dhoom-3
-
సల్మాన్ 'జై హో' అంటాడా?
బాలీవుడ్ లో 'ఖాన్'ల ఆధిపత్య పోరాటం కొనసాగుతోంది. గత కొద్దికాలంగా హిందీ చిత్ర పరిశ్రమలో షారుక్, అమీర్, సల్మాన్ ఖాన్ ల మధ్య రికార్డుల యుద్ధం ఆసక్తికరంగా మారింది. ఇటీవల కాలంలో చాలా తక్కువ సమయంలో ఒకరి రికార్డులను మరొకరు తిరగరాస్తున్నారు. గత సంవత్సరం 'చెన్నై ఎక్స్ ప్రెస్'తో షారుక్ (226 కోట్లు), క్రిష్-3 చిత్రంతో హృతిక్ (280 కోట్లు) అత్యధిక కలెక్షన్లను వసూలు చేసి ఓ రికార్డును నెలకొల్పారు. అయితే ఆ సంతోషం ఎక్కువ కాలం షారుక్, హృతిక్ లకు నిలువలేదు. గత సంవత్సరం చివర్లో డిసెంబర్ 20 తేదిన విడుదలైన 'ధూమ్-3' చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డుల వర్షం కురిపించింది. 'ధూమ్-3' చిత్రం విశ్వవ్యాప్తంగా 533 కోట్ల గ్రాస్, బాలీవుడ్ లో 280 కోట్ల నికర వసూళ్లను నమోదు చేసింది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ కు అమీర్ ఖాన్ అతి పెద్ద లక్ష్యాన్నే ముందుంచాడు. సల్మాన్ ఖాన్ తన తాజా చిత్రం 'జై హో' భారీ లక్ష్యాన్ని చేధించేందుకు సిద్దమవుతున్నారు. జనవరి 24 తేదిన 'జై హో' విశ్వవ్యాప్తంగా విడుదలకు ముస్తాబవుతోంది. 'ధూమ్-3' చిత్ర విజయంతో అమీర్ సృష్టించిన ప్రభంజనాన్ని సల్లూభాయ్ అధిగమిస్తారా అనే అంశంపై బాలీవుడ్ లో చర్చ మొదలైంది. గతంలో దబాంగ్ 2 (2012) చిత్రంతో 211 కోట్లు, ఏక్తా టైగర్(2012) తో 263 కోట్ల వసూళ్లను తన ఖాతాలో వేసుకున్న రికార్డులను తన పేరిట సల్మాన్ నమోదు చేసుకున్నారు. -రాజబాబు అనుముల ఇదిలా వుండగా, ధూమ్-3 చిత్రం ఓవారం రోజుల కలెక్షన్లను పరిశీలిస్తే.. విడుదలైన తొలి రోజునే 33 కోట్లు, రెండవ రోజు 30 కోట్లు, మూడవ రోజు 35 కోట్లను, నాలుగవ రోజు 17, ఐదవ రోజు 16 కోట్లను, ఏడవ రోజు 12 కోట్ల వసూళ్లను రాబట్టింది. గతంలో మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్ కే సల్మాన్ సినిమాలు పరిమితమయ్యాయి. కాని తాజా చిత్రం తెలుగులో విజయవంతమైన స్టాలిన్ చిత్రం ఆధారంగా తెరకెక్కిన 'జై హో' చిత్రంలో కమర్షియల్ హంగులతోపాటు, సామాజిక అంశాలు కూడా తోడయ్యాయి. ఈ చిత్రం భారత్ లో 4500 థియేటర్లలో, విదేశాల్లో 650 థియేటర్లలో విడుదలవుతోంది. తొలిసారి సామాజిక అంశంతో సల్మాన్ ఓ ప్రయోగానికి సిద్ధమయ్యారు. సామాజిక అంశంతో సల్మాన్ చేసే ప్రయోగం అభిమానులను ఆకట్టుకోలేక బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతుందా అనే అంశం సల్మాన్ ను గందరగోళానికి గురిచేస్తోందట. ఏది ఏమైనా తన ట్రెండ్ మార్చుకుని సల్మాన్ చేస్తున్న ఓ ప్రయోగం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా? బాక్సాఫీస్ రికార్డులను సొంతం చేసుకునే సత్తా 'జై హో'కు ఉందా అనే ప్రశ్నలకు కొద్ది రోజులాగితే సమాధానాలు దొరకవచ్చు. -
తన రికార్డును తానే బ్రేక్ చేసిన అమీర్
బాలీవుడ్ లో తన రికార్డులను తానే అధిగమించడం 'మిస్టర్ ఫర్ ఫెక్ట్' అమీర్ ఖాన్ కు కొత్తేమి కాదు. ధూమ్ సిరిస్ లో అమీర్ ఖాన్ 'వన్ మ్యాన్ షో' ప్రదర్శన సృష్టిస్తున్న ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 517 కోట్ల రూపాయలను వసూలు చేసిన బాలీవుడ్ చిత్రంగా 'ధూమ్-3' సరికొత్త రికార్డును నెలకొల్పింది. అయితే అమీర్ ఖాన్ గతంలో 3 ఇడియెట్స్ చిత్రం ద్వారా ఓవర్సీస్ మార్కెట్ లో అత్యధికంగా వసూలు చేసిన రికార్డును 'ధూమ్-3'తో బ్రేక్ చేశారు. నాలుగవ వారంలో విజయవంతంగా ప్రదర్శించబడుతున్న ధూమ్-3 చిత్రం ఓవర్సీస్ మార్కెట్ లో 161.85 (26.30 మిలియన్ డాలర్లు)కోట్లు నికర వసూలు చేసింది. దేశీయ మార్కెట్ లో ఈ చిత్రం 276.75 నికర వసూళ్లను రాబట్టింది. -
ఆమిర్‌ఖాన్ స్టార్ కాడట?
భారతీయ సినిమా స్టామినాను రెండొందల కోట్లకు తీసుకెళ్లిన హీరో స్టార్ కాడా? ‘ధూమ్-3’ సినిమా విడుదలై పదిహేను రోజులైంది. ఈ కొద్ది రోజుల్లోనే వసూళ్లు 300 కోట్లు దాటాయి. ఈ స్థాయి వసూళ్లను రాబట్టిన హీరో స్టార్ కాదా? అసలు ఈ ముసుగులో గుద్దులాట దేనికి.. ఆమిర్‌ఖాన్ స్టార్ కాడా? ఈ మాట ఎవరైనా పొరపాటున అంటే.. ‘చిన్న మెదడు చితికిపోయిందేమో’అన్నట్లుగా ఆ మాటలు అన్న వ్యక్తి వైపు జనాలు జాలిగా చూస్తారు. ఎందుకంటే... స్టార్‌గా ఆమిర్కో రేంజ్ ఉంది. ఆయనో సినీ ఎన్సైక్లోపీడియా. దేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరు. అలాంటి ఆమిర్‌ని స్టార్ కాదని ఎవరైనా అంటారా? కానీ అన్నారు. అంత ధైర్యం చేసింది ఎవరనుకుంటున్నారా? ఎవరో కాదు... ఆమిర్‌ఖానే. తాను స్టార్‌ని కాదని మీడియా సాక్షిగా ఆయనే చెప్పారు. ఆమిర్ దృష్టిలో స్టార్ అంటే... చెత్త సినిమాక్కూడా ప్రేక్షకుల్ని రప్పించే సత్తా ఉన్నవాడేనట. అలాంటి స్టార్ బాలీవుడ్లో ఒక్క సల్మాన్‌ఖానే నట. నిజంగా సల్మాన్‌కి ఇంతకు మించిన అవార్డు మరొకటి ఉండదేమో. ‘ధూమ్-3’ చిత్రం ఘనవిజయం నేపథ్యంలో ముంబయ్‌లో ఏర్పాటు చేసిన ఓ విలేకరుల సమావేశంలో ఆమిర్ పై అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఇంకా చెబుతూ -‘‘ప్రేక్షకులను థియేటర్‌కి రప్పించే కెపాసిటీ నిజంగా నాకు లేదు. సెలవుదినమైన ఆదివారం రోజున పెద్ద ఎత్తున ప్రేక్షకులు సినిమా హాళ్లకు తరలివస్తారు. అది ఏ సినిమాకైనా జరిగేదే. అదే విధంగా ప్రతిరోజు ప్రేక్షకులను రప్పించాలంటే... అది గొప్ప స్టార్‌కి మాత్రమే సాధ్యం. నేను కచ్చితంగా అలాంటి స్టార్‌ని కాను. సాధారణ నటుణ్ణి మాత్రమే. సెలవులతో ప్రమేయం లేకుండా ప్రతిరోజూ జనాన్ని థియేటర్‌కి తెప్పించే సామర్థ్యం సల్మాన్‌కి మాత్రమే ఉంది’’ అని సల్మాన్‌ని పొగడ్తలతో ముంచెత్తాడు మిస్టర్ పర్ఫెక్ట్. -
కలెక్షన్ల వసూళ్లలో ధూమ్-3 నెం.1
ధూమ్ సిరీస్ లో భాగంగా తాజాగా విడుదలైన ధూమ్-3 కలెక్షన్ల వర్షాన్ని కురిపించడమే కాకుండా పలు రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. పది రోజుల క్రితం విడుదలైన ధూమ్-3 చిత్రం షారుక్ ఖాన్ చిత్రం చెన్నై ఎక్స్ ప్రెస్, హృతిక్ రోషన్ నటించిన క్రిష్-3 చిత్రాలు వసూలు చేసిన రికార్డులను అధిగమించింది. చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్రం స్వదేశంలో వసూలు చేసిన 226.70 (షేర్), 302 కోట్ల (గ్రాస్), ప్రపంచవ్యాప్తంగా 422 (గ్రాస్) కోట్ల రూపాయల కలెక్షన్లను ధూమ్-3 అధిగమించింది. స్వదేశంలో ధూమ్-3 చిత్రం 233(షేర్) కోట్లను, ప్రపంచవ్యాప్తంగా 430 కోట్ల (గ్రాస్) రూపాయలను వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా చెన్నై ఎక్స్ ప్రెస్ 422 కోట్లు, 3 ఇడియెట్స్ 395, క్రిష్-3 374, ఏక్తా టైగర్ 319, యే జవానీ హై దివానీ 309, దబాంగ్ 265, జబ్ తక్ హై జాన్ చిత్రం 241 కోట్లు వసూలు చేశాయి. ఓవర్సీస్ మార్కెట్ లో 20,000,000 డాలర్లు వసూలు చేసిన మూడవ చిత్రంగా, ప్రపంచవ్యాప్తంగా 430 కోట్లు వసూలు చేసిని బాలీవుడ్ చిత్రంగా ధూమ్-3 రికార్డులకెక్కింది. కేవలం పది రోజుల వ్యవధిలోనే కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న రానున్న సెలవుల్లో ధూమ్-3 మరిన్ని కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. -
రజనీకి నేను వీరాభిమాని
ప్ర: కోలీవుడ్‌లో మీకు నచ్చిన హీరో? జ: నేను సూపర్‌స్టార్ రజనీకాంత్ వీరాభిమానిని. ఆయన హిందీలో నటించిన ఉత్తర దక్షిణ్, జానీ, గిరీఫ్ చిత్రాలు చూసి ఆయన అభిమానిగా మారిపోయూను. నేను అదృష్టంగా భావించే మరో విషయమేమిటంటే... నేను హీరోగా పరిచయమైన తొలి రోజుల్లోనే రజనీకాంత్‌తో ఆతక్ హి ఆతక్ చిత్రంలో నటించే అవకాశం రావడం. అప్పట్లోనే రజనీ చాలా పెద్ద స్టార్ హీరో కావడంతో ఆయనతో నటించడానికి భయపడ్డాను. అప్పుడు రజనీ ఎంతగానో ప్రోత్సహించారు. ఆయన నిరాడంబరత, మానవతా దృక్పథం అన్నింటికీ మించి వృత్తిలో ఆయన నిబద్ధత ఆయనపై నాకున్న గౌరవాన్ని మరింత పెంచాయి. రజనీకాంత్ నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. ఆయనతో కలసి నటించడం గొప్ప అనుభవం. ప్ర: తమిళ సినిమాల రీమేక్‌లో నటిస్తారా? జ: ఇంతకుముందు సూర్య నటించిన గజని చిత్రం చూసి ఆశ్చర్యపోయూను. సూర్య పోషిం చిన పాత్రను నేను అంత బాగా నటించగలనా అన్న సందేహం కలిగింది. ఎందుకంటే అంతవరకు నేను విలన్లతో వీరోచితంగా పోరాడిన సందర్భాలు లేవు. అందువలనే వెంటనే సూర్య కు ఫోన్ చేసి నా అనుమానాన్ని చెప్పాను. అప్పుడాయన మీరు ఖచ్చితంగా చేయగలరని ధైర్యం ఇచ్చారు. దీంతో నేనా చిత్రంలో నటించాను. ప్రస్తుతానికి తమిళ రీమేక్‌లో నటించే ఆలోచన లేదు. ప్ర: కమల్ నటించిన ఉన్నాల్ ముడియుమ్ తంబి హిందీ రీమేక్‌లో మీరు నటించనున్నట్లు ప్రచారం జరిగిందే? జ: తారే జమీన్ పర్ చిత్రానికిగాను గొల్లపూడి అవార్డునందుకోవడానికి చెన్నై వచ్చినప్పుడు ఆ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్‌ను కలుసుకునే అవకాశం కలిగింది. అప్పుడాయన నటన గురించి మెచ్చుకుంటుంటే ఆనంద బాష్పాలు వచ్చాయి. ఇటీవల చెన్నై అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల కోసం చెన్నై వచ్చినప్పుడు కె.బాలచందర్‌ను ప్రత్యేకంగా కలిశాను. ఆయనంటే చాలా గౌరవం. అయితే ఉన్నాల్ ముడియుమ్ తంబి రీమేక్‌లో నటించనున్నారన్నది వదంతి మాత్రమే. ప్ర: తమిళ చిత్రంలో నటిస్తారా? జ: తమిళ చిత్ర పరిశ్రమలో సినీ కళాకారులెందరో ఉన్నారు. ఏ ఆర్ మురుగదాస్, ఏ ఆర్ రెహ్మాన్, చాయాగ్రాహకుడు రవి కె చం ద్రన్ వంటివారు బాలీవుడ్లో గొప్ప పేరు తెచ్చుకున్నారు. నాకు తమిళంలో నటించాలన్న కోరిక ఉన్నా భాష తెలియదు. భాష తెలియని పాత్ర లాంటి అవకాశం వస్తే నటిస్తాను. ప్ర: ధూమ్-3 చిత్రం గురించి? జ: దర్శకుడు కథ చెబుతున్నప్పుడే చాలా ఎగ్జైట్ అయ్యాను. ఈ తరహా చిత్రం ఎప్పుడూ చేయలేదు. ఛాలెంజింగ్‌తో కూడిన పాత్రను ధూమ్-3లో చేశాను. ప్ర: మీ పాత్ర గురించి... జ: నేనిందులో సర్కస్ మాస్టర్. ఈ చిత్రంలో మనుషుల ఫీట్స్, ఆసక్తికరంగా ఉంటాయి. సర్క స్ నేపథ్యంలో పాట కూడా ఉంది. ఈ పాత్ర కోసం చాలా శ్రమించాను. చిత్రంలో ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు సోషల్ మెసేజ్ కూడా ఉంది. ప్ర: ఏ తరహా పాత్రలు పోషించాలని ఆశిస్తున్నారు? జ: నాకు నచ్చిన, ప్రేక్షకులు మెచ్చిన చిత్రాలు చేయాలనుకుంటున్నాను. ఏ తరహా పాత్ర చేసి నా ప్రేక్షకులకు కావలసిన ఎంటర్టైన్మెంట్ అందించాలన్నదే అల్టిమేట్. -
ఆయన్ని అక్కడలా చూసి షాకయ్యాను!
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్‌ఖాన్ భాగ్యనగరంలో హల్చల్ చేశారు. ఆయన నటించిన ‘ధూమ్-3’ చిత్రం ఈ నెల 20న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్ నిమిత్తం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో విలేకరులతో ఆమిర్ ముచ్చటించారు. ఆయనతో పాటు అభిషేక్ బచ్చన్, కత్రినా కైఫ్, ఉదయ్‌చోప్రా, ‘ధూమ్ 3’ దర్శకుడు విజయ్‌కృష్ణ ఆచార్య ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన కెరీర్ గురించి, తన ప్రణాళికల గురించి ఎన్నో ఆసక్తికరమైన విశేషాలు చెప్పారు ఆమిర్. నా కెరీర్లోనే కష్టమైన పాత్ర: 30 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో ప్రయోగాత్మక పాత్రలు పోషించినా... ‘ధూమ్-3’లో పోషించిన సహీర్ పాత్ర మాత్రం నిజంగా నా కెరీర్లో ప్రత్యేకం. స్క్రిప్ట్ విన్నప్పుడే థ్రిల్ ఫీలయ్యాను. ఈ సినిమాను వదులుకోకూడదు అనిపించింది. ఎందుకంటే ఇలాంటి యాక్షన్ అడ్వంచరస్ మూవీ నేను ఇప్పటివరకూ చేయలేదు. శారీరకంగా ఈ సినిమాకు పడ్డ కష్టం నేను ఏ సినిమాకూ పడలేదు. ఇందులో నేను సర్కస్ మాస్టర్ని. ప్రమాదకరమైన సర్కస్ విన్యాసాలను శిక్షకుల సహాయంతో నేర్చుకున్నాను. ట్యాప్ నృత్యంతో పాటు, యాక్షన్ ఎపిసోడ్స్ విషయంలో కూడా చాలా శ్రమించాను. ప్రయోగాలంటే నాకిష్టం: నటునిగా ఇన్నాళ్ల అనుభవంలో నేను తెలుసుకున్న విషయం ఏంటంటే... తేలిగ్గా పోషించే పాత్ర అంటూ ఏదీ ఉండదు. ప్రతి పాత్ర తనదైన సంక్లిష్టతలను కలిగి ఉంటుంది. కాకపోతే దాన్ని అర్థం చేసుకునే విధానంలోనే తేడా. నా వరకూ నేను ప్రయోగాలను ఇష్టపడతాను. ఛాలెంజ్‌గా తీసుకొని చేసే పాత్రల వల్లే నటునికి సంతృప్తి అనేది లభిస్తుంది. అంతేకాదు... నా సినిమాలు 200 కోట్లు, 500 కోట్లు వసూలు చేయాలని నేను కోరుకోను. నా సినిమాను ప్రేక్షకులు ప్రేమించాలని మాత్రమే కోరుకుంటాను. నా సినిమాల్లో ఏదో ఒక అంశం వారిని ఆకర్షించాలి. నా ఫిట్నెస్ రహస్యం అదే: నా తల్లిదండ్రులు ప్రసాదించిన జీన్స్, భగవంతుని దయ... ఈ రెండు కారణాలవల్లే యాభైకి దగ్గరపడుతున్నా... ఇంకా యంగ్‌గా కనిపించగలుగుతున్నా. ఫస్ట్ నుంచి ఆరోగ్యం విషయంలో పెద్దగా శ్రద్ధ పెట్టేవాణ్ణి కాదు. అయితే గత అయిదేళ్ల నుంచి కాస్త కేర్ ఎక్కువ తీసుకుంటున్నా. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నా. అంతేకాక రోజుకు కనీసం ఆరు లీటర్ల నీళ్లు తాగుతున్నా. ఆయనే నాకు ఆదర్శం: ‘ఖయామత్సే ఖయామత్ తక్’ షూటింగ్ జరుగుతున్న రోజులవి. మా సెట్ పక్కనే ఉన్న ఓ రూమ్‌లో ఎవరో ఆర్టిస్టు తమ పాత్రను రిహార్సల్స్ చేసుకుంటున్నారు. చెప్పిన డైలాగునే... మళ్లీ మళ్లీ చెబుతూ గంటల తరబడి రిహార్సల్స్ చేస్తున్నారు. ఒకే డైలాగుని ముప్పై, నలభై సార్లు చెబుతున్నారు ఎవరా... అని డోర్ తెరిచి చూశాను. నాకు గుండె ఆగినంత పనైంది. ఆ గదిలో ఉన్నది సాధారణమైన వ్యక్తి కాదు. ది గ్రేట్ బిగ్‌బీ అమితాబ్. అప్పటికే... ఆయన తిరుగులేని సూపర్‌స్టార్. కానీ... తన పాత్ర కోసం ఆయన పడుతున్న తపన చూసి షాక్‌కి గురయ్యాను. వృత్తి పట్ల అంకితభావం అంటే ఏంటో ఆ సంఘటన ద్వారా నాకు అర్థమైంది. అమితాబ్‌నే స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళుతున్నాను. ఇన్నాళ్ల కెరీర్లో ఆయనతో కలిసి ఒక్కసారి కూడా నటించలేదు. అవకాశం వస్తే మాత్రం వదులుకోను. ‘సత్యమేవ జయతే’ రెండో సెషన్: సామాజిక సమస్యలను స్పృశిస్తూ నా ఆధ్వర్యంలో జరిగిన ‘సత్యమేవ జయతే’ రియాలిటీ షోకు మంచి స్పందన లభించింది. ఎందరో వ్యధార్థుల జీవితాలను దగ్గరగా చూసే అవకాశం ఆ కార్యక్రమం నాకిచ్చింది. త్వరలో ‘సత్యమేవ జయతే’ రెండో సెషన్‌ని ప్రారంభించబోతున్నాను. సమాజాన్ని నిర్వీర్యం చేస్తున్న మద్యపానంపై ప్రజలకు అవగాహన తెచ్చేలా ఈ కార్యక్రమాన్ని రూపుదిద్దుతున్నాం.