అభిమానుల ఆశీస్సులతో వందేళ్లు పూర్తి చేస్తా
అభిమానుల ఆశీస్సులతో వందేళ్లు పూర్తి చేస్తా
Published Sun, Oct 20 2013 12:40 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM
అది 1974... అప్పటికి ఏయన్నార్ హీరోగా మంచి స్వింగ్‌లో ఉన్నారు. అలాంటి టైమ్‌లో ఏఎన్నార్ హై కొలెస్ట్రాల్ సమస్యతో బాధ పడుతున్నారని ఇండస్ట్రీ మొత్తానికీ షాకింగ్ న్యూస్. ఓ పెద్ద ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. మహా అయితే ఓ పధ్నాలుగేళ్లు బతికే అవకాశం ఉంటుందేమో అని డాక్టర్లు చెప్పేశారు. కాలం పరుగులు తీసింది. పద్నాలుగేళ్లు ప్రశాంతంగా గడిచిపోయాయి. గండం గట్టెక్కినట్టే అని అందరూ అనుకుంటున్న సమయంలో... ఈ సారి ఏకంగా ఆయనకు గుండెపోటే వచ్చేసింది. ‘ఆపరేషన్ అయితే చేస్తాం కానీ... గ్యారంటీ లేద’ని చెప్పేశారు వైద్యులు. ఇది జరిగి ఇప్పటికి పాతికేళ్లయ్యింది.
అక్కినేని సంపూర్ణమైన ఆరోగ్యంతో హాయిగా ఉన్నారు. గుండెపోటు వచ్చాక కూడా ఇన్నాళ్లు బతికిన వ్యక్తిగా ప్రపంచ రికార్డ్ కూడా నెలకొల్పారు. అయితే పదిరోజుల క్రితం ఏయన్నార్‌కి కడుపు నొప్పి వచ్చింది. ఆస్పత్రికి వెళ్లారు. వారం పాటు డాక్టర్లు వివిధ పరీక్షలు చేశారు. చివరకు ‘కేన్సర్’ అని నిర్ధారించారు. నిజానికి ఇది దేశం మొత్తానికీ షాకింగ్ న్యూసే. కానీ... ఇప్పుడు కూడా అక్కినేని ఎప్పటిలానే నవ్వుతూ ఉన్నారు. ఇంకా మాట్లాడితే... మునుపటికంటే ఉల్లాసంగా కనిపించారు. పైగా, ‘‘నేను చాలా నిబ్బరంగా ఉన్నా. మీరందరూ (అభిమానులు, సన్నిహితులు) అలానే ఉండండి.
నా ఆరోగ్యం గురించి తెలుసుకోవాలని ‘సుస్తీ చేసిందటగా’ అంటూ మీరు బాధపడి, నన్ను బాధపెట్టకండి’’అంటూ మీడియా సాక్షిగా శనివారం ప్రకటించారు. తన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి, తన జీవితం గురించి అక్కినేని ఇలా చెప్పుకొచ్చారు.‘‘జీవితం చాలా తమాషా అయినది. రెండుసార్లు నాకు పరీక్ష పెట్టింది. ఆ రెండుసార్లూ జయించాను. ఆ రకంగా ఓ రికార్డ్ సాధించాను. ఇప్పుడూ సాధిస్తాను. ఇప్పుడొచ్చిన కొత్త మలుపు గురించి చెప్పాలంటే.. అన్ని పరీక్షలు జరిపిన తర్వాత నాలో కేన్సర్ కణాలు ప్రవేశించాయని డాక్టర్లు స్పష్టం చేశారు. కేన్సర్ వస్తే, కచ్చితంగా చనిపోతారని చెప్పింది నా సినిమాల్లోనే. అందుకని కేన్సర్ అంటే ఇక మరణించక తప్పదని అనుకుంటారు.
అయితే అది పాత మాట. ఇప్పుడు వేరే. చిన్న వయసువారిలో కేన్సర్ కణాల పని తీరు వేగవంతంగా ఉంటుందని, నా వయసులో ఉన్నవారి కణాలకు కూడా అదే వయసు ఉంటుంది కాబట్టి, వాటి పని తీరు చాలా నెమ్మదిగా ఉంటుందని డాక్టర్లు చెప్పారు. అందుకే భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. అంతర్జాతీయ స్థాయి డాక్టర్లను సంప్రదిస్తే.. ‘ఇట్స్ నాట్ ఎ డెత్ పాయింట్.. ఇట్స్ ఎ లివింగ్ పాయింట్’ అన్నారు. నా మనోబలంతో, అభిమానుల ఆశీర్వాద బలంతో రెండు సార్లు జయించి, రెండు రికార్డులు సాధించా. ఇప్పుడు మూడో రికార్డ్ సాధించే అవకాశం దక్కిందనుకుంటున్నా.
ఇటీవల నా 90వ పుట్టినరోజు సందర్భంగా సన్నిహితులు, శ్రేయోభిలాషులు 110, 116, 124 ఏళ్లు బతకాలని ఆకాంక్షించారు. మా కుటుంబంలో ఎక్కువ సంవత్సరాలు బతికింది మా అమ్మగారే. ఆవిడ 96 ఏళ్లు బతికారు. అందుకని నేనూ 96 ఏళ్లు బతుకుతానని నా నమ్మకం. నా మనోబలానికి అభిమానుల ఆశీర్వాదం కూడా తోడైతే వందేళ్లు పూర్తి చేస్తా. ఈ సందర్భంగా మనం క్రికెటర్ యువరాజ్ సింగ్‌ని గుర్తు చేసుకోవాలి. తను కేన్సర్‌ని జయించాడు. ఆ తర్వాత మన టీమ్ గెలవడానికి తను కారకుడైన వైనం మనందరికీ తెలిసిందే.
ఇక, నా సినిమా కెరీర్ విషయానికొస్తే... 1940లో పి.పుల్లయ్యగారి ‘ధర్మపత్ని’లో చిన్న వేషం వేశాను. ఆ తర్వాత ఓసారి గుంటూరు నుంచి గుడివాడ వస్తుంటే, ఘంటసాల బలరామయ్యగారు నన్ను చూసి, రాముడి పాత్ర చేయించాలనుకున్నారు. 1944 మే 7న మద్రాసు వెళ్లి, నటించడం మొదలుపెట్టాను. నాకు 74 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ ఉంటుందని నేనప్పుడు ఊహించలేదు. నాకు తెలిసి ప్రపంచంలో ఈ రికార్డ్ సాధించింది నేనే. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్, రఘుపతి వెంకయ్య అవార్డ్‌లాంటి ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకుంటానని ఊహించలేదు. తమిళంలో 26 సినిమాలు చేశాను. అక్కడ కలైమామణి అవార్డ్ అందుకున్నాను.
ఇంకా దేశ, విదేశాల్లో కూడా ఎన్నో పురస్కారాలు వరించాయి. ఇన్నేళ్ల కెరీర్‌లో వివిధ మనస్తత్వాలు గల పాత్రలు ధరించే అవకాశం ఇచ్చిన నా దర్శక, నిర్మాతలకు, ఆదరించిన అభిమానులకు, మహానుభావుడు ఘంటసాల బలరామయ్యగారికి కృతజ్ఞతలు. నాకెంతో మంచి స్థాయినిచ్చిన ఆ కళామతల్లికి ధన్యవాదాలు. నేను మాత్రమే కాకుండా నా బిడ్డలు, నా మనవళ్లు కూడా నటులుగా కొనసాగుతున్నారు. నా మనవరాళ్లు అన్నపూర్ణ స్టూడియోస్ కార్యకలాపాలకు సంబంధించిన బాధ్యత చేపట్టారు. ఇలా, నా కుటుంబం మొత్తం కళకళలాడుతూ, సినీ పరిశ్రమకే అంకితమైంది. 90 ఏళ్ల వయసులోనూ నేను నటనకు దూరం కాలేదు. నా తుది శ్వాస వరకూ దూరం కాను.
ఏది పడితే అది కాకుండా నా వయసుకు తగ్గ, బాగున్న పాత్రలనే చేస్తాను. నటన అనేది నా వృత్తి. అయితే... సినిమాల్లోనే నటిస్తాను కానీ నిజజీవితంలో నటించను. అబద్ధాలు చెప్పడానికి తెలివితేటలు కావాలి. నిజం చెప్పడానికి ధైర్యం కావాలి. ఆ ధైర్యం నాకుంది. అందుకే, ధైర్యంగా నా ఆరోగ్య పరిస్థితిని వెల్లడించా. దీని గురించి నన్నెవరూ ఇక ఎలాంటి ప్రశ్నలూ అడగవద్దని మనవి చేసుకుంటున్నా’’ అని చాలా నిబ్బరంగా, మధ్య మధ్యలో తనదైన శైలిలో ఛలోక్తులు విసురుతూ అక్కినేని మాట్లాడారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ సమావేశంలో ఏయన్నార్ కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారు.
Advertisement