తెరమీద పోషించిన పాత్రల సంగతి అటుంచితే, ‘నిత్య జీవితంలో తాను పోషించిన ప్రతి పాత్రా తనకు పూర్తి సంతృప్తిని అందించింది’ అని చెబుతున్నారు సీనియర్ నటి, అగ్రనటుడు అక్కినేని నాగార్జున భార్య అమల అక్కినేని. తమ ఇంట పెళ్లి బాజాలు మోగుతున్న నేపథ్యంలో.. ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు.
సాక్షి: ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ)లో పాల్గొన్నారు కదా.. ఎలా అనిపించింది?
అమల : ఈ సారి అక్కినేని నాగేశ్వరరావు గారితో పాటు ఐదుగురు లెజెండరీ సెంచురీ ఇయర్‌ను ఇఫీ నిర్వహించింది. అదే కాకుండా ప్రారంభ కార్యక్రమం నుంచి ఇఫీ బాగా నచ్చింది. బొమన్ ఇరానీ లెజెండ్స్ గురించి ఎంతో బాగా చెప్పారు. క్లాసిక్స్ నుంచి న్యూ టాలెంట్స్ దాకా, అలాగే ప్రపంచ సినిమాని, ఇండియన్ సినిమాని ఒకే చోట చేర్చడం అద్భుతం. ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరం. మనం అంతా మన చిన్న ప్రపంచంలో బిజీగా ఉంటాం. ఇలాంటివి జరిగితేనే ఎన్నో మననం చేసుకోగలుగుతాం.. మరెన్నో తెలుసుకోగలుగుతాం..
సాక్షి: మీ ‘అన్నపూర్ణ’ స్టూడెంట్స్‌కి కూడా ఇఫీలో చోటు దక్కిందా..?
అమల : ఎస్.. గతంలో ఎన్నో చోట్ల మా విద్యార్థుల చిత్రాలను ప్రదర్శించారు. కానీ ఇఫీలో మా అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియాకి అవకాశం రావడం తొలిసారి. సంస్థ డైరెక్టర్‌గా ఇది నాకు చాలా సంతోషాన్ని అందిస్తోంది.
సాక్షి: సీనియర్ నటిగా సినిమా రంగంలోకి వచ్చే యువతులకు ఏం చెబుతారు?
అమల : ఇప్పుడు కొందరు నిర్మాతలు మంచి పాత్రల్ని మహిళలకు ఇస్తున్నారు. అయినా మహిళలంటే కెమెరా ముందు కేవలం నటిగా మాత్రమే కాదు టెక్నీషియన్స్ కావచ్చు, ఫిల్మ్ మేకర్స్‌గా కూడా కావచ్చు. సినిమా పరిశ్రమలోకి ఎటువంటి జంకూ లేకుండా రమ్మంటూ అమ్మాయిలకు నేను ధైర్యాన్ని ఇస్తున్నాను.
సాక్షి: నిత్య జీవితంలో మీరు పోషించిన పాత్రలు ఎలా అనిపించాయి..
అమల : నేను పోషించిన ప్రతి పాత్రా నన్ను ఇంత దూరం తీసుకొచ్చాయి. ఇంట్లో భార్యగా, కోడలిగా, తల్లిగా.. ఇవన్నీ నాకు ప్రత్యేకమైన పాత్రలు. అద్భుతమైన ప్రయాణాన్ని అందించాయి. అలాగే గడపదాటితే.. బ్లూ క్రాస్ ద్వారా జంతు సంరక్షణ.. మరోవైపు భవిష్యత్తు సినిమా రంగం కోసం యువతను తీర్చిదిద్దడం.. అన్నీ మధురమైనవి మాత్రమే కాక నేనేంటో నాకు చూపించాయి.
సాక్షి: కొత్త కోడలికి ఏవైనా సలహా లాంటివి..
అమల : ఆమె చాలా టాలెంటెడ్. చాలా మెచ్యూర్డ్ మహిళ. ఆ అమ్మాయికి నేను సలహా అంటూ ప్రత్యేకంగా ఏమీ ఇవ్వనక్కర్లేదు. ఆమె తప్పకుండా ఒక మంచి భార్యగా మంచి జీవితాన్ని ఆస్వాదించాలని నా కోరిక. మీ పాఠకులు కూడా కొత్త జంట భవిష్యత్తు బాగుండాలని ఆశీస్సులు ఇవ్వాలని కోరుతున్నా.
సాక్షి: పిల్లల విజయాలా? విద్యార్థుల విజయాలా? ఏవి ఎక్కువ?
అమల : సినిమా రంగంలో నా పిల్లల విజయాలు సంతోషాన్ని అందిస్తాయనేది నిజమే, కానీ నిజం చెప్పాలంటే.. నా విద్యార్థుల విజయాలు అంతకన్నా ఒకింత ఎక్కువ ఆనందాన్నే పంచుతాయి.. పంచుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment