
నటనపై ఆకలిగా ఉన్నా!
తమిళసినిమా: నటనపై ఆకలిగా ఉన్నానని, ఎలాంటి పాత్రయినా చేడానికి రెడీ అని అంటోంది నటి పద్మప్రియ. పెళ్లి తరువాత రీఎంట్రీ అయిన నటి జ్యోతిక, అమలాపాల్, మంజువారియర్ వంటి నటీమణులు కథానాయికలుగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. అదే విధంగా ఇంతకు ముందు తమిళం, తెలుగు, మలయాళం అంటూ పలు భాషల్లో నాయకిగా రాణించిన నటి పద్మప్రియ కెరీర్‌లో తవమాయ్ తవమిరిందు, మృగం, పట్టియల్ వంటి సక్సెస్‌ఫుల్ తమిళ చిత్రాలు ఉన్నాయి.
2014లో జాస్మిన్‌షా అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని నటనకు దూరమైంది. అప్పట్లో గ్లామర్ తన వంటికి నప్పదు అంటూ స్టేట్‌మెంట్స్ ఇచ్చిన ఈ అమ్మడికి తాజాగా మళ్లీ నటనపై ఆశ పుట్టిందట. అంతే కాదు ఎలాంటి పాత్ర చేయడానికైనా సిద్ధం అని అంటోంది. ప్రస్తుతం పటేల్‌సర్ అనే తెలుగు చిత్రంలో జగపతిబాబుతో కలిసి నటిస్తున్నానని చెప్పుకొచ్చింది.ఆయనకు జంటగా 15 ఏళ్ల క్రితమే నటించే అవకాశం వచ్చిందని, అప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయానని, మళ్లీ ఇప్పుడు అవకాశం రావడం సంతోషంగా ఉందని అంది. ఇకపై నటనపై దృష్టిసారించి ఎక్కువ చిత్రాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు పద్మప్రియ చెప్పింది.