ఇది ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కానేకాదు | is ​history doctrined gowtami putra shatakarni | Sakshi
Sakshi News home page

ఇది ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కానేకాదు

Published Tue, Jan 10 2017 4:58 PM | Last Updated on Tue, Sep 5 2017 12:55 AM

is ​history doctrined gowtami putra shatakarni

న్యూఢిల్లీ: గౌతమీపుత్ర శాతకర్ణితోనే శాలివాహన శకం ప్రారంభమైందని, అప్పటి నుంచే తెలుగువారు ఉగాది పండుగను జరపుకోవడం మొదలైందని ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ చిత్రంలో ఉన్నట్లు సోషల్‌ మీడియా కోడై కూస్తోంది. అదే నిజమైతే చరిత్రను పూర్తిగా వక్రీకరించినట్లే. చరిత్రను హృద్యంగా, అందంగా తెరకెక్కించడానికి వాస్తవానికి కాల్పనికతను జోడించవచ్చు. కానీ వాస్తవాన్ని వక్రీకరించేలా అభూత కల్పనలు ఉండరాదు.

గౌతమీపుత్ర శాతకర్ణితోనే శాలివాహన శకం ప్రారంభం అయిందనడం చారిత్రక తప్పిదం. అసలు గౌతమీపుత్ర శాతకర్ణికి, శాలివాహనుడికి సంబంధమే లేదు. ఆంధ్ర శాతవాహనుల వంశానికి చెందిన 25వ రాజు గౌతమీపుత్ర శాతకర్ణి, శాలివాహనుల వంశానికి చెందిన రాజు శాలివాహనుడు. శాతకర్ణి కలియుగంలో 2,669 నుంచి 2,694 వరకు అంటే క్రీస్తు పూర్వం 433 నుంచి 408 వరకు అంటే, దాదాపు పాతికేళ్లు ‘గిరి వ్రజం’ను రాజధాని చేసుకొని భారత దేశాన్ని పరిపాలించారు.

ఆ తర్వాత శాతకర్ణి చనిపోయాక దాదాపు 485 ఏళ్ల తర్వాత, అంటే క్రీస్తు శకం 78లో ప్రమర వంశానికి చెందిన శాలివాహనుడితో శాలివాహన శకం ప్రారంభమైంది. ఆయన ఉజ్జయనిని రాజధానిగా చేసుకొని భారత్‌ను పాలించారు. గిరివ్రజం ప్రస్తుతం బీహార్‌లో ఉండగా, ఉజ్జయిని మధ్యప్రదేశ్‌లో ఉంది. భారత్‌ను పాలించిన రాజవంశాల్లో శాతకర్ణిది ఎనిమిదవ వంశంకాగా, శాలివాహనుడిది పదవ వంశం. అలాంటప్పుడు శాతకర్ణితోనే శాలివాహనుల శకం ప్రారంభమైందని ఎలా చెబుతారు?

ఇక ఉగాది పండుగను దేశంలో ఒక్క తెలుగువారే జరుపుకోరు. కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన వారు కూడా జరుపుకుంటారు. కలియుగం ప్రారంభానికే ముందు నుంచి ఉగాది పండుగను మనం జరుపుకుంటున్నట్లు చారిత్రక, ఇతిహాసక ఆధారాలు ఉన్నాయి. కలియగం నుంచి లెక్కేసుకున్నా చంద్రమానం ప్రకారం ఈ దుర్ముఖి నామ సంవత్సరానికి కలియుగం ప్రారంభమై 5,118 సంవత్సరాలు. గౌతమీపుత్ర శాతకర్ణి పాలన కలియుగంలో 2,669 ఏళ్లనాడు ప్రారంభమైనదంటే, ఆయన పాలనకన్నా దాదాపు 2,500 సంవత్సరాలకు పూర్వం నుంచే ఉగాది పండుగను ప్రజలు జరుపుకుంటున్నారు. అలాంటప్పుడు శాతకర్ణితో ఉగాది పండుగ ఎలా ప్రారంభమవుతుంది?
గౌతమీపుత్ర శాతకర్ణి, శాలివాహనుడు వేర్వేరు కాలానికి చెందిన రాజులే అయినప్పటికీ దేశభక్తి కలిగిన వీరులు. వీరిద్దరికి వీరోచిత చరిత్ర ఉంది. వీరిద్దరిపైనా వేర్వేరుగా చారిత్రక సినిమాలు తీసి ప్రేక్షకులను మెప్పించే అవకాశం ఉంది. ఇద్దరి చరిత్రను కలిపినట్లయితే అది చరిత్రను వక్రీకరించినట్లే అవుతుంది. సంస్కృతంలో బాస మహాకవి రాసిన ‘చారుదత్తా’కు శూద్రుడు రాసిన ‘మృత్య్సకటికం’ నాటకంలోని ఓ భాగాన్ని జోడించి ప్రముఖ దర్శకుడు గిరీష్‌ కర్ణాడ్‌ ‘ఉత్సవ్‌’ పేరిట నాటి సంస్కతిని కళ్లకు కట్టినట్లు తీశారు. చరిత్రను వక్రీకరించకుండా అలాంటి ప్రయోగం చేయవచ్చు. చరిత్రేదో, కల్పనేదే ప్రేక్షకులకు తెలిసేలా ఉండాలి. తప్పుదారి పట్టించేలా ఉండరాదు.

గౌతమీపుత్ర శాతకర్ణితోనే శాలివాహన శకం ప్రారంభమైందని, ఉగాది పండుగ ప్రారంభమైందని  చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, హీరో బాలకష్ణ ఘంటా పథంగా చెప్పారట. వారికి రాసిచ్చిన స్క్రిప్టులో లోపం వుండవచ్చు. కానీ సినిమాకు రాసిన స్క్రిప్టులో కూడా లోపం ఉంటే అది ఎంతమాత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కాదు, ‘క్రిష్‌పుత్ర శాతకర్ణి’ అవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement