సాక్షి, చెన్నై: భారతీయుడు–2 సినిమా షూటింగ్ సెట్ ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు టెక్నీషియన్ల కుటుంబాలకు హీరో కమల్‌హాసన్ ఆపన్న హస్తం అందించారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు. భారతీయుడు–2 సినిమా షూటింగ్ సెట్‌లో బుధవారం రాత్రి భారీ క్రేన్ పడిపోవడంతో సహాయ దర్శకుడు కృష్ణ, ఆర్ట్ అసిస్టెంట్ చంద్రన్, ప్రొడక్షన్ అసిస్టెంట్ మధు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన తనను ఎంతగానో కలచివేసిందని కమల్‌హాసన్ ట్విటర్‌లో పేర్కొన్నారు. గాయపడిన 9 మంది తొందరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆకాంక్షించారు. కాగా.. మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల చొప్పున, గాయపడిన వారికి తలా 50 లక్షలు ఇవ్వనున్నట్టు లైకా నిర్మాణ సంస్థ తెలిపింది. (భారతీయుడు–2 ప్రమాదం: ఎలా జరిగింది?)
మాటలు రావడం లేదు: కాజల్
గుండెను బరువెక్కించే ఈ ఘటన గురించి చెప్పడానికి మాటలు రావడం లేదని హీరోయిన్ కాజల్ అగర్వాల్ ట్వీట్ చేశారు. ఊహించని దుర్ఘటనలో ముగ్గురు సహచరులను కోల్పోవడం పూడ్చలేని లోటు అని పేర్కొన్నారు. కృష్ణ, చంద్రన్, మధుల మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ బాధను తట్టుకునే శక్తిని వారి కుటుంబాలకు దేవుడు ప్రసాదించాలని కోరుకున్నారు. సెట్‌లో జరిగిన ప్రమాదం తనను ఎంతగానో దిగ్భ్రాంతికి గురిచేసిందని, కళ్లుమూసి తెరిచేలోగా అంతా జరిగిపోయిందన్నారు. ప్రమాదం నుంచి తృటిలో బయటపడిన తాను, ఈ ఘటనతో సమయం, జీవితం విలువ గురించి ఎంతో నేర్చుకున్నానని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment