ఆ కల ఎలాగైనా నెరవేర్చుకుంటాను: తమన్నా
‘జయాపజయాలకు అతీతులు హీరోలు మాత్రమే. హీరోయిన్లకు మాత్రం అంత సీన్ లేదు. వరుసగా రెండు పరాజయాలొస్తే చాలు. ఇక ఆ అమ్మడి కెరీర్ మటాష్’... చాలామంది అభిప్రాయం ఇది.
‘జయాపజయాలకు అతీతులు హీరోలు మాత్రమే. హీరోయిన్లకు మాత్రం అంత సీన్ లేదు. వరుసగా రెండు పరాజయాలొస్తే చాలు. ఇక ఆ అమ్మడి కెరీర్ మటాష్’... చాలామంది అభిప్రాయం ఇది. పలువురు హీరోయిన్ల విషయంలో అది నిజమైంది కూడా. కానీ వాళ్లల్లో తమన్నా మాత్రం మినహాయింపు అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు.
ఒక్క సినిమా ఫ్లాప్ అవ్వడంతో త్రిషను సైతం పక్కన పెట్టేసిన బాలీవుడ్, తమన్నాను మాత్రం నెత్తిన పెట్టుకుంటోంది. బాలీవుడ్‌లో ఈ యేటి మేటి డిజాస్టర్ ‘హిమ్మత్‌వాలా’. ఈ సినిమాలో నటించిన తమన్నాపై క్రిటిక్స్ తమ కలాలు ఝుళిపించారు. ఆ సినిమా పుణ్యమా అని ఎన్నడూ లేనన్ని విమర్శలను ఎదుర్కొన్నారు తమన్నా.
‘ఇక తమన్నా బాలీవుడ్ ఆశలు వదులుకున్నట్లే’ అని అందరూ అనుకుంటున్న సమయంలో... సదరు క్రిటిక్స్‌ని కూడా ఆశ్చర్యపరిచేలా... బాలీవుడ్‌లో అగ్ర హీరోల సినిమాల్లో అవకాశాలు చేజిక్కించుకుంటున్నారు తమన్నా. ఇప్పటికే అక్షయ్‌కుమార్ సరసన ఓ చిత్రంలో, సైఫ్ అలీఖాన్‌కి జోడీగా మరో చిత్రంలో తమన్నా ఖరారైందని విశ్వసనీయ సమాచారం.
ఇటీవల ఓ ఇంటర్‌వ్యూలో తమన్నా చెబుతూ -‘‘ఓడిన చోటే గెలవడం నాకు చిన్నప్పట్నుంచీ అలవాటు. నా గెలుపులన్నీ ఓటమి తర్వాతే వచ్చాయి. దేశవ్యాప్తంగా విజయం సాధించాలనేది నా కల. ఆ కల ఎలాగైనా నెరవేర్చుకుంటా’’ అన్నారు. అందుకు తగ్గట్టే అవకాశాలు సాధిస్తున్నారు తమన్నా. నిజానికి తెలుగులో కూడా ఈ మిల్కీ బ్యూటీకి పెద్దగా విజయాల్లేవు. కానీ క్రేజ్ మాత్రం ఇసుమంత కూడా తగ్గలేదన్నది నిజం.