
దక్షిణాది సినీ ప్రపంచానికి ధృవతారలు వాళ్లు. ఒకరు దర్శకదిగ్గజమైతే, మరొకరు స్వరచక్రవర్తి. అందుకే వారి కాంబినేషన్‌లో వచ్చిన ప్రతీ సినిమా ఓ ఆణిముత్యంగా మిగిలిపోయింది. ప్రతీ సినిమా.. అందులోని పాటలు ‘మణిరత్నం’లా నిలిచిపోయాయి. ఈ తరానికి ఒకరు దర్శకత్వానికి మార్గదర్శకంగా మారారు. మరొకరు స్వరాల కొత్త అందాలు చూపారు. ఇద్దరూ ఇద్దరే. వీరిద్దరు ఒకే రోజు జన్మించడం వల్ల వీరిద్దరి భావాలు కలిసిపోయాయేమో. ఈ దర్శకుడి ఆలోచనలకు తన సంగీతంతో ప్రాణం పోశారు రాజా. సినీ ప్రపంచంలో వీరిద్దరు ఎప్పటికీ నిలిచిపోతారు. భారతీయ సినీ చరిత్రలో తమకంటూ కొన్ని పేజీలను లిఖించుకున్న లెజెండ్స్ మణిరత్నం, ఇళయారాజాల పుట్టినరోజు నేడు.
సమాజాన్ని ప్రతిభింబించే సినిమాలను చేయడం మణిరత్నం వంతు. ఆ సమాజాన్ని సైతం తన సంగీతంతో మాయ చేయడం ఇళయరాజా వంతు. మణిరత్నం తీసిన ప్రతీ సినిమా ఈ తరానికి ఒక దిక్సూచి లాంటిదే. అంజలి, గీతాంజలి, నాయకుడు, బొంబాయి, రోజా, ఇద్దరు, సఖి ఇలా ఎన్నో మరుపు రాని చిత్రాలను అందించారు. రోజా సినిమాకు ముందుకు వరకు మణిరత్నం సినిమాలకు ఇళయరాజానే సంగీతం సమకూర్చేవారు. ఆ సినిమాలు ప్రేక్షకుల్లో గుర్తుండిపోవడానికి ఇళయరాజా సంగీతం కూడా ఓ కారణమే.
వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలోని పాటలన్నీ సంగీత ప్రియులకు ప్రియమైనవే. ‘సింగారాల పైరుల్లోనా బంగారాలే పండించాలన్నా’.. ‘అరె చిలకమ్మా చిటికేయంటా... నువ్వు రాగాలే తీయాలంటా’ అంటూ హుషారెత్తించే పాటలను అందించాలన్నా... ‘ఆడజన్మకు ఎన్ని శోకాలో..’, ‘నీ గూడు చెదిరింది.. నీ గుండె పగిలింది.. ఓ చిట్టి పావురమా...’ అంటూ కంటతడిపెట్టించగలరు.
వీరిద్దరు ఎన్నో మధుర గీతాలకు ప్రాణం పోశారు. ‘నిన్నుకోరి వర్ణం వర్ణం.. సరి సరి కలిసేనే నయనం నయనం’, ‘ఒక బృందావనం సోయగం’ అంటూ సంగీత ప్రియులు ఎన్నటికీ గుర్తుంచుకునే గీతాల్ని అందించారు. ఇలా ఎన్నెన్నో పాటలకు ప్రాణం పోశారు వీరిద్దరు. ఇవన్నీ కూడా శ్రవణానందానికే కాకుండా, దృశ్యకావ్యం గానూ మలిచారు మణిరత్నం. ఇక తెలుగులో నేరుగా మణిరత్నం దర్శకత్వం వహించిన ఏకైక సినిమా గీతాంజలి. అది ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. తెలుగు సినిమాల్లో గీతాంజలిది ప్రత్యేకస్థానం. ఈ సినిమాలో ఇళయరాజా అందించిన ప్రతి పాట ఒక అద్భుతం. సినీ ప్రముఖులెందరో సోషల్ మీడియా ద్వారా ఈ ఇద్దరికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment