సల్మాన్ 'జై హో' అంటాడా?
సల్మాన్ 'జై హో' అంటాడా?
Published Thu, Jan 23 2014 1:44 PM | Last Updated on Sat, Sep 2 2017 2:55 AM
బాలీవుడ్ లో 'ఖాన్'ల ఆధిపత్య పోరాటం కొనసాగుతోంది. గత కొద్దికాలంగా హిందీ చిత్ర పరిశ్రమలో షారుక్, అమీర్, సల్మాన్ ఖాన్ ల మధ్య రికార్డుల యుద్ధం ఆసక్తికరంగా మారింది. ఇటీవల కాలంలో చాలా తక్కువ సమయంలో ఒకరి రికార్డులను మరొకరు తిరగరాస్తున్నారు. గత సంవత్సరం 'చెన్నై ఎక్స్ ప్రెస్'తో షారుక్ (226 కోట్లు), క్రిష్-3 చిత్రంతో హృతిక్ (280 కోట్లు) అత్యధిక కలెక్షన్లను వసూలు చేసి ఓ రికార్డును నెలకొల్పారు. అయితే ఆ సంతోషం ఎక్కువ కాలం షారుక్, హృతిక్ లకు నిలువలేదు. గత సంవత్సరం చివర్లో డిసెంబర్ 20 తేదిన విడుదలైన 'ధూమ్-3' చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డుల వర్షం కురిపించింది. 'ధూమ్-3' చిత్రం విశ్వవ్యాప్తంగా 533 కోట్ల గ్రాస్, బాలీవుడ్ లో 280 కోట్ల నికర వసూళ్లను నమోదు చేసింది.
ప్రస్తుతం సల్మాన్ ఖాన్ కు అమీర్ ఖాన్ అతి పెద్ద లక్ష్యాన్నే ముందుంచాడు. సల్మాన్ ఖాన్ తన తాజా చిత్రం 'జై హో' భారీ లక్ష్యాన్ని చేధించేందుకు సిద్దమవుతున్నారు. జనవరి 24 తేదిన 'జై హో' విశ్వవ్యాప్తంగా విడుదలకు ముస్తాబవుతోంది. 'ధూమ్-3' చిత్ర విజయంతో అమీర్ సృష్టించిన ప్రభంజనాన్ని సల్లూభాయ్ అధిగమిస్తారా అనే అంశంపై బాలీవుడ్ లో చర్చ మొదలైంది. గతంలో దబాంగ్ 2 (2012) చిత్రంతో 211 కోట్లు, ఏక్తా టైగర్(2012) తో 263 కోట్ల వసూళ్లను తన ఖాతాలో వేసుకున్న రికార్డులను తన పేరిట సల్మాన్ నమోదు చేసుకున్నారు.
-రాజబాబు అనుముల
ఇదిలా వుండగా, ధూమ్-3 చిత్రం ఓవారం రోజుల కలెక్షన్లను పరిశీలిస్తే.. విడుదలైన తొలి రోజునే 33 కోట్లు, రెండవ రోజు 30 కోట్లు, మూడవ రోజు 35 కోట్లను, నాలుగవ రోజు 17, ఐదవ రోజు 16 కోట్లను, ఏడవ రోజు 12 కోట్ల వసూళ్లను రాబట్టింది. గతంలో మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్ కే సల్మాన్ సినిమాలు పరిమితమయ్యాయి. కాని తాజా చిత్రం తెలుగులో విజయవంతమైన స్టాలిన్ చిత్రం ఆధారంగా తెరకెక్కిన 'జై హో' చిత్రంలో కమర్షియల్ హంగులతోపాటు, సామాజిక అంశాలు కూడా తోడయ్యాయి. ఈ చిత్రం భారత్ లో 4500 థియేటర్లలో, విదేశాల్లో 650 థియేటర్లలో విడుదలవుతోంది.
తొలిసారి సామాజిక అంశంతో సల్మాన్ ఓ ప్రయోగానికి సిద్ధమయ్యారు. సామాజిక అంశంతో సల్మాన్ చేసే ప్రయోగం అభిమానులను ఆకట్టుకోలేక బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతుందా అనే అంశం సల్మాన్ ను గందరగోళానికి గురిచేస్తోందట. ఏది ఏమైనా తన ట్రెండ్ మార్చుకుని సల్మాన్ చేస్తున్న ఓ ప్రయోగం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా? బాక్సాఫీస్ రికార్డులను సొంతం చేసుకునే సత్తా 'జై హో'కు ఉందా అనే ప్రశ్నలకు కొద్ది రోజులాగితే సమాధానాలు దొరకవచ్చు.
Advertisement
Advertisement