Annapurana Studious
-
కొత్త కోడలు గురించి తొలిసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన 'అమల అక్కినేని'
తెరమీద పోషించిన పాత్రల సంగతి అటుంచితే, ‘నిత్య జీవితంలో తాను పోషించిన ప్రతి పాత్రా తనకు పూర్తి సంతృప్తిని అందించింది’ అని చెబుతున్నారు సీనియర్ నటి, అగ్రనటుడు అక్కినేని నాగార్జున భార్య అమల అక్కినేని. తమ ఇంట పెళ్లి బాజాలు మోగుతున్న నేపథ్యంలో.. ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు.సాక్షి: ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ)లో పాల్గొన్నారు కదా.. ఎలా అనిపించింది?అమల : ఈ సారి అక్కినేని నాగేశ్వరరావు గారితో పాటు ఐదుగురు లెజెండరీ సెంచురీ ఇయర్‌ను ఇఫీ నిర్వహించింది. అదే కాకుండా ప్రారంభ కార్యక్రమం నుంచి ఇఫీ బాగా నచ్చింది. బొమన్ ఇరానీ లెజెండ్స్ గురించి ఎంతో బాగా చెప్పారు. క్లాసిక్స్ నుంచి న్యూ టాలెంట్స్ దాకా, అలాగే ప్రపంచ సినిమాని, ఇండియన్ సినిమాని ఒకే చోట చేర్చడం అద్భుతం. ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరం. మనం అంతా మన చిన్న ప్రపంచంలో బిజీగా ఉంటాం. ఇలాంటివి జరిగితేనే ఎన్నో మననం చేసుకోగలుగుతాం.. మరెన్నో తెలుసుకోగలుగుతాం.. సాక్షి: మీ ‘అన్నపూర్ణ’ స్టూడెంట్స్‌కి కూడా ఇఫీలో చోటు దక్కిందా..?అమల : ఎస్.. గతంలో ఎన్నో చోట్ల మా విద్యార్థుల చిత్రాలను ప్రదర్శించారు. కానీ ఇఫీలో మా అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియాకి అవకాశం రావడం తొలిసారి. సంస్థ డైరెక్టర్‌గా ఇది నాకు చాలా సంతోషాన్ని అందిస్తోంది.సాక్షి: సీనియర్ నటిగా సినిమా రంగంలోకి వచ్చే యువతులకు ఏం చెబుతారు? అమల : ఇప్పుడు కొందరు నిర్మాతలు మంచి పాత్రల్ని మహిళలకు ఇస్తున్నారు. అయినా మహిళలంటే కెమెరా ముందు కేవలం నటిగా మాత్రమే కాదు టెక్నీషియన్స్ కావచ్చు, ఫిల్మ్ మేకర్స్‌గా కూడా కావచ్చు. సినిమా పరిశ్రమలోకి ఎటువంటి జంకూ లేకుండా రమ్మంటూ అమ్మాయిలకు నేను ధైర్యాన్ని ఇస్తున్నాను.సాక్షి: నిత్య జీవితంలో మీరు పోషించిన పాత్రలు ఎలా అనిపించాయి.. అమల : నేను పోషించిన ప్రతి పాత్రా నన్ను ఇంత దూరం తీసుకొచ్చాయి. ఇంట్లో భార్యగా, కోడలిగా, తల్లిగా.. ఇవన్నీ నాకు ప్రత్యేకమైన పాత్రలు. అద్భుతమైన ప్రయాణాన్ని అందించాయి. అలాగే గడపదాటితే.. బ్లూ క్రాస్ ద్వారా జంతు సంరక్షణ.. మరోవైపు భవిష్యత్తు సినిమా రంగం కోసం యువతను తీర్చిదిద్దడం.. అన్నీ మధురమైనవి మాత్రమే కాక నేనేంటో నాకు చూపించాయి. సాక్షి: కొత్త కోడలికి ఏవైనా సలహా లాంటివి.. అమల : ఆమె చాలా టాలెంటెడ్. చాలా మెచ్యూర్డ్ మహిళ. ఆ అమ్మాయికి నేను సలహా అంటూ ప్రత్యేకంగా ఏమీ ఇవ్వనక్కర్లేదు. ఆమె తప్పకుండా ఒక మంచి భార్యగా మంచి జీవితాన్ని ఆస్వాదించాలని నా కోరిక. మీ పాఠకులు కూడా కొత్త జంట భవిష్యత్తు బాగుండాలని ఆశీస్సులు ఇవ్వాలని కోరుతున్నా. సాక్షి: పిల్లల విజయాలా? విద్యార్థుల విజయాలా? ఏవి ఎక్కువ? అమల : సినిమా రంగంలో నా పిల్లల విజయాలు సంతోషాన్ని అందిస్తాయనేది నిజమే, కానీ నిజం చెప్పాలంటే.. నా విద్యార్థుల విజయాలు అంతకన్నా ఒకింత ఎక్కువ ఆనందాన్నే పంచుతాయి.. పంచుతున్నాయి. -
కార్తీ 'జపాన్' సినిమా కోసం నాగార్జున కీలక నిర్ణయం
కార్తీ హీరోగా రాజు మురుగన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘జపాన్’. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా నటించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌పై ఎస్ఆర్ ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో దీపావళికి విడుదల కానుంది. కార్తీకి జపాన్ 25వ చిత్రం. తన కెరీయర్లో ఇదొక బెంచ్‌మార్క్ లాంటి మూవీ. ఈ చిత్రాన్ని తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ విడుదల చేస్తుంది. (ఇదీ చదవండి: 'భగవంత్ కేసరి'కి షాకిచ్చిన తారక్,మెగా ఫ్యాన్స్.. భారీగా నష్టాలు) నాగార్జున అక్కినేని కాంపౌండ్ నుంచి ఈ సినిమా తెలుగులో విడుదల కానున్నడంతో మార్కెట్‌కు ఎలాంటి సందేహం అక్కర్లేదని చెప్పవచ్చు. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఒక అజ్ఞాత వ్యక్తి 200 కోట్ల దోపిడీకి పాల్పడే కథాంశంతో ఉంటుందని టీజర్‌తో ఒక క్లారిటీ వచ్చింది. అంతేకాకుండా ఇండియా అంతటా జపాన్‌పై (కార్తీ పాత్ర పేరు) 182 కేసులున్నాయని, అతనొక గజదొంగ అంటూ పాత్రను రివీల్ చేశారు. తమిళనాడులోని ఒక దొంగ జీవితాన్ని బేస్ చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నాగార్జున- కార్తీ ఇద్దరూ కలిసి ఊపిరి సినిమాలో మెప్పించారు. ఆ సినిమా నుంచే వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. జపాన్ సినిమాను అన్నపూర్ణ సంస్థ విడుదల చేయనున్నడంతో కార్తీ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. సినిమా విడుదల తప్పకుండా భారీ ఎత్తున ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. -
‘మనుష్యులే పోయినప్పుడు.. సెట్దేముంది’
సాక్షి, హైదరాబాద్ : అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన అగ్నిప్రమాదంలో ‘మనం’ సినిమా సెట్ పూర్తిగా కాలిపోవడంతో చాలా బాధగా ఉందని ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి నటించిన సినిమా కావడంతో ఈ సెట్ ను చూసినప్పుడల్లా ఆయన గుర్తొచ్చేవారని అన్నారు. మనుషులే పోయినప్పుడు.. సెట్ కాలిపోతేముందిలే అన్న నాగర్జున.. ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడం సంతోషకరమైన విషయం అన్నారు. ఇంత పెద్దగా ఎగిసిపడుతున్న మంటలు ఎలా ఆర్పుతారనుకున్నా..కానీ ఫైర్ సిబ్బంది కేవలం 15 నిమిషాల్లో పని పూర్తి చేశారన్నారు. ఈ సందర్భంగా ఫైర్ డిపార్ట్మెంట్కు, పోలీసులకు నాగర్జున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమా సెట్ కు రూ.2 కోట్లకు పైనే అప్పుడు ఖర్చయిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ‘రాజు గారి గది’ తో పాటు పలు సినిమాలకు ఈ సెట్ లోనే షూటింగ్ జరిగిందని తెలిపారు. -
‘మనం’సెట్ కాలిపోవడం బాధగా ఉంది
-
అభిమానుల ఆశీస్సులతో వందేళ్లు పూర్తి చేస్తా
అది 1974... అప్పటికి ఏయన్నార్ హీరోగా మంచి స్వింగ్‌లో ఉన్నారు. అలాంటి టైమ్‌లో ఏఎన్నార్ హై కొలెస్ట్రాల్ సమస్యతో బాధ పడుతున్నారని ఇండస్ట్రీ మొత్తానికీ షాకింగ్ న్యూస్. ఓ పెద్ద ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. మహా అయితే ఓ పధ్నాలుగేళ్లు బతికే అవకాశం ఉంటుందేమో అని డాక్టర్లు చెప్పేశారు. కాలం పరుగులు తీసింది. పద్నాలుగేళ్లు ప్రశాంతంగా గడిచిపోయాయి. గండం గట్టెక్కినట్టే అని అందరూ అనుకుంటున్న సమయంలో... ఈ సారి ఏకంగా ఆయనకు గుండెపోటే వచ్చేసింది. ‘ఆపరేషన్ అయితే చేస్తాం కానీ... గ్యారంటీ లేద’ని చెప్పేశారు వైద్యులు. ఇది జరిగి ఇప్పటికి పాతికేళ్లయ్యింది. అక్కినేని సంపూర్ణమైన ఆరోగ్యంతో హాయిగా ఉన్నారు. గుండెపోటు వచ్చాక కూడా ఇన్నాళ్లు బతికిన వ్యక్తిగా ప్రపంచ రికార్డ్ కూడా నెలకొల్పారు. అయితే పదిరోజుల క్రితం ఏయన్నార్‌కి కడుపు నొప్పి వచ్చింది. ఆస్పత్రికి వెళ్లారు. వారం పాటు డాక్టర్లు వివిధ పరీక్షలు చేశారు. చివరకు ‘కేన్సర్’ అని నిర్ధారించారు. నిజానికి ఇది దేశం మొత్తానికీ షాకింగ్ న్యూసే. కానీ... ఇప్పుడు కూడా అక్కినేని ఎప్పటిలానే నవ్వుతూ ఉన్నారు. ఇంకా మాట్లాడితే... మునుపటికంటే ఉల్లాసంగా కనిపించారు. పైగా, ‘‘నేను చాలా నిబ్బరంగా ఉన్నా. మీరందరూ (అభిమానులు, సన్నిహితులు) అలానే ఉండండి. నా ఆరోగ్యం గురించి తెలుసుకోవాలని ‘సుస్తీ చేసిందటగా’ అంటూ మీరు బాధపడి, నన్ను బాధపెట్టకండి’’అంటూ మీడియా సాక్షిగా శనివారం ప్రకటించారు. తన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి, తన జీవితం గురించి అక్కినేని ఇలా చెప్పుకొచ్చారు.‘‘జీవితం చాలా తమాషా అయినది. రెండుసార్లు నాకు పరీక్ష పెట్టింది. ఆ రెండుసార్లూ జయించాను. ఆ రకంగా ఓ రికార్డ్ సాధించాను. ఇప్పుడూ సాధిస్తాను. ఇప్పుడొచ్చిన కొత్త మలుపు గురించి చెప్పాలంటే.. అన్ని పరీక్షలు జరిపిన తర్వాత నాలో కేన్సర్ కణాలు ప్రవేశించాయని డాక్టర్లు స్పష్టం చేశారు. కేన్సర్ వస్తే, కచ్చితంగా చనిపోతారని చెప్పింది నా సినిమాల్లోనే. అందుకని కేన్సర్ అంటే ఇక మరణించక తప్పదని అనుకుంటారు. అయితే అది పాత మాట. ఇప్పుడు వేరే. చిన్న వయసువారిలో కేన్సర్ కణాల పని తీరు వేగవంతంగా ఉంటుందని, నా వయసులో ఉన్నవారి కణాలకు కూడా అదే వయసు ఉంటుంది కాబట్టి, వాటి పని తీరు చాలా నెమ్మదిగా ఉంటుందని డాక్టర్లు చెప్పారు. అందుకే భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. అంతర్జాతీయ స్థాయి డాక్టర్లను సంప్రదిస్తే.. ‘ఇట్స్ నాట్ ఎ డెత్ పాయింట్.. ఇట్స్ ఎ లివింగ్ పాయింట్’ అన్నారు. నా మనోబలంతో, అభిమానుల ఆశీర్వాద బలంతో రెండు సార్లు జయించి, రెండు రికార్డులు సాధించా. ఇప్పుడు మూడో రికార్డ్ సాధించే అవకాశం దక్కిందనుకుంటున్నా. ఇటీవల నా 90వ పుట్టినరోజు సందర్భంగా సన్నిహితులు, శ్రేయోభిలాషులు 110, 116, 124 ఏళ్లు బతకాలని ఆకాంక్షించారు. మా కుటుంబంలో ఎక్కువ సంవత్సరాలు బతికింది మా అమ్మగారే. ఆవిడ 96 ఏళ్లు బతికారు. అందుకని నేనూ 96 ఏళ్లు బతుకుతానని నా నమ్మకం. నా మనోబలానికి అభిమానుల ఆశీర్వాదం కూడా తోడైతే వందేళ్లు పూర్తి చేస్తా. ఈ సందర్భంగా మనం క్రికెటర్ యువరాజ్ సింగ్‌ని గుర్తు చేసుకోవాలి. తను కేన్సర్‌ని జయించాడు. ఆ తర్వాత మన టీమ్ గెలవడానికి తను కారకుడైన వైనం మనందరికీ తెలిసిందే. ఇక, నా సినిమా కెరీర్ విషయానికొస్తే... 1940లో పి.పుల్లయ్యగారి ‘ధర్మపత్ని’లో చిన్న వేషం వేశాను. ఆ తర్వాత ఓసారి గుంటూరు నుంచి గుడివాడ వస్తుంటే, ఘంటసాల బలరామయ్యగారు నన్ను చూసి, రాముడి పాత్ర చేయించాలనుకున్నారు. 1944 మే 7న మద్రాసు వెళ్లి, నటించడం మొదలుపెట్టాను. నాకు 74 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ ఉంటుందని నేనప్పుడు ఊహించలేదు. నాకు తెలిసి ప్రపంచంలో ఈ రికార్డ్ సాధించింది నేనే. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్, రఘుపతి వెంకయ్య అవార్డ్లాంటి ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకుంటానని ఊహించలేదు. తమిళంలో 26 సినిమాలు చేశాను. అక్కడ కలైమామణి అవార్డ్ అందుకున్నాను. ఇంకా దేశ, విదేశాల్లో కూడా ఎన్నో పురస్కారాలు వరించాయి. ఇన్నేళ్ల కెరీర్లో వివిధ మనస్తత్వాలు గల పాత్రలు ధరించే అవకాశం ఇచ్చిన నా దర్శక, నిర్మాతలకు, ఆదరించిన అభిమానులకు, మహానుభావుడు ఘంటసాల బలరామయ్యగారికి కృతజ్ఞతలు. నాకెంతో మంచి స్థాయినిచ్చిన ఆ కళామతల్లికి ధన్యవాదాలు. నేను మాత్రమే కాకుండా నా బిడ్డలు, నా మనవళ్లు కూడా నటులుగా కొనసాగుతున్నారు. నా మనవరాళ్లు అన్నపూర్ణ స్టూడియోస్ కార్యకలాపాలకు సంబంధించిన బాధ్యత చేపట్టారు. ఇలా, నా కుటుంబం మొత్తం కళకళలాడుతూ, సినీ పరిశ్రమకే అంకితమైంది. 90 ఏళ్ల వయసులోనూ నేను నటనకు దూరం కాలేదు. నా తుది శ్వాస వరకూ దూరం కాను. ఏది పడితే అది కాకుండా నా వయసుకు తగ్గ, బాగున్న పాత్రలనే చేస్తాను. నటన అనేది నా వృత్తి. అయితే... సినిమాల్లోనే నటిస్తాను కానీ నిజజీవితంలో నటించను. అబద్ధాలు చెప్పడానికి తెలివితేటలు కావాలి. నిజం చెప్పడానికి ధైర్యం కావాలి. ఆ ధైర్యం నాకుంది. అందుకే, ధైర్యంగా నా ఆరోగ్య పరిస్థితిని వెల్లడించా. దీని గురించి నన్నెవరూ ఇక ఎలాంటి ప్రశ్నలూ అడగవద్దని మనవి చేసుకుంటున్నా’’ అని చాలా నిబ్బరంగా, మధ్య మధ్యలో తనదైన శైలిలో ఛలోక్తులు విసురుతూ అక్కినేని మాట్లాడారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ సమావేశంలో ఏయన్నార్ కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారు.