ప్రమాదస్థలి.. ఇన్‌సెట్‌లో కమల్‌హాసన్‌తో అమృతరామ్
సాక్షి, చెన్నై : భారతీయుడు–2 సినిమా షూటింగ్‌లో బుధవారం రాత్రి చోటుచేసుకున్న భారీ ప్రమాదం నుంచి హీరో కమల్‌హాసన్, హీరోయిన్ కాజల్ అగర్వాల్ తృటిలో తప్పించుకున్నారు. ప్రమాదం జరగడానికి 10 సెకన్ల ముందు వారు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ విషయాన్ని కాస్టూమ్ డిజైనర్ అమృతరామ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ‘ఘోర ప్రమాదం నుంచి కొద్దిలో తప్పించుకున్నాం. 10 సెకన్ల తేడాతో క్రేన్ ప్రమాదం నుంచి బయటపడ్డాం. మీ ఆశీర్వాదాల కారణంగానే కమల్ సార్, కాజల్, నేను సురక్షితంగా ఉన్నాం. మేము బస చేసిన టెంట్‌పైనే భారీ క్రేన్ కూలిపోయింది. మేమంతా క్షేమంగా ఉన్నాం. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సహచరుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాన’ని అమృత ట్వీట్ చేశారు.
అసలేం జరిగింది?
ఊహించని ఈ ఘటన తమను దిగ్భ్రాంతికి గురి చేసిందని ‘ఇండియా టుడే’తో అమృత అన్నారు. ఫైటింగ్ సీన్ తీసేందుకు రెడీ అవుతుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుందని తెలిపారు. అప్పటికే రెండు సీక్వెన్స్ పూర్తి చేసి మూడోది తీసేందుకు సమాయత్తమవుతుండగా ఈ ఘటన జరిగిందని వెల్లడించారు. ప్రమాదజరిగిన తర్వాత కొన్ని నిమిషాల పాటు తాను షాక్‌లో ఉండిపోయానని చెప్పారు. ‘దర్శకుడు శంకర్ సార్ నాలుగు రోజులుగా భారీ ఫైటింగ్ సీక్వెన్స్ తీస్తున్నారు. అప్పటివరకు అంతా సవ్యంగానే సాగింది. గతరాత్రి మేము రెండు షాట్స్ పూర్తి చేశాం. మూడో షాట్‌కు రెడీ అవుతుండగా సెకన్ల వ్యవధిలో ప్రమాదం జరిగిపోయింది. తర్వాతి షాట్‌కు జరుగుతున్న రిహార్సల్‌ను, లైటింగ్‌ను శంకర్, సినిమాటోగ్రాఫర్ లైటింగ్ పరిశీలిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనా స్థలికి కొద్ది దూరంలోనే వారిద్దరూ ఉన్నారు.
కమల్‌హాసన్ సార్, కాజల్ అగర్వాల్, నేను, మాతో పాటు ఉన్న హాలీవుడ్ మేకప్‌మేన్ మానిటర్ టెంట్‌లో కబుర్లు చెప్పుకుంటున్నాం. ఇంతలోనే క్రేన్ అంటూ పెద్దగా అరుపులు వినిపించడంతో టెంట్ నుంచి బయటకు పరుగులు తీశాం. తర్వాత వచ్చి చూస్తే భారీ క్రేన్ కూలిపోయింది. అంతా సెకన్ల వ్యవధిలో జరిగిపోయింది. కొద్ది నిమిషాల పాటు నా మెదడు స్తంభించిపోయింది. కమల్, కాజల్ కూడా షాక్‌కు గురయ్యారు. గతంలో ఎన్నో ప్రమాదాలకు గురైన కమల్ సార్ వెంటనే తేరుకుని అందరినీ అప్రమత్తం చేశారు. అంబులెన్స్ వచ్చే వరకు వేచివుండకుండా క్షతగాత్రులను మనమే ఆస్పత్రికి తీసుకెళదామని అన్నారు. తన సినిమా సెట్‌లో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో శంకర్ సార్ చాలా ఆవేదనకు గురయ్యారు. శృతిహాసన్ ఫోన్ చేసి ప్రమాదం గురించి చెప్పాను. తన తండ్రికి ఏమీ కాలేదన్న విషయం తెలియడంతో ఆమె ఊపిరి పీల్చుకుంది. సెట్‌లోని మిగతా వారి గురించి కూడా శృతి ఆరా తీసింది. షూటింగ్ జరుగుతున్నప్పుడు ప్రమాదం జరిగితే ఎలా ఉంటుందో తలుచుకుంటేనే వణుకు పుడుతోంద’ని అమృత అన్నారు.
ప్రాణాలు కోల్పోయింది వీరే..
ఈ దుర్ఘటనలో ముగ్గురు మంచి సాంకేతిక నిపుణులను పోగొట్టుకున్నామని లైకా ప్రొడక్షన్స్ తెలిపింది. సహాయ దర్శకుడు కృష్ణ, ఆర్ట్ అసిసెంట్ చంద్రన్, ప్రొడక్షన్ అసిస్టెంట్ మధు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది. భారతీయుడు–2 సినిమా షూటింగ్ సెట్‌లో ప్రమాదం జరగడం తమను ఎంతోగానో బాధించిందని ఒక ప్రకటనలో పేర్కొంది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment