అతణ్ణి ఎప్పటికీ క్షమించను!
అతణ్ణి ఎప్పటికీ క్షమించను!
Published Wed, Jan 29 2014 12:03 AM | Last Updated on Sat, Sep 2 2017 3:06 AM
అనుదినం వివాదాలు, అడుగడుగునా ఆటుపోట్లు.. కెరీర్ ప్రారంభించినప్పట్నుంచీ నయనతార జీవితం ఇదే. శింబుతో సాగించిన ప్రేమాయణం ఓ చర్చ. తర్వాత ఇద్దరూ విడిపోవడం ఓ రచ్చ. మళ్లీ ప్రభుదేవాతో లవ్వు. ఇంతలోనే కటీఫ్. పాపం... ఈ పరిణామాలు ఆమె కెరీర్‌పై కూడా అంతో ఇంతో ప్రభావం చూపించాయి. ఒకానొక దశలో సినిమాలకు దూరమైపోయారు కూడా. ప్రస్తుతం మాత్రం చాలా ప్రశాంత చిత్తంతో సినిమాలు చేసుకుంటూ పోతున్నారు నయన. అయితే... తన పాత ప్రియుడు శింబుతో తాను నటిస్తుండటం ప్రస్తుతం కోలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. ‘ఇద్దరి మధ్య మళ్లీ ప్రేమ చిగురిస్తుందేమో!’... అని అక్కడి మీడియా కథనాలు కూడా ప్రసారం చేసింది.
అయితే... నయన మాత్రం ఈ విషయంలో పెదవి విప్పకుండా జాగ్రత్తగా ముందుకెళుతున్నారు. కానీ... ఇటీవల ఓ తమిళ చానల్ అడిగిన ప్రశ్నకు నయన చెప్పిన సమాధానం అక్కడ పెద్ద దుమారాన్నే రేపింది. ‘‘శింబుతో నటించేస్తున్నారు. అలాగే... ప్రభుదేవాను కూడా క్షమించేసి ఆయన దర్శకత్వంలో కూడా నటించేయొచ్చు కదా?’’ అని సదరు చానల్ వారు అడిగితే -‘‘మొదటి వ్యక్తిని క్షమించాను కానీ... మీరు చెప్పిన ఆ రెండో వ్యక్తిని మాత్రం ఎప్పటికీ క్షమించను’’ అని సింపుల్‌గా చెప్పి అక్కడ్నుంచీ తప్పుకున్నారట నయన. ప్రభుదేవాపై తాను ఎంత కోపంతో ఉందో ఈ సమాధానమే చెబుతోందని కోలీవుడ్‌లో అందరూ అనుకుంటున్నారట!
Advertisement
Advertisement