సెల్ఫీ అంటే కష్టమే | Interview With Seerat Kapoor Regarding His Family Journey | Sakshi
Sakshi News home page

ఇంకా చాలా నేర్చుకోవాలి

Published Thu, Jul 2 2020 4:53 AM | Last Updated on Thu, Jul 2 2020 11:49 AM

Interview With Seerat Kapoor Regarding His Family Journey - Sakshi

‘రన్‌ రాజా రన్‌’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్‌గాపరిచయం అయ్యారు సీరత్‌ కపూర్‌. ఆ తర్వాత ‘టైగర్‌’, ‘రాజుగారి గది 2’,‘ఒక్క క్షణం’ వంటి చిత్రాల్లో సీరత్‌ నటనకు ప్రేక్షకులు మంచి మార్కులేవేశారు. ఇటీవల ఓటీటీలో విడుదలైన‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీల’ చిత్రంలోకథానాయికగా నటించారు సీరత్‌.ఈ సందర్భంగా తన కెరీర్‌ జర్నీగురించి సీరత్‌ ఈ విధంగా చెప్పారు.

‘కృష్ణ అండ్‌ హీజ్‌ లీల’లో చేసిన పాత్ర గురించి?
ఎవరి మీదా ఆధారపడని ఆత్మవిశ్వాసం ఉన్న అమ్మాయి పాత్రను ఇందులో చేశాను. ఇతరులు చెప్పింది వింటుంది కానీ తన నిర్ణయానికే ప్రాధాన్యం ఇస్తుంది.
ఈ క్యారెక్టర్‌ గురించి డైరెక్టర్‌ రవికాంత్‌ చెప్పినప్పుడు ఆసక్తికరంగా అనిపించింది. ఎందుకంటే నా నిజజీవితానికి కాస్త దగ్గరగా ఈ పాత్ర ఉంటుంది. కరోనా కారణంగా ప్రస్తుతం థియేటర్స్‌ ఓపెన్‌ చేసి లేవు. లాక్‌డౌన్‌ వల్ల ఆడియన్స్‌ ఇంట్లోనే ఉంటున్నారు. ఇప్పుడు ఓటీటీ మంచి ఆప్షన్‌. మంచి కంటెంట్‌ ఉన్న మా సినిమా ఆదరణ పొందుతోంది. 

లాక్‌డౌన్‌ వల్ల కొందరి జీవనశైలి గాడి తప్పింది.. 
అవును. చాలా బాధగా ఉంది. అదే సమయంలో నాకింత సౌకర్యవంతమైన జీవితాన్ని ఇచ్చిన ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి. లైఫ్‌లో ఎలాంటి ఇబ్బంది లేని అమ్మాయిగా ఇతరుల పట్ల దయగా ఉండాలని, ఎవరినీ అనవసరంగా నిందించకూడదని, చేతనైతే సహాయం చేయాలని, ఎవరికీ హాని చేయకూడదని బలంగా నిర్ణయించుకున్నాను.

హీరోయిన్‌ కావడం వల్ల స్వేచ్ఛ కోల్పోయినట్లు అనిపిస్తోందా? 
తెరపై మమ్మల్ని చూసి చాలామంది ఇష్టపడతారు. అదే సమయంలో మా వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంటారు. సినిమా స్టార్స్‌ ఎవరైనా వ్యక్తిగత జీవితాలకు సంబంధించి కొన్ని త్యాగాలు చేయక తప్పదు. యాక్టర్స్‌ కనిపించినప్పుడు  ఫ్యాన్స్‌ సెల్ఫీ అడుగుతారు. షూటింగ్‌ చేసి, అప్పటికే అలసిపోయి ఉంటాం. ఒకవేళ షూటింగ్‌కి వెళ్తుంటే సమయానికి లొకేషన్‌కు చేరుకునే టెన్షన్‌లో ఉంటాం. అప్పుడు సెల్ఫీ అంటే కష్టమే. కానీ అభిమానుల ప్రేమను అర్థం చేసుకోవాలి. వారి ప్రేమ వెలకట్టలేనిది.

మీ లైఫ్‌లో లవ్‌ ప్రపోజల్స్‌ ఉన్నాయా? 
ఎక్కువేం రాలేదు కానీ కొన్ని వచ్చాయి. కాలేజ్‌ డేస్‌లో కొంతమంది అబ్బాయిలు ప్రపోజ్‌ చేశారు కూడా. అబ్బాయిలు అంత ధైర్యంగా అమ్మాయిలకు ఎలా ప్రపోజ్‌ చేస్తారా? అని నవ్వుకునేదాన్ని. ఆ విషయంలో అబ్బాయిలంటే నాకు గౌరవం ఏర్పడింది. అయితే నేను ఎవరి లవ్‌నీ అంగీకరించలేదనుకోండి (నవ్వుతూ). 
∙కరోనా ‘భౌతిక దూరం’ పాటించాలంటోంది.. మరి.. షూటింగ్‌లు ఆరంభమయ్యాక రొమాంటిక్‌ సీన్స్‌ చేయాలంటే.. 
కథలోని పాత్ర డిమాండ్‌ చేస్తే ఆ సీన్స్‌లో నటిస్తాను. తప్పదు. అయితే ఇకనుంచి షూటింగ్స్‌ అన్నీ కరోనాకి తగ్గట్టుగా జరుగుతాయి కదా. చూడాలి మరి..

మీ తర్వాతి ప్రాజెక్ట్స్‌? 
‘మా వింత గాధ వినుమా’ సినిమా చేస్తున్నాను. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement