది. ఈ సినిమాతో రాణీముఖర్జీ స్థాయి రెట్టింపు అవుతుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేసింది. ‘మర్దానీ 2’ లో విక్రమ్ సింగ్ చౌహాన్, శ్రుతి బాప్నా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రాణీ ముఖర్జీ ఉగ్రరూపాన్ని చూసిన నెటిజన్లు ఈ యేడాదిలోనే బెస్ట్ ట్రైలర్ అని కొనియాడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment