
హీరోలు, హీరోయిన్లు, నిర్మాతల ఇళ్లపై ఐటీ దాడులు
సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. చెన్నై నగరంలో పలువురు టాలీవుడ్, కోలీవుడ్ నటీనటులు, దర్శకులు, నిర్మాతల ఇళ్లలో బుధవారం తెల్లవారుజామునే ఆదాయపన్ను శాఖ సోదాలు మొదలయ్యాయి. విజయ్ హీరోగా నటించిన పులి సినిమా గురువారం విడుదల కానున్న నేపథ్యంలో ఈ దాడులు మొదలైనట్లు తెలుస్తోంది. మొత్తం 32 చోట్ల ఆదాయపన్ను శాఖ దాడులు చేసింది. తమిళ సూపర్స్టార్ విజయ్ సహా.. పులి సినిమా హీరోయన్లు హన్సిక, శ్రుతిహాసన్ ఇళ్ల మీద కూడా దాడులు జరిగాయి. బాహుబలి సినిమాకు దీటుగా ఈ సినిమాను రూపొందించామని, దానికంటే ఎక్కువ కలెక్షన్లు రాబడతామని నిర్మాత ప్రకటించారు. దాంతో నిర్మాత ఇళ్లు, కళ్యాణమండపాలు, కార్యాలయాలలో సోదాలు కొనసాగుతున్నాయి.
దాంతోపాటు ఈమధ్య కాలంలో పెద్ద సినిమాల్లోను, హిట్ సినిమాల్లోను నటిస్తున్న సమంత, నయనతార తదితర హీరోయిన్ల ఇళ్ల మీద కూడా సోదాలు జరుగుతున్నాయి. కొంతమంది దర్శకుల ఇళ్ల మీద కూడా దాడులు జరిగాయి. ప్రధానంగా రోబో-2 సినిమా తీస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన ప్రముఖ దర్శకుడు శంకర్ ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలకు పేరొందిన ఏజీఎస్ ఫిలింస్ సంస్థ ఏడాదికి దాదాపు 200-300 కోట్ల వరకు ఖర్చుపెడుతోంది. దాంతో ఆ సంస్థకు చెందిన నిర్మాతల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరిగాయి.