ఆమిర్‌ఖాన్ స్టార్ కాడట?
భారతీయ సినిమా స్టామినాను రెండొందల కోట్లకు తీసుకెళ్లిన హీరో స్టార్ కాడా? ‘ధూమ్-3’ సినిమా విడుదలై పదిహేను రోజులైంది. ఈ కొద్ది రోజుల్లోనే వసూళ్లు 300 కోట్లు దాటాయి. ఈ స్థాయి వసూళ్లను రాబట్టిన హీరో స్టార్ కాదా? అసలు ఈ ముసుగులో గుద్దులాట దేనికి.. ఆమిర్‌ఖాన్ స్టార్ కాడా? ఈ మాట ఎవరైనా పొరపాటున అంటే.. ‘చిన్న మెదడు చితికిపోయిందేమో’అన్నట్లుగా ఆ మాటలు అన్న వ్యక్తి వైపు జనాలు జాలిగా చూస్తారు. ఎందుకంటే... స్టార్‌గా ఆమిర్‌కో రేంజ్ ఉంది. ఆయనో సినీ ఎన్‌సైక్లోపీడియా. దేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరు. అలాంటి ఆమిర్‌ని స్టార్ కాదని ఎవరైనా అంటారా? కానీ అన్నారు. అంత ధైర్యం చేసింది ఎవరనుకుంటున్నారా? ఎవరో కాదు... ఆమిర్‌ఖానే. తాను స్టార్‌ని కాదని మీడియా సాక్షిగా ఆయనే చెప్పారు.
ఆమిర్ దృష్టిలో స్టార్ అంటే... చెత్త సినిమాక్కూడా ప్రేక్షకుల్ని రప్పించే సత్తా ఉన్నవాడేనట. అలాంటి స్టార్ బాలీవుడ్‌లో ఒక్క సల్మాన్‌ఖానే నట. నిజంగా సల్మాన్‌కి ఇంతకు మించిన అవార్డు మరొకటి ఉండదేమో. ‘ధూమ్-3’ చిత్రం ఘనవిజయం నేపథ్యంలో ముంబయ్‌లో ఏర్పాటు చేసిన ఓ విలేకరుల సమావేశంలో ఆమిర్ పై అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఇంకా చెబుతూ -‘‘ప్రేక్షకులను థియేటర్‌కి రప్పించే కెపాసిటీ నిజంగా నాకు లేదు. సెలవుదినమైన ఆదివారం రోజున పెద్ద ఎత్తున ప్రేక్షకులు సినిమా హాళ్లకు తరలివస్తారు. అది ఏ సినిమాకైనా జరిగేదే. అదే విధంగా ప్రతిరోజు ప్రేక్షకులను రప్పించాలంటే... అది గొప్ప స్టార్‌కి మాత్రమే సాధ్యం. నేను కచ్చితంగా అలాంటి స్టార్‌ని కాను. సాధారణ నటుణ్ణి మాత్రమే. సెలవులతో ప్రమేయం లేకుండా ప్రతిరోజూ జనాన్ని థియేటర్‌కి తెప్పించే సామర్థ్యం సల్మాన్‌కి మాత్రమే ఉంది’’ అని సల్మాన్‌ని పొగడ్తలతో ముంచెత్తాడు మిస్టర్ పర్‌ఫెక్ట్.