
ఆస్పత్రి నుంచి ఇళయరాజా డిశ్చార్జ్
చెన్నై: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈయన నాలుగు రోజుల క్రితం గుండె సంబంధిత సమస్యతో చెన్నై అన్నాశాలైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఇళయరాజా రెండేళ్ల క్రితం గుండెపోటుకు గురై శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఇప్పుడు ఆయనకు కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు గుండె రక్తప్రసరణ సమస్యలేమీ లేవని నిర్ధారించారు.
కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని సూచించారు. ఇళయరాజా సోమవారం సాయంత్రమే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరినట్లు ఆయన తమ్ముడు గంగైఅమరన్ కొడుకు, దర్శకుడు వెంకట్‌ప్రభు తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.