ఇప్పుడేం ఒత్తిడి లేదు.. పూర్తి స్వేచ్ఛా జీవిని
న్యూఢిల్లీ: తానిప్పుడు పూర్తిగా స్వేచ్ఛా జీవినని, కొంత బాధ్యతలను పక్కకు పెట్టి ఆనందంగా గడిపేందుకు సరైన సమయం ఇదేనని భావిస్తున్నానని ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు వికాస్ బాల్ అన్నారు. గతంలో క్వీన్ అనే చిత్రానికి దర్శకత్వం వహించి హిట్ కొట్టిన ఆయన ఆ చిత్ర సమయంలో పూర్తి ఒత్తిడిలో ఉన్నట్లు తెలిపారు. తనపై ఏదో భారం ఉందని, కొంత భయంగా ఉండేదని చెప్పారు.
కానీ, ఆ చిత్రం నమోదు చేసిన విజయంతో తనపై తనకు పూర్తి విశ్వాసం వచ్చిందని, కొంత స్వేచ్ఛగా ఉన్నానని చెప్పారు. షాహిద్ కపూర్, అలియాభట్ హీరో హీరోయిన్లుగా షాందార్ అనే చిత్రాన్ని ఆయన తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం అక్టోబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆ చిత్ర తాలూకు అంశాలు పంచుకుంటూ షాందార్ చిత్రం విషయంలో తనకు ఎలాంటి భయం, ఆందోళన, ఒత్తిడి లేదని చెప్పారు. ఇప్పుడు సంతోషంగా ఉండేందుకు సరైన సమయం అని భావిస్తున్నానని చెప్పారు.